యాత్రల పేరిట వచ్చే పార్టీలను తరిమికొట్టాలి
సూర్యాపేట : కొత్తగా ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్రంలో టీఆర్‌ఎస్ పార్టీ అధికారం చేపట్టి నాలుగు మాసాలైనా గడవకముందే అభివృద్ధి చేయలేదంటూ గ్రామాలకు యాత్రల పేరుతో వచ్చే టీడీపీ, కాంగ్రెస్ నాయకులను ప్రజలు తరిమి కొట్టాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం జే ఫంక్షన్ హాల్‌లో ఏర్పాటు చేసిన సూర్యాపేట నియోజకవర్గ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. టీడీపీనేతలు బస్సు యాత్ర మాని కాశీ యాత్ర చేపట్టాలని ఎద్దేవా చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్నది టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు అని ఆరోపించారు.
అలాగే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయిన తర్వాత విద్యుత్ పీపీఏ ఒప్పందాలను రద్దు చేసి కరెంటు కోతలకు బాబు కారణమయ్యారని తెలిపారు. అభివృద్ధిని అడ్డుకుంటున్న ఆపార్టీ నేతలే అభివృద్ధి చేయడం లేదంటూ యాత్రల పేరుతో గ్రామాలకు వస్తే తెలంగాణ ప్రజలు తగిన బుద్ధి చెబుతారన్నారు. కాంగ్రెస్ పాలనలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై నోరు మెదపని పొన్నాల, జానారెడ్డిలు నేడు అన్ని వర్గాల ప్రజలకు ఉపయోగపడేలా ముఖ్యమంత్రి కేసీఆర్ వినూత్న పథకాలు అమలు చేస్తుంటే విమర్శించడం సిగ్గుచేటన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ ఇళ్లు, తదితర సంక్షేమ పథకాల అమలులో కాంగ్రెస్ నేతలు అనేక అక్రమాలకు పాల్పడ్డారని, వాటన్నింటిపై ప్రభుత్వం విచారణ చేసి బయటకు తీస్తుందన్నారు. అక్రమాలకు పాల్పడిన కాంగ్రెస్ నేతలను జైలులో పెట్టేందుకు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోవన్నారు.
టీఆర్‌ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా ఈ నెల 11, 12 తేదీల్లో నిర్వహించే ప్లీనరీ, బహిరంగ సభలకు నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాల నుంచి నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలన్నారు. సూర్యాపేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. గతంలో ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించిన నేతలు వ్యవహరించినట్టు కాకుండా ప్రజా సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానన్నారు.ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ గండూరి ప్రవళ్లిక, టీఆర్‌ఎస్ నాయకులు ఒంటెద్దు నర్సింహారెడ్డి, కట్కూరి గన్నారెడ్డి, కాకి దయాకర్‌రెడ్డి, వై.వెంకటేశ్వర్లు, నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, గండూరి ప్రకాష్, మోదుగు నాగిరెడ్డి, అప్పిరెడ్డి, కాకి కృపాకర్‌రెడ్డి, తూముల ఇంద్రసేనారావు, కరుణాకర్‌రెడ్డి, ఉప్పల ఆనంద్, శనగాని రాంబాబుగౌడ్, ఉయ్యాల వెంకటేశ్వర్లు, మారిపెద్ది శ్రీనివాస్, ఎంపీపీలు కసగాని లక్ష్మి, భూక్య పద్మ, జెడ్పీటీసీ పెరుమాళ్ల సంపత్‌రాణి, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.