ఆంధ్రప్రదేశ్‌లో మందుబాబులకు ఇంక పండగే పండగ! చౌక మద్యం.. అడిగినోళ్లకు అడిగినంత. ఐదేళ్లుగా జనావాసాలకు దూరంగా.. ఊరిబయట ఉన్న మద్యం దుకాణాలిప్పుడు వీధి వీధికి రానున్నాయి! ఇప్పటివరకూ మద్య నియంత్రణలో భాగంగా ప్రభుత్వమే రీటెయిల్ మద్యం షాపులు నిర్వహిస్తే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వచ్చాక ఇప్పుడు ప్రైవేట్ వాళ్లు రంగంలోకి దిగబోతున్నారు. అయినకాడికి దోచుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకొచ్చిన సరికొత్త మద్యం పాలసీ విపరిణామాలు ఇవి. లిక్కర్ సిండికేట్ల దాదాగిరీ.. గతంలో చంద్రబాబు కాలంలో మాదిరిగా లిక్కర్ సిండికేట్లు, అధికార పార్టీ నేతల మధ్య అక్రమ సంబంధాలు మళ్లీ జోరందుకోనున్నాయి. కొత్త మద్యం పాలసీ దోచుకున్నోడికి దోచుకున్నంత చందంగా ఉపయోగపడవచ్చు.
మద్య నిషేధమే లక్ష్యంగా ఉద్యమించి 1994లో అధికారంలోకి వచ్చిన ఎన్టీఆర్ ఆధ్వర్యంలోని తెలుగుదేశం పార్టీ ఇప్పుడు చంద్రబాబు నేతృత్వంలో మద్యం ఏరుల్లా పారించేందుకు భూమికను సిద్ధం చేసిందన్నమాట. ఎన్టీఆర్ ఆశయాలకు తూట్లు పొడిచి 1996లోనే చంద్రబాబు రకరకాల సాకులు చెప్పి మద్యనిషేధాన్ని ఎత్తివేసిన సంగతి కూడా మనం ఇక్కడ ఒకసారి గుర్తు చేసుకోవాలి. చంద్రాబాబు తన మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి గద్దెనెక్కింది కూడా మద్యం లాబీ పెద్దల అండతోనే అన్న చర్చ కూడా అప్పట్లో జోరుగానే నడిచింది. బాబు హయాంలో లిక్కర్ స్కాములు కూడా బోలెడన్ని చోటు చేసుకోవడం వార్తల్లోకి ఎక్కిన అంశాలే.
ఇక మద్య నిషేధ ఉద్యమానికి ఛాంపియన్లమని ప్రచారం చేసుకున్న ఈనాడు మీడియా ప్రస్తుతం వారి పత్రికలో పెట్టిన హెడ్డింగ్ ఏమిటంటే ఇక నాణ్యమైన మద్యం రాబోతోందని. ప్రపంచ దేశాల సంగతి తెలియకపోయినా, బహుశా దేశంలో ఎక్కడా తాము తక్కువ ధరకే మద్యం అందిస్తామని ప్రచారం చేసిన ఏకైక నేత చంద్రబాబు నాయుడే కావచ్చు. ఈ సంద్భంగా మాజీ మంత్రి అంబటి రాంబాబు విసిరిన సెటైర్ ఆసక్తికరంగా ఉంది. ఇంతకాలం ''మద్యం తాగడం హానికరం" అని మద్యం బాటిళ్లపై రాస్తున్నారు. ఇక దాన్ని తొలగించి చంద్రబాబు ప్రభుత్వం 'నాణ్యమైన మద్యం సరసమైన ధరలకు ఇస్తున్నాం ఎంతైనా తాగండి" అని స్టిక్కర్ అంటిస్తారేమోనని చమత్కరించారు.
ఇదీ చదవండి: తప్పతాగండిక!.. జాతిపిత జయంతి రోజున సర్కారు కానుక
నిజంగానే మద్యం నిత్యం తాగడం ప్రమాదకరం. సీనియర్ నేత అయిన చంద్రబాబు నాయుడు ప్రజలకు మద్యం తాగవద్దని చెప్పాల్సింది పోయి సాయంత్రం వేళ ఒక పెగ్గేసుకోండని ఎన్నికల ప్రచారంలో ఏమాత్రం సిగ్గుపడకుండా చెప్పారు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో నాణ్యమైన మద్యం రావడం లేదని ఆరోపించారు. నిజానికి జగన్ ప్రభుత్వం కొత్త బ్రాండ్లేమి తేకపోయినా చంద్రబాబు టైమ్‌లో ఇచ్చిన పది పదిహేను బ్రాండ్లను కొనసాగించినా అవన్నీ జగన్ బ్రాండ్లుగానే ప్రచారం చేయడంలో చంద్రబాబుతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి తదితర ఎల్లో మీడియా కృషి చేసిన సంగతి తెలిసిందే. అవి నాణ్యత లేనివని అప్పట్లో ఆరోపించారు.
ఈ వందరోజుల పాలనలో ఆ బ్రాండ్లను రద్దు చేసినట్టు కనిపించలేదు. ఈ మూడు నెలల్లో మందుబాబుల ఆరోగ్యం దెబ్బ తినలేదని చంద్రబాబు సర్టిఫికెట్ ఇస్తున్నారా? తాజాగా మద్యం మానిపించే బాధ్యత ఆయన మందుబాబుల భార్యల మీద పెట్టారు. తానేమో షాపులు పెంచి, వారికి మార్జిన్లు పెంచి, ఇళ్ల మద్య షాపులు ,బార్లు, ఎలైట్ షాపులు పెడతారట. కాని మద్యం తాగవద్దని భార్యలే చెప్పాలట. జగన్ తాను హామీ ఇచ్చినట్టు మద్య నిషేధం చేయలేకపోయి ఉండవచ్చు. మద్య నియంత్రణ ద్వారా ఆ దిశగా కృషి చేశారనేది వాస్తవం. అంతకుముందు నాలుగు వేలకు పైగా ఉన్న షాపులను 2,600కు తగ్గించడం, బార్లను తగ్గించడం, అమ్మకం వేళల్ని కుదించడం, ధర పెంచడం, బెల్టు షాపుల నిర్మూలన లాంటి చర్యలు చేపట్టారు. అక్రమ మద్యం రాకుండా ప్రత్యేక దళాల్ని నియమించారు. సిండికేట్లు లేకుండా, మద్యం మాఫియాలు లేకుండా జగన్ చేయగలిగారు. అయినా చంద్రబాబు అండ్ కో విపరీతమైన దుష్ఫ్రచారం చేసింది. ఇప్పుడు సహజంగానే మద్యం మాఫియాల అండ టీడీపీకి లభిస్తుంది. ఇప్పటికే టీడీపీ నేతలు, కార్యకర్తలు ప్రస్తుతమున్న పలు బార్ల యజమానులను బెదిరించి వాటిని స్వాధీనం చేసుకున్నారట.
స్థూలంగా చూస్తే కొత్త మద్యం విధానం ప్రైవేట్ సిండికేట్లు, అధికార కూటమి నేతలకు ఎంత వీలైతే అంత దోపిడి చేసుకునే అవకాశం కల్పించవచ్చు. ఇప్పటికే పలు చోట్ల షాపుల టెండర్లలో తమకు పోటీ రావద్దని టీడీపీ కూటమి నేతలు ఇతర మద్యం వ్యాపారులను హెచ్చరిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. మద్యం క్వార్టర్ రూ.99లకే ఇచ్చేలా చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించింది. మరీ అంత తక్కువ ధరకు నాణ్యమైన మద్యం వస్తుందా అన్న సందేహం కొందరిలో ఉంది. భక్తితో తిరుమలకు కొన్ని సంస్థలు తక్కువ ధరకే నేతిని సరఫరా చేస్తే అందులో నాణ్యత ఉండదంటూ వ్యాఖ్యానించిన చంద్రబాబు, ఇప్పుడు మద్యంలో మాత్రం తక్కువ ధరకు ఇస్తే నాణ్యత ఉంటుందని చెబుతున్నారు.
రాష్ట్రంలో మొత్తం 3,736 మద్యం దుకాణాలు రాబోతున్నాయి. అంటే సుమారు వేయి పెరుగుతాయి. పన్నెండు ప్రీమియర్ దుకాణాలు ఏర్పాటు చేస్తారట. వాకిన్ లిక్కర్ స్టోర్లు రాబోతున్నాయని అంటున్నారు. యథాప్రకారం బెల్ట్ షాపులను నిరోధించే పరిస్థితి ఉండకపోవచ్చు. 2014-19 మద్య మద్యం ఎంత అరాచకంగా ఏపీలో పారిందో అది తిరిగి రిపీట్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రజలు కూడా అదే కోరుకుంటున్నారనేది కూటమి నేతల అభిప్రాయం కావచ్చు. అందుకే ఈనాడు, ఆంధ్రజ్యోతివంటి పత్రికలు చాలా సంతోషపడుతూ నాణ్యమైన మద్యం రాబోతున్నదని ప్రచారం చేస్తున్నాయి. ఈ మద్యం తక్కువ ధరకే వస్తుంది కదా అని అధికంగా తాగితే ప్రజలు అనారోగ్యం పాలు కారా అన్న వైఎస్సార్ సీపీ నేత అంబటి రాంబాబు ప్రశ్నకు సమాధానం దొరకదు.
రాష్ట్ర ఖజానా ఖాళీగా ఉందని చెబుతున్న చంద్రబాబు నాయుడు మద్యాన్ని విపరీతంగా తాగించి వేల కోట్ల రూపాయల ఆదాయం సమకూర్చుకుంటారేమోనని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. మహిళా సంఘాలు సైతం ఈ మద్యం విధానంపై పెద్దగా స్పందిస్తున్నట్టు కనపడ్డం లేదు. కాకపోతే అక్కడక్కడ కొద్ది పాటి నిరసనలు జరిగాయి. ఇంతకాలం ఊళ్లకు దూరంగా వున్న లిక్కర్ షాపులు ఇకపై నివాసాల మధ్యలోనే ఏర్పాటైతే వచ్చే దుష్ప్రరిణామాలపట్ల ప్రజలు ఎలా స్పందిస్తారో చూడాలి. బెల్టు షాపులు యథేచ్ఛగా వచ్చే అవకాశం ఉండడంతో రోజులో ఏ సమయంలోనైనా మద్యం సరఫరా ఉండవచ్చు.
జగన్ ప్రభుత్వం ఇంటింటికీ పౌరసేవలు అందిస్తే చంద్రబాబు ప్రభుత్వం ఇంటింటికీ మద్యం సరఫరా చేసేటట్టు ఉందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పాఠశాలల్ని బాగు చేసి సీబీఎస్ఈ, ఆంగ్ల మీడియం, ట్యాబులు వంటి సంస్కరణలు ప్రవేశపెడితే చంద్రబాబు ప్రభుత్వం వాటిని రద్దు చేసింది. విద్య కన్నా మద్యానికే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చే ప్రభుత్వంగా చంద్రబాబు ప్రభుత్వం రికార్డు సృష్టిస్తుందేమో చూడాలి. మద్యం విషయంలో తెలంగాణ రాజధాని హైదరాబాద్‌తో పోటీపడేలా ఉన్నారు. చంద్రబాబు అనుభవం చిట్టచివరికి ఆంధప్రదేశ్ ప్రజలు మద్యానికి బానిసలు అయ్యేలా చేసేలా ఉంది.
- కొమ్మినేని శ్రీనివాస రావు
సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత
Comments
Please login to add a commentAdd a comment