సాక్షి, దెందులూరు: తన గెలుపు నల్లేరుపై నడక అంటూ నిన్న మొన్నటి వరకు బీరాలు పలికిన చింతమనేనికి ఓటమి భయం పట్టుకుందా? దెందులూరులో ఎవరు పోటీ చేసినా తానే భారీ మెజార్టీతో గెలుస్తానని తొడలు కొట్టిన చింతమనేనికి గట్టి షాక్ తగలబోతుందా? హాట్రిక్ సాధించాలని కలలు కన్న ఆయన ఓటమిని ఎదుర్కోబోతున్నారా? వైఎస్సార్‌సీపీ నుంచి గట్టి పోటీ ఉండటంతో చింతమనేనికి ఇంక చింతే మిగలనుందా? పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు నియోజకవర్గ ఎన్నికల సరళిపై ప్రత్యేక కథనం..
రాష్ట్రంలోని దెందులూరు నియోజకవర్గ ఎన్నికలపై అందరి చూపు ఉంది. ఇక్కడ నుంచి బరిలోకి దిగిన టిడిపి సిట్టింగ్ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ వివాదాస్పద వైఖరితో దెందులూరు నియోజకవర్గం తరచూ వార్తలలో ఉండేది. కోడిపందాలు, జూదం, పందాలంటే చెవి కోసుకునే చింతమనేని.... ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత కూడా తన పంథా మార్చుకోలేదు సరికదా బహిరంగంగానే కొనసాగించారు. దీంతో ఇపుడు దెందులూరు ఎన్నికలలో చింతమనేని గెలుస్తారా లేదా ...హాట్రిక్ సాధిస్తారా లేదా అన్నది చర్చనీయాంశంగా మారింది.
ఎంపిపిగా ఉన్న చింతమనేని ప్రభాకర్ తొలిసారి 2009 ఎన్నికలలో దెందులూరు ఎమ్మెల్యేగా 14235 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 2014 ఎన్నికలలో మరోసారి టీడీపీ తరపున పోటీ చేసి 17746 ఓట్ల తేడాతో గెలుపొందారు. ఆ గెలుపు తర్వాత నుంచి చింతమనేని వివాదాస్పద చర్యలు తారాస్ధాయికి చేరుకున్నాయి. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకున్నందుకు కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చింతమనేని దాడి చేయడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించింది. ఆ వ్యవహారంలో ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యలు తీసుకోవాల్సిన సీఎం.. అందుకు విరుద్ధంగా ఎమ్మార్వోను పిలిచి మరీ మందలించడం అధికారవర్గాలలో కలకలం రేపింది. ఇక అక్కడ నుంచి చింతమనేని అక్రమాలకు దెందులూరు నియోజకవర్గంతో పాటు రాష్ట్రంలోనూ ఎదురు లేకుండా పోయింది.
తమ్మిలేరులో ఇసుక అక్రమాలు, దెందులూరు నియోజకవర్గంలో నీరు చెట్టు పేరుతో అక్రమాలు, మట్టి దోపిడీ, పోలవరం కుడి కాలువ నుంచి మట్టి అక్రమ తరలింపులతో కోట్ల రూపాయలు వెనకేసుకున్నారనే విమర్శలు ఉన్నాయి. తనకు ఎదురువచ్చిన అటవీ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది, పాత్రికేయులు, మహిళలు , కార్మికులు, అందరిపై దౌర్జన్యకాండ కొనసాగించారని స్థానికులుచెబుతుంటారు. ఆఖరికి సొంత పార్టీ నేతలపైనా చేయిచేసుకోవడం ,పలుసార్లు తీవ్ర వివాదాస్పదమై తిరుగుబాటుకు కూడా దారితీసింది. 2014కు ముందు అప్పటి మంత్రి వసంత్ కుమార్ పై చేయిచేసుకున్న వైనంపై భీమడోలు కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధించినా కూడా చింతమనేనిలో మార్పు రాలేదు. 40 కి పైగా కేసులున్నా కూడా చింతమనేనిని ఒక్క కేసులో కూడా పోలీసులు అరెస్ట్ చేయలేదంటే పోలీసు శాఖపై ఎంత ఒత్తిడి ఉందో స్పష్టమవుతోంది. ఈ ఎన్నికలలో దెందులూరు నియోజకవర్గంలో 84.70 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సరళిని బట్టి దెందులూరు ప్రజలు మార్పును కోరుకున్నట్లు తెలుస్తోంది. తనకి చాలా గట్టిపోటీ ఎదురైందని...గెలుపుపై చింతమనేనే అనుమానం వ్యక్తం చేస్తున్న పరిస్థితి.
చింతమనేని సామాజిక వర్గానికే చెందిన కొఠారు అబ్బయ్య చౌదరి వైఎస్సార్‌సీపీ నుంచి బరిలో ఉండటం.. ఆయనకు క్లీన్ ఇమేజ్ ఉండటం ఈ ఎన్నికల్లో ప్లస్ పాయింట్‌గా మారింది. కొఠారు అబ్బయ్య చౌదరి ఈ ప్రాంత వాసులకు కొత్త కాకపోయినా రాజకీయాలకు కొత్త. 2017 వరకు లండన్‌లో సాఫ్ట్‌వేర్ నిపుణుడిగా ఉన్న కొఠారు అబ్బయ్య చౌదరికి రాజకీయాలపై పెద్దగా అవగాహన లేదు. నేరుగా తండ్రి రాజకీయ వారసత్వంతోపాటు స్వదేశంలో సొంతగడ్డపై ప్రజలకు సేవ చేయాలనే ఆకాంక్షకు తోడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన పిలుపుతో రాజకీయాల్లో అడుగుపెట్టారు. దెందులూరు నియోజకవర్గ కన్వీనర్‌గా నియమితులైన కొఠారు అబ్బయ్య చౌదరి చింతమనేని అక్రమాలపై గట్టిగానే పోరాటం చేశారు. రెండేళ్లుగా గడప గడపకు వైఎస్సార్, రావాలి జగన్ కావాలి జగన్ వంటి కార్యక్రమాలతో అబ్బయ్య చౌదరి ప్రజలలో మమేకమయ్యారు. ఇదే సమయంలో సొంత సామాజిక వర్గం నుంచి కూడా చింతమనేని కంటే కొఠారుకే ఎక్కువ మద్దతు లభించిందని తెలుస్తోంది. చింతమనేని తీరుతో విసిగెత్తిపోయిన దెందులూరు ప్రజలు ఓటు అనే ఆయుధంతో మార్పు కోరుతూ చింతమనేనికి చెక్ పెట్టారనే ప్రచారం సాగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment