ఖమ్మం అర్బన్, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజనతో ఏ ప్రాంతానికీ ఎలాంటి నష్టం ఉండదని రాష్ట్ర మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఆయన ఆదివారం రఘునాధపాలెం మండలంలోని బల్లేపల్లిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని అన్ని పార్టీల అభిప్రాయాలను అధ్యయనం చేసిన తరువాతనే కేంద్ర ప్రభుత్వం విభజన నిర్ణయం తీసుకుందని అన్నారు. రాష్ట్ర విభజనపై కొన్ని పార్టీలు రాజకీయ లబ్ధి కోసం అలర్లు చేస్తున్నాయని తప్పుబట్టారు. ఇరు ప్రాంతాలు అన్నదమ్ముల మాదిరిగా విడిపోతే వచ్చే నష్టమేమీ లేదన్నారు.
హైదరాబాదుతో కూడిన పది జిల్లాల తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు మంచి నిర్ణయమని అన్నారు. తెలంగాణ ఉద్యమం మొట్టమెదటిగా ఖమ్మం జిల్లాలోనే ప్రారంభమైందని అన్నారు. ఇల్లెందుకు చెందిన రవీంధ్రనాధ్, కలిసెట్టి రాందాస్ కలిసి ఈ ఉద్యమం ప్రారంభించారని అన్నారు. సుదీర్ఘ పోరాట ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నామని అన్నారు. హైదరాబాదులో అన్ని ప్రాంతాల వారు ఉండవచ్చని, దానికి ఎవరూ అడ్డు చెప్పరని అన్నారు. 2014 నాటికి రెండు రాష్ట్రాల్లో వేర్వేరుగా పీసీసీ (ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ) ఏర్పాటవుతాయని అన్నారు. రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు. ఈ సమావేశంలో ఖమ్మం మార్కెట్ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్, నగర కాంగ్రెస్ కన్వీనర్ రాపర్తి రంగారావు, మున్సిపల్ మాజీ కౌన్సిలర్ శీలంశెట్టి వీరభద్రం తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర విభజనతో నష్టం లేదు
Published Mon, Oct 7 2013 4:07 AM | Last Updated on Thu, Sep 27 2018 5:59 PM
Advertisement