సాక్షి ప్రతినిధి, ఖమ్మం : పోలింగ్ ముహూర్తం సమీపిస్తున్న కొద్దీ జిల్లా కాంగ్రెస్‌లో కీచులాటలు ఎక్కువవుతున్నాయి. ఎన్నికల ముందు వరకు గ్రూపు తగాదాలతో సతమతమయిన కాంగ్రెస్ పార్టీలో ఎన్నికల వేళ కూడా అదే పంథా కొనసాగుతోంది. పార్టీ తరఫున పోటీ చేస్తున్న అభ్యర్థులను దెబ్బతీసేందుకు సొంత పార్టీ నేతలే ప్రయత్నిస్తుండడం, ఒకరంటే మరొకరికి గిట్టక వారి అనుచరులు కొట్టుకోవడం, తమ కులానికి టికెట్ ఇవ్వలేదని కొన్ని సామాజిక వర్గాలు గుర్రుగా ఉండడం, తమకు ప్రాధాన్యం లభించడం లేదని మైనార్టీల ఆగ్రహానికి తోడు.. అసలు జిల్లాలో అభ్యర్థుల పక్షాన ప్రచారం నిర్వహించే కీలక సారథి లేకపోవడంతో ఈ ఎన్నికలలో విజయం సాధించేందుకు కాంగ్రెస్ అభ్యర్థులు ఆపసోపాలు పడాల్సి వస్తోంది.
దిశానిర్దేశం చేసే వారు లేకపోవడంతో అసలు ఏ నియోజకవర్గంలో కేడర్ ఏం చేస్తోందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. మరోవైపు ఎన్నికల అవగాహన కుదుర్చుకున్న సీపీఐతో కూడా కొన్ని చోట్ల కాంగ్రెస్ శ్రేణులకు పొంతన కుదరడం లేదు. ఇరుపార్టీల నేతల మధ్య సమన్వయం లోపించడంతో కాంగ్రెస్ - సీపీఐ కూటమికి గడ్డుకాలమేననే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
భద్రాద్రి నుంచి ఖమ్మం ఖిల్లా వరకు...
అంతర్గత ప్రజాస్వామ్యం పేరుతో అసమ్మతి జ్వాలలు ఎగసిపడే కాంగ్రెస్ పార్టీలో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో లుకలుకలున్నాయి. ముఖ్యంగా మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి, ఎంపీ రేణుకాచౌదరి వర్గాలుగా కార్యకర్తలు విడిపోయి పనిచేస్తున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా ఈ వర్గ విభేదాలుండగా, అక్కడి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న బలరాంనాయక్‌కు ఎమ్మెల్యేలతో విభేదాలున్నాయి. దీంతో రెండు పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలోనూ అభ్యర్థులకు వ్యతిరేకంగా కేడర్ పనిచేస్తోంది. ఇల్లెందులో అయితే ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వ్యతిరేకంగా అన్ని పార్టీల ప్రతినిధులతో కలిసి జేఏసీ ఏర్పాటు చేయించి వారి ఓటమి కోసం కృషి చేస్తున్నారు కాంగ్రెస్ నాయకులు.
లంబాడీ సామాజిక వర్గానికి జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా ఇవ్వలేదన్న కారణంతో వారంతా కాంగ్రెస్ అభ్యర్థుల ఓటమి కోసం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. ఇక, భద్రాచలంలో అయితే ఎంపీ అభ్యర్థి బలరాంనాయక్, ఎమ్మెల్యే అభ్యర్థి సత్యవతి అనుచరులు బహిరంగంగానే కొట్టుకున్నారు. చొక్కాలు చిరిగేలా కొట్టుకుని, చెప్పులు విసురుకోబోయారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థి ఓటమి కోసం ఎంపీ వర్గం, ఎంపీ అభ్యర్థి ఓటమి కోసం ఎమ్మెల్యే వర్గం తీవ్రంగా శ్రమిస్తున్నాయి. వైరా నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సమావేశంలోనూ రచ్చ జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా ఓ నాయకుడిని వేదికపైకి పిలవడంతో మరో వర్గం నేతలు గొడవ చేసి కొట్టుకున్నంత పనిచేశారు. ఇక్కడ సీపీఐ అభ్యర్థికి, కాంగ్రెస్ నేతలకు సమన్వయం కుదరడం లేదు.
సీపీఐ పోటీ చేస్తున్న మరో స్థానమైన కొత్తగూడెంలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. మొన్నటివరకు తమ కార్యకర్తలకు వ్యతిరేకంగా పనిచేసిన సీపీఐ అభ్యర్థి కూనంనేనికి తాము సహకరించేది లేదని అక్కడి కాంగ్రెస్ నేతలు బహిరంగంగానే చెపుతున్నారు. పినపాకలో కూడా సీపీఐ పోటీచేస్తుండగా ఇదే పరిస్థితి నెలకొంది. ఇక్కడి కాంగ్రెస్ నేతలు పక్కపార్టీల వైపు చూస్తున్నారు. సత్తుపల్లిలో పోటీచేస్తున్న సంభాని చంద్రశేఖర్ చాలా రోజులుగా నియోజకవర్గానికి దూరంగా ఉండడంతో ఇక్కడి కాంగ్రెస్ కేడర్ కూడా ఆయనకు పూర్తిగా సహకరించే పరిస్థితి లేదు. మాజీ మంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి పోటీ చేస్తున్న పాలేరులో రేణుక వర్గం సహాయ నిరాకరణ చేస్తుండగా, ఖమ్మం నుంచి పోటీచేస్తున్న పువ్వాడ అజయ్‌కుమార్‌కు సహకరించేందుకు రాంరెడ్డి వర్గం ముందుకు రావడం లేదు.
ఇక జిల్లాలోని మైనార్టీలు కూడా కాంగ్రెస్ పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. లక్షలాది మైనార్టీ ఓట్లున్నా కనీసం ఒక్క సీటు కూడా ఇవ్వని కాంగ్రెస్ పార్టీ.. తాజాగా ఏర్పాటు చేసిన జిల్లా సమన్వయ కమిటీలోనూ తమకు స్థానం కల్పించలేదని గుర్రుగా ఉన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశాన్ని కూడా అడ్డుకునేందుకు వారు ప్రయత్నించారు. ఈ క్రమంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న కారణంగా టీడీపీకి దూరమైన మైనార్టీ ఓటర్లు కాంగ్రెస్ పార్టీకి కూడా దూరం కానున్నారనే చర్చ జరుగుతోంది. దీంతో జిల్లా వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్, సీపీఐ అభ్యర్థులు ఏటికి ఎదురీదాల్సి వస్తోందని జిల్లా రాజకీయ వర్గాలంటున్నాయి. ఈ పరిస్థితుల్లో గ్రూపు తగాదాలు, కీచులాటలు జిల్లాలోని కాంగ్రెస్ అభ్యర్థులను ఏం చేస్తాయో వేచి చూడాల్సిందే.
కాంగ్రెస్‌లో కీచులాటలు
Published Mon, Apr 21 2014 2:06 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement