మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్‌ జగన్‌ | Ys Jagan Meeting With Ysrcp Leaders Of West Godavari And Eluru Districts | Sakshi
Sakshi News home page

మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే: వైఎస్‌ జగన్‌

Published Thu, Oct 3 2024 1:07 PM | Last Updated on Thu, Oct 3 2024 5:23 PM

Ys Jagan Meeting With Ysrcp Leaders Of West Godavari And Eluru Districts

ఏపీలో అధికార దుర్వినియోగం తీవ్రంగా ఉంది

రాజకీయాల్లో వ్యక్తిత్వం చాలా ముఖ్యం

కష్టం వచ్చినప్పుడు నిలబడగలిగాలి.. అప్పుడే ప్రజల ఆశీస్సుల ఉంటాయి

రాజకీయాల్లో విశ్వసనీయత చాలా ముఖ్యం

వైఎస్సార్‌సీపీ ఐదేళ్ల కాలంలో ప్రజలకు ఇచ్చిన ప్రతిమాటా నెరవేర్చాం

సాకులు వెతుక్కోకుండా మేనిఫెస్టోను అమలు చేశాం

రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేనివిధంగా బడ్జెట్‌కు ముందే సంక్షేమ క్యాలెండర్‌ విడుదల చేశాం
 

సాక్షి, తాడేపల్లి: అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అవుతున్నా బడ్జెట్‌ ప్రవేశపెట్టలేకపోతున్నారంటూ కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ‘‘బడ్జెట్‌ ప్రవేశపెడితే ఏ స్కీమ్‌కు ఎంత ఇస్తున్నారు, ఇచ్చిన హామీలకు దేనికెంత కేటాయింపులో చెప్పాల్సి ఉంటుంది. అలా చెప్పకపోతే ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. అందుకనే బడ్జెట్‌ ప్రవేశపెట్టేందుకు కాలయాపన చేస్తున్నారు’’ అని వైఎస్‌ జగన్‌ దుయ్యబట్టారు.

 ప్రజలు.. తేడాను గమనిస్తున్నారు.. 
‘‘గతంలో ప్రతి ఏడాది మనం సంక్షేమ క్యాలెండర్ విడుదల చేశాం. ఏ పథకానికి ఎంతో బడ్జెట్‌ కేటాయింపుల్లో స్పష్టంగా చెప్పాం. క్యాలెండర్‌ ప్రకారం వాటిని విడుదల చేసి అండగా ఉండేవాళ్లం. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ పాలనకూ, టీడీపీ పాలనకూ మధ్య తేడాను ప్రజలు గమనించారు. రెండు ప్రభుత్వాల్లో ఎవరికి ఏం మంచి జరిగిందన్నదానిపై ప్రతి కుటుంబంలోనూ చర్చ జరుగుతోంది’’ అని వైఎస్‌ జగన్‌ వివరించారు.

చంద్రబాబు అబద్ధాలు.. మోసాలుగా మారుతున్నాయి
‘‘చంద్రబాబు అబద్ధాలు.. ఇప్పుడు మోసాలుగా మారుతున్నాయి. చంద్రబాబు మోసాలపై రోజురోజుకూ ప్రజల ఆగ్రహం పెరుగుతోంది. జగన్‌ పలావు పెడితే.. చంద్రబాబు బిర్యానీ పెడతానన్నారు. బిర్యానీ లేదుకదా.. ఉన్న పలావు పోయింది. సూపర్‌ సిక్సూ లేదు సూపర్‌ సెవెనూ లేదు. విద్యాదీవెన లేదు.. వసతి దీవెనా.. లేదు. ఇంగ్లీషు మీడియం చదువులూ దెబ్బతిన్నాయి, టోఫెలూ పోయింది. గోరుముద్ద కూడా పోయింది. ప్రజారోగ్య రంగం తీవ్రంగా దెబ్బతింది. ఆరోగ్యశ్రీ అటకెక్కింది. వ్యవసాయం, పెట్టుబడి సాయం కూడా పోయింది

చంద్రబాబు సర్కార్‌లో ప్రతీదీ స్కామే..
..ఉచిత ఇన్సూరెన్స్‌ ఆచూకీ లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోతున్నాయి. డోర్‌ డెలివరీ గాలికి ఎగిరిపోయింది. ఇప్పటికే లక్షన్నర పెన్షన్లు కట్. నాయుకుల దగ్గరకు వెళ్తే కాని పెన్షన్‌ రాని పరిస్థితి. పేరుకు ఇసుక ఉచితం అన్నారు.. కాని వైఎస్సార్‌సీపీ హయాంలో కన్నా, ఇప్పుడు ఇసుక రేటు అధికంగా ఉంది. మన హయాంలో ఇసుక సరసమైన ధరకే దొరికేది, ప్రభుత్వానికీ ఆదాయం కూడా వచ్చేది. వైఎస్సార్‌సీపీ హయాంలో నిల్వలు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు ఇసుక దొరకడం లేదు, రేట్లు కూడా అధికంగా ఉన్నాయి. ప్రభుత్వానికి ఇప్పుడు ఒక్కపైసా కూడా రావడం లేదు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని మద్య నియంత్రణకు పెద్ద పీట వేశాం. అమ్మకాలను గణనీయంగా నియంత్రణలో ఉంచాం. ఇప్పుడు ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసేలా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఎక్కువ లిక్కర్‌ అమ్మాలి అన్న ధోరణితో వెళ్తోంది. ఇలా ప్రతీదీ స్కామే.

ఇదీ చదవండి: పౌర సేవలకు జగన్‌ సై.. మద్యం ఏరులకు బాబు సై సై!!

కేసులకు భయపడొద్దు..
..రాష్ట్రంలో ఎక్కడిపడితే అక్కడ క్లబ్బులు నడుస్తున్నాయి. మట్కా లాంటి వ్యవహారాలు జోరుగా సాగుతున్నాయి. ఇది తప్పు అని ప్రజలు ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెడుతున్నారు. కేవలం నాలుగు నెలల కాలంలో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయి. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు ఓపికతో ముందుకు సాగాలి. ప్రజలకు అండగా ఉండాలి. ప్రజల తరఫున పోరాటాల్లో భాగస్వాములు కావాలి. కేసులకు భయపడాల్సిన అవసరం లేదు. గొంతు నొక్కడానికి, అణచివేయాలన్న ధోరణితో కేసులు పెడుతున్నారు. వీటికి భయపడాల్సిన అవసరం లేదు’’ అని వైఎస్‌ జగన్‌ స్పష్టం చేశారు.

ఇదీ చదవండి: నాలుగు నెలల్లోనే.. అన్నింటా విఫలం: వైఎస్‌ జగన్‌

అన్యాయమైన పరిపాలన సాగుతోంది..
‘‘నన్ను 16 నెలలు జైల్లో పెట్టారు. నన్ను హింసించినట్టుగా ఎవ్వరినీకూడా చేసి ఉండరు. అయినా ప్రజల ఆశీస్సులతో ముందుకు సాగాం. కేసులు పెట్టడం మినహా వీళ్లు చేయగలిగింది ఏమీ లేదు. రెడ్‌బుక్‌ ఏదైనా పెద్ద విషయమా? అదేదో గొప్ప పని అన్నట్టు వ్యవహరిస్తున్నారు. ఇలా అయితే ప్రతి ఒక్కరూ ఒక బుక్‌ రాసుకుంటారు. న్యాయం, ధర్మం అనేవి ఉండాలి. అన్యాయమైన పరిపాలన ఇవాళ కొనసాగుతోంది. మళ్లీ వచ్చేది మన ప్రభుత్వమే’’ అని వైఎస్‌ జగన్‌ చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement