
సాక్షి, దెందులూరు(పశ్చిమ గోదావరి): ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులపై పోలీసులు వ్యవహరశైలి పలు అనుమానాలకు తావిస్తోంది. అధికార పార్టీకి చెందిన నేతలు హద్దుమీరి ప్రవర్తిస్తున్న కూడా పట్టించుకుని పోలీసులు.. ప్రతిపక్ష పార్టీ నాయకులు నిరసన కూడా తెలుపకముందే వారిని నిర్భందిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా పోలీసుల తీరు ఇదే విధంగా కొనసాగుతుంది. తాజాగా పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరులో ఇలాంటి ఘటనే పునరావృతమైంది. స్థానిక ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మంగళవారం జరిగిన ఓ సభలో దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దళిత సంఘాలు, మానవ హక్కుల సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుంది. చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా వారు డిమాండ్ చేస్తున్నారు.
అయితే పోలీసులు దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేనిని వదిలివేసి.. వైఎస్సార్‌సీపీ నాయకులను అసౌకర్యానికి గురిచేస్తున్నారు. వారి కార్యకలాపాలకు అడ్డుపడుతూ ఇబ్బంది కలిగిస్తున్నారు. తద్వారా పార్టీ శ్రేణులను భయబ్రాంతులకు గురిచేస్తున్నారు. బుధవారం ఉదయం వైఎస్సార్ సీపీ దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త అబ్బయ్య చౌదరిని ఏలూరులోని పార్టీ కార్యాలయానికి బయలుదేరుతుండగా పోలీసులు హౌజ్ అరెస్ట్ చేశారు. సరైన కారణం లేకుండా తనను హౌజ్ అరెస్ట్ చేయడంపై అబ్బయ్య చౌదరి అభ్యంతరం వ్యక్తం చేశారు. దళితులపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చింతమనేని అరెస్ట్ చేయకుండా.. తనను హౌస్ అరెస్ట్ చేయడం ఏమిటని ఆయన పోలీసులను సూటిగా ప్రశ్నించారు. చింతమనేని వ్యాఖ్యలపై తాము ఎటువంటి నిరసనలకు పిలువునివ్వకపోయినప్పటికీ.. ఏదో ఊహించుకుని ఇలా వ్యవహరించడం దారుణమని అన్నారు.(మరోసారి రెచ్చిపోయిన చింతమనేని.. ఉద్రిక్తత)