
సాక్షి, పశ్చిమగోదావరి: జైలు నుంచి బయటకు వచ్చిన చింతమనేని ప్రభాకర్ వ్యాఖ్యలు హాస్యాస్పదంగా ఉన్నాయని దెందులూరు ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. గత ఐదేళ్లలో మీడియాపై చేసిన దాడులు గుర్తుకు రాలేదా అని నిప్పులు చెరిగారు. ‘నియోజకవర్గంలో దళితులపై దాడులు చేయలేదా..? ఎంత మంది పేదల ఇళ్లు కూల్చారో మారిచిపోయావా.. నీపై అక్రమ కేసులు పెట్టానని అంటున్నావ్ వాటిపై బహిరంగ చర్చకు సిద్ధమా’ అంటూ సవాల్ విసిరారు. చింతమనేనిపై పెట్టిన కేసులన్నీ చంద్రబాబు ప్రభుత్వంలో నమోదు అయినవేనని పేర్కొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో జరిగే అభివృద్ధికి సహకరించాలని కోరారు. అభివృద్ధిని అడ్డుకుంటే సహించమని హెచ్చరించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై మాట్లాడే అర్హత చింతమనేనికి లేదన్నారు. రాష్ట్రంలోనే దెందులూరును మోడల్ నియోజకవర్గం గా తీర్చిదిద్దడానికి కృషి చేస్తున్నామని చెప్పారు.
ఇసుక, మట్టిని విచ్చలవిడిగా దోచుకున్నారు..
సీఎం వైఎస్ జగన్‌ను విమర్శించే స్థాయి చింతమనేనికి లేదని వైఎస్సార్‌సీపీ జిల్లా అధికార ప్రతినిధి కొఠారు రామచంద్రరావు ధ్వజమెత్తారు. నీ తండ్రికి మూడున్నర ఎకరాలు మాత్రమే ఉందని.. నేడు నీకు వేల కోట్లు ఎలా వచ్చాయని చింతమనేనిని ప్రశ్నించారు. అధికారులు, మహిళలపై దాడులకు దిగడంతో పాటు, సమావేశంలో వట్టి వసంతకుమార్‌పై కూడా దాడి చేయలేదా అని ప్రశ్నించారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక, మట్టి విచ్చలవిడిగా దోచుకున్నారని ధ్వజమెత్తారు. చింతమనేని ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మాపై 13 తప్పుడు కేసులు పెట్టారన్నారు.
Comments
Please login to add a commentAdd a comment