సాక్షి, ఇల్లెందు (భద్రాద్రి కొత్తగూడెం): రాజకీయం రసవత్తరంగా మారుతోంది. ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే ఊకె అబ్బయ్య కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. గురువారం మండంలోని హనుమంతులపాడు గ్రామంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇల్లెందు నియోజకవర్గ అభివృద్ధి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తాను పార్టీని మారాలని నిర్ణయించినట్లు చెప్పారు. రానున్న కాలంలో రాష్ట్రంలో బీజేపీదే అధికారమని ఆ దిశంగా ప్రజలు, నాయకులు చూస్తున్నారని తెలిపారు. దేశంలో నరేంద్ర మోదీ పాలనలో సుస్థిరపాలన అందిస్తున్నారని, రాష్ట్రంలోనూ సుస్థిర పాలన కోరకుంటున్నారని తెలిపారు. ఎన్నికలు జరిగి ఎనిమిది నెలలు కావస్తున్నా సీఎం కేసీఆర్ అభివృద్ధి కోసం పైసా నిధులు కేటాయించలేదని తెలిపారు.
ప్రజల వద్దకు రాకుండా వారి కష్టాలు ఎలా తెలుస్తాయని ప్రశ్నించారు. సీతారామ ప్రాజెక్ట్ శంకుస్థాపన జరిగి ఏళ్లు గడుస్తున్నా పనులు ప్రారంభం కాకపోవడం ఆయన పాలనకే చెల్లిందన్నారు. జిల్లా నుంచి సీతారామ ప్రాజెక్ట్ ద్వారా సాగర్‌కు, టెయిల్‌పాండ్‌కు నీటిని తరలించేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నాడని, ఈ ప్రాజెక్ట్‌లో ఈ జిల్లా వాటా ఎంత అని ప్రశ్నించారు. విభజన హామీలు అటకెక్కాయని, ఉక్కు పరిశ్రమ అడ్రస్ లేదని, భూగర్భ గనులు, బొగ్గు నిక్షేపాల వెలికితీతలో కేసీఆర్ మాటలు నీటి మూటలుగా మారాయన్నారు. గిరిజన యూనివర్సిటీ అడ్రస్ లేకుండాపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే ప్రభుత్వం ఉన్నప్పుడే అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. ఈ నెల 18న హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో బీజేపీ వర్కింగ్ ప్రసిడెంట్ జెపీ లడ్డా సమక్షంలో బీజేపీలో చేరనున్నట్లు తెలిపారు. ఈ దిశగా జిల్లా, నియెజకవర్గం నుంచి వివిధ పార్టీల నేతలు బీజేపీలోకి చేరేందుకు సమాలోచనలు జరుపుతున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా టీడీపీ మాజీ అధ్యక్షులు కోనేరు చిన్ని మాట్లాడుతూ..జిల్లాలో బీజేపీని తిరుగులేని శక్తిగా మారుస్తామని తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బీజేపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో నాయకులు నాయిని శ్రీనివాస్,భద్రు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment