సాక్షిప్రతినిధి, ఖమ్మం: రేవంత్‌రెడ్డి రాజీనామా వ్యవహారం రాష్ట్రంలోని టీడీపీ వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తుండగా.. జిల్లాలోని అధికార టీఆర్‌ఎస్ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేత రేవంత్‌రెడ్డితో జిల్లా టీడీపీ నాయకుల అనుబంధాన్ని పరిగణనలోకి తీసుకుని అనేక మంది నేతలు ఆయన బాటలో నడుస్తారని భావించినప్పటికీ టీడీపీ ముఖ్య నేతలు మాత్రం తమ నిర్ణయాన్ని ప్రకటించకుండా పార్టీలోనే కొనసాగుతున్నారు. మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ నేత పోట్ల నాగేశ్వరరావు ఆదివారం కొడంగల్‌లోని రేవంత్‌రెడ్డి నివాసంలో ఆయనతో భేటీ కావడంతో అధికార పార్టీలో చర్చనీయాంశమైంది. కొంతకాలంగా టీఆర్‌ఎస్‌పై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్న పోట్ల పార్టీలో సరైన గుర్తింపు లేదని మథన పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 2009లో స్థానిక సంస్థల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్సీగా గెలుపొందిన పోట్ల 2015 వరకు టీడీపీ తరఫున కొనసాగారు.
జిల్లాలో సంభవించిన అనూహ్య రాజకీయ పరిణామాల నేపథ్యంలో 2016 ఆయన టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. టీడీపీలో సీనియర్ నాయకుడిగా, పలుసార్లు సుజాతనగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన నేతగా..పార్టీలో రాష్ట్రస్థాయి పదవులు చేపట్టిన నేతగా పేరొందిన పోట్ల కాంగ్రెస్ వైపు చూడటం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఆదివారం రేవంత్‌రెడ్డిని కలిసిన పోట్ల నాగేశ్వరరావు ఆయనతో జిల్లా రాజకీయ అంశాలు చర్చించినట్లు తెలిసింది. కాంగ్రెస్ పార్టీలో చేరే జాబితాలో పోట్ల నాగేశ్వరరావు పేరును చేరుస్తున్నారని రేవంత్‌రెడ్డి నేరుగా పోట్లతో చెప్పినా.. పోట్ల మాత్రం తాను నిర్ణయం తీసుకునేందుకు సమయం కావాలని కోరినట్లు సమాచారం. రేవంత్‌రెడ్డిని కలిసిన 24 గంటల్లోపే పోట్ల నాగేశ్వరరావు సోమవారం సాయంత్రం కేంద్ర మాజీ మంత్రి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని కలిశారు. ఆమెతో సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం కాంగ్రెస్‌లోకి వెళ్లేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది.
బుజ్జగింపు యత్నాలు
కాగా.. పోట్ల నాగేశ్వరరావు టీఆర్‌ఎస్‌ను వీడుతున్న అంశం రాజకీయ వర్గాల్లో కలకలం రేపింది. దీంతో సోమవారం హైదరాబాద్‌లో ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఎమ్మె ల్యే పువ్వాడ అజయ్‌కుమా ర్ పోట్లను బుజ్జగించే ప్రయత్నం చేసినట్లు తెలు స్తోంది. అయితే పార్టీలోకి వచ్చాక తనకు ఎటువంటి ప్రాధాన్యత లభించడం లేదని, పార్టీలో చేరినప్పుడు గుర్తింపు ఇస్తామని చెప్పినా.. పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసినట్లు సమాచారం. సోమవారం సాయంత్రం పోట్ల హైదరాబాద్‌లో రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరిని కలిసి జిల్లాలో రాజకీయ పరిస్థితులు, పార్టీ పరిస్థితుల గురించి, తన రాజకీయ భవిష్యత్ గురించి సమగ్రంగా చర్చించినట్లు తెలుస్తోంది.
దీంతో రేణుకా చౌదరి కలిసికట్టుగా కాంగ్రెస్‌ను బలోపేతం చేద్దామని, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చినట్లు పోట్ల వర్గీయుల ద్వారా ప్రచారం జరుగుతోంది. అయితే స్నేహితుడిగా, టీడీపీలో సహచరుడిగా రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్‌లో చేరే అంశంపై సమాలోచన జరిపినా.. ఆయనతోపాటు మాత్రం కాంగ్రెస్‌లో చేరకుండా .. కొంత సమయం తీసుకోవాలని నిర్ణయించారు. ఒకటి, రెండు తేదీల్లో తన అనుచరులతో పార్టీ మారే అంశంపై సమాలోచనలు చేసి వారి అభీష్టం మేరకు కాంగ్రెస్‌లో చేరే అంశంపై తుది నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. ఈనెల 9న అఖిల భారత కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ మహబూబాబాద్‌లో జరిగే గిరిజన సదస్సులో పాల్గొనే అవకాశం ఉంది.
ఈలోపే పోట్ల కాంగ్రెస్ తీర్థం పుచ్చుకునేందుకు ఏర్పాట్లు చేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇక టీడీపీలో ఉన్న ద్వితీయ శ్రేణి నాయకులు పలువురు అధికార పార్టీవైపు చూస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కల్లూరుకు చెందిన వ్యవసాయ మార్కెట్ మాజీ చైర్మన్ యాదయ్య, తల్లాడకు చెందిన టీడీపీ సీనియర్ నేత ఒకరు, ఖమ్మంకు చెందిన టీడీపీ జిల్లా మాజీ కార్యదర్శి పి.వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్ తీర్థం పుచ్చుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు సమాచారం. పోట్ల నాగేశ్వరరావు కాంగ్రెస్‌లో చేరితే పార్టీ పరంగా జిల్లాస్థాయిలో కీలక బాధ్యతలు అప్పగించే అవకాశం ఉన్నట్లు పోట్ల అనుచరులు భావిస్తున్నారు. ఈ అంశంపై మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ నేత పోట్ల నాగేశ్వరరావుతో ప్రస్తావించగా.. టీఆర్‌ఎస్ పార్టీ పట్ల తనకు అసంతృప్తి ఉన్న మాట వాస్తవమని, కాంగ్రెస్‌లో చేరే అంశాన్ని తన సహచరులు, అనుచరులతో చర్చించి నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. రెండు, మూడు రోజుల్లో ఖమ్మంలో తన అనుచరులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment