గోపన్నపాలెం సభలో మాట్లాడుతున్న అబ్బయ్య చౌదరి
పశ్చిమగోదావరి, దెందులూరు/పెదవేగి: నేను చేపట్టిన నిరాహార దీక్షకే భయపడిన చింతమనేని నాకు సవాల్ విసురుతారా? ఆయన గోపన్నపాలెంలో చేసిన సవాల్‌ను స్వీకరిస్తున్నా. తట్ట మట్టినీ తాను అమ్మలేదంటున్న ఆయనకు సీబీసీఐడీ విచారణకు అంగీకరించే దమ్ము, ధైర్యం ఉన్నాయా? ఆయన మట్టి, ఇసుక, గ్రావెల్ అమ్ముకోలేదని క్లీన్‌చీట్ వస్తే తట్టాబుట్టా సర్దుకెళ్లిపోతాను’ అని వైఎస్సార్ సీపీ దెందులూరునియోజకవర్గ కన్వీనర్ కొఠారు అబ్బయ్య చౌదరి పేర్కొన్నారు. ఆదివారం రాత్రి దీక్ష విరమణ అనంతరం ర్యాలీగా గోపన్నపాలెం బస్టాండ్ సెంటర్‌కు చేరిన అబ్బయ్య చౌదరి, వైఎస్సార్ సీపీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ కోటగిరి శ్రీధర్ బహిరంగ సభలో మాట్లాడారు. శనివారం చింతమనేని విసిరిన సవాల్‌కు దీటుగా స్పందించారు. అబ్బయ్య చౌదరి మాట్లాడుతూ దెందులూరు నియోజకవర్గంలో మట్టి, ఇసుక, గ్రావెల్ అమ్ముకోలేదని చింతమనేని చెప్పడం హాస్యాస్పదమన్నారు.
ఆయన అక్రమంగా మట్టి, ఇసుక, గ్రావెల్ అమ్ముకోని గ్రామం లేదన్నారు. సూర్యారావుపేటలో పేద వ్యక్తి 30 ఏళ్లుగా నివసిస్తుంటే, హైకోర్టు ఆదేశాలు ఉన్నా.. ఇంటిని జేసీబీతో తొలగించాలని యత్నిస్తున్న సమయంలో తాను, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ప్రశ్నించినందుకు తమపై అక్రమ కేసులు పెట్టారని ధ్వజమెత్తారు. కేసులు పెట్టిస్తే భయపడబోమని, ఇక్కడ ఉన్నది కొఠారు అని పేర్కొన్నారు. కార్యకర్తలపై అక్రమంగా పెట్టిన కేసులను పార్టీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే తొలగిస్తామన్నారు. చింతమనేనికి ప్రజా క్షేత్రంలోనే గుణపాఠం చెబుతామన్నారు. కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ ప్రజాలారా కోడిపందేలు, సారా దుకాణాలు, పేకాట నిర్వహించే వ్యక్తి కావాలా? విదేశాల్లో చదువుకున్న ఉన్నతమైన విలువలున్న వ్యక్తులు కావాలా అని ప్రశ్నించారు. తట్ట మట్టినీ తరలించలేదని, ఒకవేళ తరలించినట్లు తేలిస్తే చింతమనేని రాజకీయ సన్యాసం చేస్తానన్నారని, కానీ ఆయన రాజకీయ సన్యాసం చేయరని, తాము గెలిచి అతనిచేత రాజకీయ సన్యానం చేయిస్తామని పేర్కొన్నారు. చింతమనేని అరాచకాలు ఇంకా ఆరు నెలలేనని అన్నారు. పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి కొండేటి గంగాధరరావు బాబు, జిల్లా కార్యదర్శి తోట పద్మారావు, గ్రామ పార్టీ అధ్యక్షులు వీరంకి సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ బహిరంగ సభ జరిగింది. ఏలూరు పార్లమెంట్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ళ సతీష్ చౌదరి నాయకత్వంలో కన్వీనర్ నిరా హార దీక్షకు మద్దతుగా బైక్ ర్యాలీ నిర్వహించారు.
దీక్షతో శ్రేణుల్లో ఉత్సాహం
చింతమనేని అక్రమ మైనింగ్‌కు వ్యతిరేకంగా అబ్బయ్యచౌదరి చేపట్టిన రెండు రోజుల నిరాహారదీక్ష ఆదివారం సాయంత్రం ముగిసింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏలూరు పార్లమెంటరీ నియోజకవర్గ సమన్వయకర్త కోటగిరి శ్రీధర్, గన్నవరం నియోజకవర్గ సమన్వయకర్త యార్లగడ్డ వెంకట్రావు అబ్బయ్య చౌదరికి నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చింతమనేని అక్రమాలపై పోరాటం ఆపేదిలేదనీ స్పష్టం చేశారు. అబ్బయ్య చౌదరి దీక్షకు నియోజకవర్గ ప్రజల నుంచి విశేష స్పందన వచ్చింది. పార్టీ శ్రేణుల్లో నూతనోత్సాహం నింపింది. నాలుగేళ్లుగా ఎమ్మెల్యే చింతమనేని దౌర్జన్యాలతో విసిగిన ప్రజలు అబ్బయ్య చౌదరికి మద్దతు తెలిపారు. దీక్షా శిబిరం వద్దకు భారీగా వచ్చారు. మహిళలు బొట్టుపెట్టి మరీ అబ్బయ్య చౌదరిని ఆశీర్వదించారు. హారతులు పట్టారు.
తరలివచ్చిన వైఎస్సార్ సీపీ శ్రేణులు
దీక్షాశిబిరాన్ని వైఎస్సార్ సీపీ నరసాపురం పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, తణుకు కన్వీనర్ కారుమూరి నాగేశ్వరరావు, తాడేపల్లిగూడెం కన్వీనర్ కొట్టు సత్యనారాయణ, గన్నవరం కన్వీనర్ యార్లగడ్డ వెంకట్రావు, జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావుతోపాటు వైఎస్సార్ సీపీ శ్రేణులు సందర్శించారు. ఈ సందర్భంగా వారంతా మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ నేతల అక్రమాలు, అరాచకాలపై ధ్వజ మెత్తారు. తెలుగుదేశం నేతలు ఆలీబాబా అందరూ దొంగలే అన్న చందాన ఉన్నారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో ఆ పార్టీకి ప్రజలే బుద్ధిచెబుతా రని అన్నా రు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యువజన విభాగం జనరల్‌సెక్రటరీ కామిరెడ్డి నాని, ఎస్సీ సెల్‌రాష్ట్ర ప్రధాన కార్యదిర్శ పల్లెం ప్రసాద్, జిల్లా కార్యదర్శి కొండే లాజరు, జిల్లా కమిటీ సభ్యులు యలమర్తి రామకృష్ణ, ఏలూరు పార్లమెంట్ కార్యదర్శి చల్లా మేరీరాజు, పార్టీ పంచాయతీ రాజ్ విభాగం జిల్లా అధ్యక్షులు ఎన్.సూర్యనారాయణ, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కమ్మ శివరామకృష్ణ, రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శి లక్ష్మీకుమార్, ఏలూ రు పార్లమెంటరీ కార్యనిర్వాహక సభ్యుడు చట్టుమాల మరియ దాసు, నేతలు సప్పా మోహనమురళి, వీరమాచినేని నాగబాబు, తోట పద్మారావు, కట్టా ఏసుబాబు,బట్టు జయరాజు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment