స్వాతంత్య్రానికి ముందు ప్రిన్సిలీ స్టేట్‌గా బస్తర్
భారత్‌లో విలీనానికి రాజు ప్రవీర్‌చంద్ర అంగీకారం
అనతి కాలంలోనే రాజు, ప్రభుత్వాల మధ్య ఘర్షణ
ప్రజాపోరాటాల కారణంగా రాజు శైలిపై ప్రభుత్వాల ఆగ్రహం
బస్తర్ ప్యాలెస్‌పై ఏకపక్షంగా సైన్యం కాల్పులు..
అమరుడైన ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: దేశానికి స్వాతంత్య్రం వచ్చేనాటికి ఐదు వందలకు పైగా స్వతంత్ర రాజ్యాలు ప్రిన్సిలీ స్టేట్స్ పేరుతో ఉన్నాయి. వీటిని దేశంలో విలీనం చేయడానికి అప్పటి ఉపప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రయత్నించారు. ఈమేరకు నాగ్‌పూర్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి బస్తర్ మహారాజుగా ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్ హాజరై విలీన ఒప్పందంపై సంతకం చేశారు. దీంతో దేశంలో 13వ పెద్దరాజ్యంగా ఉన్న బస్తర్ స్టేట్ భారత్‌లో 1948 జనవరి 1న విలీనమైంది.
ప్రవీర్‌సేన పేరుతో పోటీ
ఓ వైపు మహారాజుగా కొనసాగుతూనే మరోవైపు 1957లో కాంగ్రెస్ పార్టీ తరఫున జగదల్‌పూర్ స్థానం నుంచి ప్రవీర్‌చంద్ర అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అయితే మహారాజుగా తనకు దక్కాల్సిన హక్కుల విషయంలో భారత ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన లేక ఇరు పక్షాల మధ్య అనుమాన బీజాలు మొలకెత్తాయి. మరోవైపు బ్రిటీష్ కాలం నుంచి ఉన్న బైలడిల్లా గనులపై పట్టు కోసం కేంద్రం తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది. దీంతో ఇటు కేంద్రం, అటు బస్తర్ మహారాజు మధ్య అంతరం పెరుగుతూ వచ్చింది. ఏజెన్సీ ప్రాంతాల రక్షణ కోసం ఏర్పాటు చేసిన చట్టాలు పక్కాగా అమలు చేయాలని మహారాజు ప్రవీర్‌చంద్ర గళం విప్పడం మొదలెట్టారు. ఆ తర్వాత అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌తో సంబంధం లేకుండా ప్రవీర్‌సేన పేరు మీద అభ్యర్థులను బరిలో నిలబెట్టి 11 మంది ఎమ్మెల్యేలను అసెంబ్లీకి పంపి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సవాల్ విసిరారు. ఆ ఎన్నికల్లో బస్తర్‌లో కాంగ్రెస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు.
హత్యకు గురైన నాటి బస్తర్ మహారాజు ప్రవీర్‌చంద్ర భంజ్‌దేవ్
కేంద్రంపై పోరాటం
రాజా ప్రవీర్‌చంద్ర లెవీ విధానాన్ని వ్యతిరేకిస్తూ చిత్రకూట్ జలపాతం దగ్గరున్న లోహండిగూడా దగ్గర వేలాది మందితో బహిరంగసభ నిర్వహించారు. ఆ తర్వాత రైళ్లలో న్యూఢిల్లీ వరకు పెద్ద సంఖ్యలో ఆదివాసీలను తీసుకెళ్లి పార్లమెంట్ ముందు భారీ నిరసన వ్యక్తం చేశారు. దీంతో బస్తర్‌లో అశాంతికి కారణం అవుతున్నాడనే నెపంతో ప్రవీర్‌చంద్రను అరెస్ట్ చేసి నర్సింగాపూర్ జైల్లో బంధించారు. మహారాజుపై దేశద్రోహి అనే ముద్రను వేసి జైలులో పెట్టడంతో బస్తర్ అట్టుడికిపోయింది. ప్రజాగ్రహం అంతకంతకూ పెరుగుతుండటంతో రాజును విడుదల చేసిన ప్రభుత్వం ఆయనకు ఉన్న హోదాలను రద్దు చేసింది. దీంతో వివాదం మరింత ముదిరింది.
నక్సల్బరీ
బస్తర్ మహారాజు ప్రవీర్‌చంద్ర మహారాజ హత్య జరిగిన మరుసటి ఏడాదే బెంగాల్‌లో చారుమజుందార్ ఆధ్వర్యంలో 1967లో నక్సల్బరీ పోరాటం మొదలైంది. వర్గశత్రువు రక్తంలో చేతులు ముంచనిదే విప్లవం రాదంటూ ఆయుధాలు ఎక్కుపెట్టిన చారుమజుందార్ భావావేశం అనతికాలంలోనే ఆంధప్రదేశ్‌ను చుట్టుముట్టింది. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎర్రజెండాలు రెపరెపలాడాయి. ఇక్కడి పల్లెల్లో విప్లవాగ్నులు రగిలించిన నక్సలైట్లు, గతంలో అన్నమదేవుడు నడిచిన పాతదారిలోనే వరంగల్ మీదుగా గోదావరి దాటి బస్తర్ అడవుల్లోకి 1980వ దశకంలో వెళ్లారు. కొత్తగా వచ్చిన ప్రభుత్వ పాలనలో అధికారుల దాష్టీకాలతో విసిగిపోయిన ఆదివాసీలకు విప్లవ భావాలు కొత్త దారిని చూపాయి. ఫలితంగా పదిహేనేళ్లు గడిచే సరికి అక్కడ నక్సలైట్లకు కంచుకోటగా మారింది. జనతా సర్కార్ పేరుతో సమాంతర ప్రభుత్వాన్ని నడిపే స్థాయికి మావోయిస్టులు చేరుకున్నారు. దీనికి ప్రతిగా అప్పుడు ఆపరేషన్ గ్రీన్‌హంట్ ఇప్పుడు కగార్ (ఫైనల్ మిషన్)కు చేరుకుంది. ఇరువర్గాల మధ్య పోరులో బస్తర్ అడవుల్లో రక్తం ఏరులై పారుతోంది. ఇప్పటి వరకు అన్ని వైపుల నుంచి ఏడువేల ఐదు వందల మంది చనిపోయారు.
మహారాజు హత్య
మహారాజునైన తన హక్కులకే దిక్కు లేనప్పుడు ఇక ఆదివాసీల çపరిస్థితి మరింత దారుణంగా ఉంటుందనే భావనతో ధిక్కార స్వరాన్ని రాజా ప్రవీర్‌చంద్ర మరింతగా పెంచారు. ఈ క్రమంలో ప్యాలెస్‌లో మద్దతుదారులతో ఆందోళన చేస్తున్న ప్రవీర్‌చంద్రను పోలీసు దళాలు చుట్టుముట్టాయి. ఆందోళనకారుల్లో కొందరిని విచారణ పేరుతో పోలీసులు తీసుకెళ్లారు. దీంతో కోపంతో ఊగిపోయిన ఆదివాసీలు బాణం, బల్లెం చేతబట్టి పోలీసులపైకి దాడికి సిద్ధమయ్యారు. ఆదివాసీ సైన్యంతో రాజు తమపై దాడికి దిగారని, ఫలితంగా ఆత్మరక్షణ కోసం తాము కాల్పులు జరిపామంటూ పోలీసులు చెప్పారు. 1966 మార్చి 25న జరిగిన ఈ కాల్పుల్లో మహారాజు ప్రవీర్ చంద్ర చనిపోయారు. ఈ ఘటనతో సుమారు 650 ఏళ్లుగా సాగుతున్న రాజరిక పాలన స్థానంలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన బస్తర్‌లో మొదలైంది.
Comments
Please login to add a commentAdd a comment