కూసుమంచి, న్యూస్‌లైన్: కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ ఒక్కటేనంటూ పాలేరు నియోజకవర్గంలో మంత్రి రాంరెడ్డి, ఆయన అనుచరులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని మానుకోవాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ మచ్చా శ్రీనివాసరావు అన్నారు. తెలంగాణ వస్తున్నందున వైఎస్సార్‌సీపీ.. కాంగ్రెస్‌లో కలుస్తుందని మంత్రి, ఆయన అనుచరులు చేస్తున్న ప్రచారాన్ని వారు మానుకోవాలని మచ్చా శ్రీనివాసరావు హెచ్చరించారు. పాలేరు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదుపై శుక్రవారం ఆయన స్థానిక నాయకులతో కూసుమంచిలోని పార్టీ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. మంత్రి, ఆయన అనుచరులు చేస్తున్న వ్యాఖ్యలను పలువురు నాయకులు ఈ సందర్భంగా మచ్చా దృష్టికి తీసుకురాగా తీవ్రంగా స్పందించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ మంత్రి గారు మీరు పెద్ద వారు.. రెండు పార్టీలు ఒకటేనని ప్రచారం చేస్తున్నారని తెలిసింది.. వైఎస్ వల్ల ఎంతో లబ్ధిపొందిన మీరు మా పార్టీ(వైఎస్సార్‌సీపీ)లోకి వస్తే మీ వయసుని గౌరవించి మీ నాయకత్వంలో పని చేసేందుకు మేమంతా సిద్ధంగా ఉన్నాం’అని అన్నారు. రాష్ట్రం విడిపోయినా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అందించిన సంక్షేమ ఫలాలు పొందిన ప్రజలు ఆయన తనయుడు స్థాపించిన పార్టీకి అభిమానులుగా ఉంటారని అన్నారు. ప్రాంతాలు, కులాలు, మతాల కతీతంగా ప్రజల సంక్షేమానికి కృషి చేసిన మహానేత వారి హృదయాల్లో సుస్థిరంగా ఉన్నాడని, ప్రాంతాలు వేరు చేసినంత మాత్రాన ప్రజల హృదయాల నుంచి ఆయన్ను వేరు చేయలేరని అన్నారు.
వైఎస్ దయతో జిల్లాలో ఎమ్మెల్యేలుగా గెలిచి మంత్రి, డిప్యూటీ స్పీకర్ పదవులు పొందిన వారు మహానేత దూరమయ్యాక జగన్ మీద, ఆయన కుటుంబం మీద బురదజల్లేందుకు యత్నిస్తున్నారని ఆరోపించారు. తమ పార్టీకి ఒక విధి విధానం ఉందని, రాష్ట్ర విభజన జరిగినా పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదని అన్నారు. కార్యకర్తల్లో ఆందోళన సృష్టించి వారిని ఇబ్బందులకు గురిచేయవద్దని అన్నారు. కాంగ్రెస్, వైఎస్సార్‌సీపీ ఒక్కటయ్యే ప్రసక్తే లేదని, కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారాలు మానుకోవాలని మచ్చా శ్రీనివాసరావు హితవు పలికారు.
ఈ సమావేశంలో పార్టీ రైతు విభాగం జిల్లా కన్వీనర్ మందడపు వెంకటేశ్వరరావు, రాష్ట్ర నాయకులు మార్కం లింగయ్యగౌడ్, జిల్లా నాయకులు అశోక్ రెడ్డి, మండల కన్వీనర్ బజ్జూరి వెంకటరెడ్డి, నాయకులు బయ్య లింగయ్యయాదవ్, బారి శ్రీను, వైవీడీరెడ్డి, డవెల్లి పుల్లారెడి, చాట్ల సత్యనారాయణ, ఎండి మజీద్, కొండా నర్సయ్య, రమేష్‌రెడ్డి, ఈగలపాటి నాగేశ్వరరావు, ఆడెపు వీరబాబు పాల్గొన్నారు.
తప్పుడు ప్రచారాలు మానుకోవాలి
Published Sat, Dec 14 2013 5:46 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement