గులాబీ గుబాళింపు
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: మండల పరిషత్ అధ్యక్ష ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్ పార్టీ హవా కొనసాగించింది. శుక్రవారం మండల పరిషత్ అధ్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు పరోక్ష ఎన్నికలు జరిగాయి. మెజార్టీ ఉన్నచోట టీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీలు ఎంపీపీ పదవులను కైవసం చేసుకోగా, బలంలేని చోట్ల ఇతర పార్టీల మద్దతుతో పదవులను పొందాయి. టీఆర్‌ఎస్.. 29 మండల పరిషత్ అధ్యక్ష పదవులను కైవసం చేసుకుంది.
కాగా టీఆర్‌ఎస్ మద్దతుతో మండల పరిషత్ అధ్యక్షులుగా ఎన్నికైన కొంతమంది త్వరలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకోనున్నట్టు సమాచారం. దీంతో టీఆర్‌ఎస్ అత్యధిక ఎంపీపీ పదవులను తమ ఖాతాలో జమ చేసుకోనుంది. మండల పరిషత్ ఉపాధ్యక్ష పదవులు సైతం అత్యధికంగా టీఆర్‌ఎస్ పరమయ్యాయి. ‘స్థానిక’ంగా జరిగిన ఎన్నికల్లో మంత్రి హరీష్‌రావు మంత్రాంగం ఫలించిందని చెప్పుకోవచ్చు. కాంగ్రెస్ పార్టీ 15 మండలాల్లో పరిషత్ అధ్యక్ష పదవులను దక్కించుకుంది.
తెలుగుదేశం పార్టీ కేవలం తూప్రాన్ మండల పరిషత్ అధ్యక్ష పదవిని మాత్రమే కైవసం చేసుకున్నా.. గంటల వ్యవధిలో ఆ ఎంపీపీ టీఆర్‌ఎస్‌లో చేరడం గమనార్హం. కంగ్టి, రేగోడ్‌లో హంగ్ నేపథ్యంలో ఎన్నికల అధికారులు డ్రా ద్వారా ఎంపీపీ అధ్యక్షులను ఎన్నిక చేశారు. సదాశివపేట మండల అధ్యక్ష పదవి ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన కోరం లేకపోవటంతో ఆ ఎన్నికను శనివారానికి వాయిదా వేశారు.
శివ్వంపేట మండల పరిషత్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీల నాయకులు ఘర్షణకు దిగారు. దీంతో పోలీ సులు లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. మండలంలో 13ఎంపీటీసీ సభ్యులలో టీఆర్‌ఎస్ 9, కాంగ్రెస్ 3, స్వతంత్ర అభ్యర్థిగా ఒకరు గెలిచారు. ఎంపీపీ అధ్యక్ష పదవికి టీఆర్‌ఎస్ పార్టీ మన్సూర్ పేరును ప్రతిపాదించగా అదే పార్టీకి చెందిన కల్లూరి హరికృష్ణ తమ పార్టీలోని కొంతమంది సభ్యులతో పాటు కాంగ్రెస్ సభ్యుల మద్దతు కూడగట్టుకుని మండల అధ్యక్షునిగా గెలిచారు. మండల ఉపాధ్యక్షురాలిగా టీఆర్‌ఎస్ నుంచి పి. లావణ్య, కాంగ్రెస్ నుంచి జ్యోతి పోటీపడ్డారు. ఎంపీపీ అధ్యక్షునిగా గెలిచిన కల్లూరి హరికృష్ణ టీఆర్‌ఎస్ అభ్యర్థికి కాకుండా కాంగ్రెస్ అభ్యర్థి జ్యోతి మద్దతు పలకటం గొడవకు దారి తీసింది. ఉపాధ్యక్షరాలిగా పోటీ చేసిన లావణ్య మద్దతుదారులు మండల పరిషత్తు కార్యాలయం లోపలికి వచ్చి తమ అభ్యర్థితో ఓటు వేయించుకుని మాకు మద్దతు పలకాలంటూ హరికృష్ణను నిలదీశారు. కార్యాలయంలోనే అతనితో గొడవకు దిగారు. ఎంపీపీ కార్యాలయంలోని ఫర్నిచర్‌ను ధ్వంసం చేశారు. దీంతో పోటీసులు రంగప్రవేశం చేసి నాయకులపై లాఠీలు ఝుళిపించి గొడవ సద్దుమణిగేలా చూశారు.
ఇదిలా ఉండగా హత్నూర మండల పరిషత్ ఎన్నిక సందర్భంగా స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఆర్‌ఎస్ పార్టీ బలపర్చిన అభ్యర్థి కాకుండా అదే పార్టీకి చెందిన మరొకకు ఎంపీపీగా ఎన్నిక కావటంతో టీఆర్‌ఎస్ పార్టీ నాయకులే రెండు గ్రూపులుగా విడిపోయి పరస్పరం గొడవకు దిగటంతో ఉద్రిక్తత నెలకొంది.