సాక్షి, కొత్తగూడెం: ఆకాశాన్నంటిన కూరగాయల ధరలతో అల్లాడుతున్న వినియోగదారులకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందులో ఓ కూరగాయల వ్యాపారి కుటుంబం ఉపశమనం కలిగించింది. టమాటా ధరచూస్తే నోట మాటరాని పరిస్థితి. పచ్చిమిర్చి ముట్టుకోకుండానే మంటమండుతున్న వేళ ప్రజలెవరూ మార్కెట్ ముఖం చూడకపోవడంతో పలురకాల కూరగాయల ధరలు తగ్గించింది. ఇన్నిరోజులు ధరల దరువుతో వెలవెలబోయిన మార్కెట్‌లో తాజాగా వినియోగదారుల సందడి నెలకొంది.
ఇల్లెందుకు చెందిన కూరగాయల వ్యాపారి యాకూబ్ కుమారులు గౌస్, జానీ, ఖాజా మానవతాదృక్పథంతో ముందుకు వచ్చి ఐదు రకాల కూరగాయల ధరలను వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చారు. కిలో రూ.60 పలుకుతున్న బెండ, దొండ, సొరకాయ, వంకాయ, ఆలుగడ్డను కేవలం రూ.20 చొప్పున విక్రయిస్తున్నారు. ఈ విషయమై గౌస్, జానీ, ఖాజా మాట్లాడుతూ కూలీలు, చిరుద్యోగులు కూరగాయలు కొనే పరిస్థితి లేకపోవడంతో తమ తండ్రి స్ఫూర్తితో లాభనష్టాలు చూసుకోకుండా ధరలు తగ్గించినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment