
మాట్లాడుతున్న ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి
దెందులూరు: పినకడిమి, ప్రత్తికోళ్లలంకలో హత్యలు చేయించింది ఎవరో నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసునని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. 18 నెలలు ప్రత్తికోళ్లలంకలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేయడానికి సూత్రధారి, పాత్రధారి ఎవరో కూడా అందరికీ తెలుసని చెప్పారు. పినకడిమిలో బలవంతంగా బంగారం లాక్కోవడం, దౌర్జన్యాలు ఇలా చెప్పుకొంటూపోతే తాను ప్రతీదీ చెప్పగలనని ఆయన తెలిపారు.
గురువారం వైఎస్సార్‌సీపీ దెందులూరు మండల కన్వీనర్ కామిరెడ్డి నాని నివాసంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ టీడీపీ హయాంలోనే సీఎంగా చంద్రబాబునాయుడు ఉండగానే చింతమనేనిపై రౌడీషీట్ తెరిచారని గుర్తుచేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలోనే 84 కేసులు అన్ని పోలీస్‌స్టేషన్లలో నమోదయ్యాయని, 24 కేసులు వివిధ దశల్లో పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. చింతమనేని హయాం అంతా ప్రజలు, ఉద్యోగులు, పార్టీ నాయకులపై దాడులు, దౌర్జన్యాలు, దూషణలు లాంటి ఘటనలే అధికమన్నారు. పూర్తి నేర చరిత్ర కలిగిన చింతమనేని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తల జోలికి వస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు.
చదవండి: (Nara Lokesh: జూమ్ కాన్ఫరెన్స్‌లో నారా లోకేష్‌కు ఝలక్)
మూడేళ్ల పాటు ప్రశాంత వాతావరణంలో సీఎం వైఎస్ జగన్ నేతృత్వంలో రూ.470 కోట్ల మేరకు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అన్ని గ్రామాల్లో చేపట్టినట్టు చెప్పారు. సంక్షేమ పథకాలు కుల, మత, వర్గ, పార్టీలకు అతీతంగా అందించామన్నారు. తాము మేనిఫెస్టోను దగ్గర పెట్టుకుని గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని చేస్తుంటే 10 రోజుల్లో నియోజకవర్గంలో ప్రజల నుంచి వస్తున్న అపూర్వ ఆదరణ, గ్రామగ్రామానా ప్రజలు బ్రహ్మరథం పడుతుండటం చూసి ఓర్వలకే నియోజకవర్గంలో ప్రశాంతతను భగ్నం చేసేందుకు చింతమనేని కుట్రకు తెరలేపారన్నారు. చంద్రబాబు స్క్రీన్‌ప్లే చేస్తుంటే.. పప్పు లోకేష్ ప్రోత్సహిస్తున్నాడని, చింతమనేని ఈ కుట్రలన్నీ అమలు చేస్తున్నాడని చెప్పారు.
ఆడకూతుళ్లను కించపరిస్తే.. తడాఖా చూపిస్తాం...
ఏ నియోజకవర్గంలోనూ, ఏ రాజకీయ నాయకుడూ చేయని విధంగా ఆడకూతుళ్లను సైతం సోషల్ మీడియాలో ప్రచారసాధనాల్లో లాగి కించపరిచేలా పోస్టులు పెడితే ఇకపై తమ తడఖా చూపిస్తామని ఎమ్మెల్యే హెచ్చరించారు. చింతమనేని, టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఒళ్లు దగ్గర పెట్టుకుని ఉండకపోతే, భవిష్యత్తులో జరిగే అన్ని పరిణామాలనూ ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు.
పక్క నియోజకవర్గం వెతుక్కుంటున్న చింతమనేని నాకు పోటీయా..
గత ఎన్నికల్లో 18 వేల ఓట్ల తేడాతో తన చేతిలో ఓడిపోయి పోలీస్‌స్టేషన్‌లో కేసులు ఎదుర్కొంటూ జైలు జీవితం గడిపి, ఓటమి భయం పట్టుకుని మూడేళ్లుగా ఇంటికే పరిమితమై పక్క నియోజకవర్గాల్లో ఏదోకచోట కర్ఛీఫ్ వేద్దామని, ప్రతి నియోజకవర్గానికీ తిరుగుతున్న చింతమనేని నాకు పోటీయా అని ఎమ్మెల్యే కొఠారు ప్రశ్నించారు. అభివృద్ధి, సంక్షేమంపై ఏ గ్రామంలోనైనా బహిరంగ చర్చకు సిద్ధమేనా ఆయన సవాల్ విసిరారు. సమావేశంలో బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు గంటా ప్రసాదరావు, జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, ఏలూరు రూరల్ మండల అధ్యక్షుడు తేరా ఆనంద్, ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.