చంద్రబాబు అబద్ధాలు, మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం
హామీలు నిలబెట్టుకోని టీడీపీ కూటమి ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల సమావేశంలో వైఎస్ జగన్
వ్యవసాయం, విద్య, వైద్య రంగాల్లో పూర్తి వైఫల్యం.. మూడు నెలల్లోనే లక్షన్నర పెన్షన్లు తొలగింపు
విజయవాడ వరదల్లో ఘోర వైఫల్యం
జరిగిన నష్టాన్ని అంచనా వేయలేకపోతున్నారు.. వాళ్లకు నచ్చిన వారికే పరిహారం ఇస్తున్నారు
బాధితులు కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు
ప్రతిపక్షంపై అదేపనిగా కేసులు.. డైవర్షన్ పాలిటిక్స్
అందుకే వీళ్ల పనులకు దేవుడు మొట్టికాయలు వేస్తున్నాడు
కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవన్ లేదు. ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, అమ్మ ఒడి, రైతు భరోసా, స్కూళ్లు.. ఆస్పత్రుల అభివృద్ధి.. అన్నీ పోయాయి. మూడు నెలల్లో లక్షన్నర పింఛన్లు తగ్గించారు. నాణ్యమైన చదువులు లేవు.. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందలేదు.. ఆర్బీకేల్లో సేవలు లేవు.. ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ లేదు.. అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం విఫలమైంది. చంద్రబాబు అబద్ధాలు, మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. ప్రజల కోపాగ్నిలో కూటమి ప్రభుత్వం దహించుకుపోవడం ఖాయం.
– వైఎస్ జగన్
సాక్షి, అమరావతి: ‘కూటమి ప్రభుత్వం వచ్చి నాలుగు నెలలైంది. సూపర్ సిక్స్ లేదు.. సూపర్ సెవన్ లేదు.. చంద్రబాబు అబద్ధాలు, మోసం పట్ల ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. సర్వత్రా వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోంది. ప్రజల కోపాగ్నిలో కూటమి ప్రభుత్వం దహించుకు పోవడం ఖాయం’ అని వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. అన్ని విషయాల్లోనూ ఈ ప్రభుత్వం కుప్పకూలిందని చెప్పారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ, ఆరోగ్య ఆసరా, అమ్మ ఒడి, రైతు భరోసా, స్కూళ్లు.. ఆస్పత్రుల అభివృద్ధి.. అన్నీ పోయాయన్నారు. మూడు నెలల్లో లక్షన్నర పింఛన్లు తగ్గించారని ఎత్తిచూపారు. నాణ్యమైన చదువులు లేవు.. వ్యవసాయానికి పెట్టుబడి సాయం అందలేదు.. ఆర్బీకేల్లో సేవలు లేవు.. ఉచిత క్రాప్ ఇన్సూరెన్స్ లేదు.. అని ఆవేదన వ్యక్తం చేశారు.
ప్రజలకు పనికొచ్చే కార్యక్రమాలేవీ అమలు కాకున్నా, జన్మభూమి కమిటీలు మాత్రం మళ్లీ వచ్చాయని చెప్పారు. ప్రధానంగా విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా తిరోగమనంలో ఉందని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం ఆయన వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షులతో సమావేశమయ్యారు. రానున్న రోజుల్లో పార్టీ నిర్వహించాల్సిన కార్యక్రమాలపై చర్చించి.. భవిష్యత్ కార్యాచరణపై దిశా నిర్దేశం చేశారు.
వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందిస్తున్న వైఎస్సార్‌సీపీ అనుబంధ విభాగాల నేతలు
హామీలు నెరవేర్చలేక డైవర్షన్ పాలిటిక్స్
రాష్ట్రంలో ఇష్టం వచ్చినట్లు దొంగ కేసులు పెట్టి రెడ్ బుక్ పరిపాలన సాగిస్తున్నారని, లా అండ్ ఆర్డర్ లేదని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘డోర్ డెలివరీ గాలికెగిరిపోయింది. పారదర్శకత లేదు. చివరికి విజయవాడలో వరద నష్టాన్ని కూడా అంచనా వేయలేని దుస్థితిలో ఉన్నారు. వాళ్లకు నచ్చిన కొందరికే పరిహారం ఇస్తున్నారు. ప్రజలు కలెక్టర్ ఆఫీస్‌ను చుట్టుముడుతున్నారు.
నాలుగు నెలలకే ప్రభుత్వం మీద వ్యతిరేకత తారస్థాయికి వెళ్లడంతో, ఎప్పటికప్పుడు డైవర్షన్ పాలిటిక్స్‌కు పాల్పడుతున్నారు. తిరుపతి లడ్డూ అని ఒకసారి, డిక్లరేషన్ అని మరోసారి డైవర్షన్ చేస్తున్నారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు పెడుతున్నారు’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీళ్లు చేస్తున్న పనులతో దేవుడికి కూడా కోపం తెప్పిస్తున్నారని, అందుకే అనూహ్య రీతిలో మొట్టికాయలు పడుతున్నాయని.. ఇది దేవుడి దయే అని అన్నారు.
‘టీటీడీకి తెలుగుదేశం ప్రభుత్వంలోనే అపాయింట్ అయిన ఐఏఎస్ ఆఫీసరే ఈఓగా ఉన్నారు. వాళ్ల ఈఓ చెప్పిన మాటలు.. చంద్రబాబు చెప్పిన మాటలు వేరుగా ఉన్నాయి. చంద్రబాబు చెప్పిన మాటలు అబద్ధాలు అని తేలిపోయింది. నోటీసులు ఇవ్వలేదంటారు. అడ్డుకోలేదంటారు. ఇవిగో నోటీసులు అంటే మాట్లాడరు. చాలా అధ్వాన్నమైన పాలన సాగిస్తున్నారు’ అని ధ్వజమెత్తారు.
Comments
Please login to add a commentAdd a comment