కాంగ్రెస్‌లో ‘ఖమ్మం’ లొల్లి! | struggling for assembly ticket in congress party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ‘ఖమ్మం’ లొల్లి!

Published Sat, Mar 29 2014 3:08 AM | Last Updated on Sat, Sep 2 2017 5:18 AM

struggling for assembly ticket in congress party

ఖమ్మం, న్యూస్‌లైన్: ఖమ్మం అసెంబ్లీ టి కెట్ కోసం కాంగ్రెస్ పార్టీలో లొల్లి తారస్థాయికి చేరింది. రాజ్యసభ సభ్యురాలు రేణుకాచౌదరి, మాజీమంత్రి రాంరెడ్డి వెంకటరెడ్డి వర్గీయుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది.  టికెట్ ఆశిస్తున్నవారితోపాటు వారి మద్దతుదారులు కూడా హస్తినలో చేరి ఎవరికి వారు ఎత్తులుపైఎత్తులు వేస్తున్నారు. ఏవర్గానికి ఆవర్గమే తమతమ అభ్యర్థులకు ఉన్న అర్హతలు, ఎదుటివారి బలహీనతలు ఢిల్లీ పెద్దలముందు  ఏకరువు పెడుతున్నారు. బయటకు మాకే సీటు ఖాయం అంటూ ఎవరికి వారే చెప్పుకుంటున్నారు. కాగా, ఇంత రభస నడుమ తెరమీదకు వచ్చిన మరో అంశంపై కూడా ఇప్పుడు పార్టీవర్గాల్లో చర్చజరుగుతోంది. విభేదాలతో తలనొప్పి తెస్తున్న జిల్లాకాంగ్రెస్‌లో ఇరువర్గాలు సూచిస్తున్న ఎవరికీ ఇవ్వకుండా ఖమ్మం అసెంబ్లీనుంచి కొత్త అభ్యర్థిని బరిలో దింపాలని  తెలంగాణ పీసీసీ భావిస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం హాట్‌టాపిక్‌గా మారింది.

 పార్టీలు మారేవారికి  టికెట్ ఇస్తే పలుచన అవుతాం..
 సంవత్సరాల తరబడి పార్టీని నమ్ముకున్న వారిని వదిలిపెట్టి నిన్న మొన్న పార్టీలో చేరిన వారికి టికెట్ ఇస్తే ప్రజల మధ్య పలుచన అవుతామని  రాంరెడ్డి వర్గీయులు అధిష్టానం ముందు అభిప్రాయం వ్యక్తం చేసినట్లు తెలిసింది. రేణుకాచౌదరి మద్దతు తెలుపుతున్న పువ్వాడ అజయ్‌కుమార్ పార్టీలు మారి ఇటీవలే కాంగ్రెస్‌లో చేరారని, ఇప్పుడు టికెట్ ఆశించడం ఎంత వరకు సబబని మంత్రి అనుచరులు ప్రశ్నిస్తున్నారు.

పొత్తుల్లో భాగంగా ఖమ్మం పార్లమెంట్ సీపీఐకి ఇస్తే ఆ పార్టీ నుంచి పువ్వాడ నాగేశ్వరరావు పోటీ చేసే అవకాశాలు ఉన్నాయని, అదే జరిగితే ఎమ్మెల్యేగా కుమారుడు, ఎంపీగా తండ్రి బరిలో దిగితే పార్టీని నమ్ముకుని పనిచేసిన వారి పరిస్థితి ఏమిటని అంటున్నారు.  పార్టీని వెన్నంటి ఉండి, కార్యకర్తలకు అందుబాటులో ఉంటున్న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మానుకొండ రాధాకిషోర్‌కు అవకాశం ఇవ్వాలని  రాంరెడ్డి అధిష్టానానికి చెప్పినట్లు తెలిసింది. ఇలా ఉండగా... ఏది ఏమైనా నా అభ్యర్థిగా పువ్వాడ అజయ్‌కుమార్‌కు టికెట్ ఇవ్వాల్సిందే అని రేణుకాచౌదరి అధిష్టానం వద్ద పట్టుపడుతున్నట్లు సమాచారం.

 అయితే.. తెలంగాణ ఉద్యమాన్ని ఇన్‌స్టంట్ కాఫీతో పోల్చిన రేణుకాచౌదరిపై ఆగ్రహంతో ఉన్న టీపీసీసీ నాయకులు  తెలంగాణలో టికెట్‌ల కేటాయింపుపై ఆమె పెత్తనం ఏమిటని  అధిష్టానానికి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. కాగా,  ఖమ్మంలో మైనార్టీ ఓట్లు గెలుపు ఓటములను ప్రభావితం చేస్తాయని, గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన అనుభం తనకుందని మాజీ ఎమ్మెల్యే యూనస్ సుల్తాన్ కూడా టికెట్‌కోసం తన అనుచరులతో తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది.

 మధ్యే మార్గం వైపు టీపీసీసీ చూపు
 తమ అనుచరుడికే టికెట్ ఇవ్వాలని రేణుకాచౌదరి, కాదు తమ సన్నిహితుడు మానుకొండకే టిక్కెట్ ఇవ్వాలని రాంరెడ్డి... ఇరువురూ పట్టుపట్టడంతో వీరెవరూ కాకుండా మధ్యే మార్గంగా మరొకరికి టికెట్ ఇస్తే బాగుంటుందని టీపీసీసీ అధిష్టానం ముందు విజ్ఞప్తి చేసినట్లు తెలిసింది.  ఒక వర్గం వారికి టికెట్ ఇస్తే మరొకరు పార్టీ నుంచి వెళ్ళిపోయే ప్రమాదం ఉందని, అలా కాకుండా మరొకరి పేరును పరిశీలిస్తే బాగుం టుందనే అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది.

  ఖమ్మం పార్లమెంటు టిక్కెట్ కోసం పోటీ పడిన గ్రానైట్ పరిశ్రమల యజమాని వద్దిరాజు రవి చంద్రకు అసెంబ్లీ టికెట్ ఇస్తే బాగుంటుందని టీపీసీసీ వర్కింగ్ కమిటీ చైర్మన్ ఉత్తమ్ కుమార్‌రెడ్డి సూచించినట్లు సమాచారం. లేదంటే పొత్తులో భాగంగా కొత్తగూడెం స్థానాన్ని సీపీఐకి ఇవ్వాల్సి వస్తే, ఖమ్మంలో బీసీ వర్గానికే చెందిన సీనియర్ నేత వనమా వెంకటేశ్వరరావు పేరును ఆయన ప్రతిపాదిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇరు వర్గాల వారికి కాకుండా  బీసీ వర్గానికి చెందిన రవిచంద్ర లేదా వనమా వెంకటేశ్వరరావుకు ఇస్తే బాగుంటుందని, బీసీలకు కూడా న్యాయం చేసినట్లు అవుతుందనే  అభిప్రాయంలో ఏఐసీసీ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. ఈపరిస్థితులలో టికెట్ ఎవరికి వస్తుందో....తర్వాత ఆ ప్రభావం పార్టీలో ఎలా ఉంటుందో అన్న చర్చ జోరుగా సాగుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement