
సాక్షిప్రతినిధి, ఖమ్మం: కేసీఆర్ నియంతృత్వ విధానాలు నచ్చకే కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు మాజీ ఎమ్మెల్సీ, టీఆర్‌ఎస్ నేత పోట్ల నాగేశ్వరరావు పేర్కొన్నారు. శుక్రవారం ఖమ్మంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షేమం కోసం వినియోగించాల్సిన అధికారం కేవలం కొందరు వ్యక్తులకే పరిమితమైందన్నారు. కేసీఆర్ నియంతృత్వ ధోరణి నుంచి రాష్ట్రాన్ని కాపాడాలనే లక్ష్యంతోనే త్వరలో తాను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు తెలిపారు. టీఆర్‌ఎస్ పార్టీలో మితిమీరిన నియంతృత్వ విధానాలతో ఇమడలేక పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసి జిల్లా పార్టీ అధ్యక్షుడు బేగ్‌కు పంపించినట్లు ఆయన చెప్పారు.
రెండు, మూడు రోజుల్లో కాంగ్రెస్ జాతీయ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ సమక్షంలో ఢిల్లీలో పార్టీలో చేరనున్నట్లు ఆయన తెలిపారు. వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖమ్మం శాసనసభ నియోజకవర్గంపై దృష్టి కేంద్రీకరించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేతలను కలుపుకుపోయి పార్టీ అభివృద్ధికి కృషి చేస్తానని, ఎంపీ రేణుకా చౌదరి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్కల సహకారంతో పార్టీ పురోభివృద్ధికి తోడ్పడతానన్నారు. తనతోపాటు మరికొందరు నేతలు కాంగ్రెస్ట్‌లో చేరుతారని, త్వరలో పేర్లు వెల్లడిస్తామని పోట్ల చెప్పారు. ఈ సమావేశంలో పోట్ల నాగేశ్వరరావుతో పాటు టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన పంతంగి వెంకటేశ్వర్లు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment