తప్పతాగండిక!.. జాతిపిత జయంతి రోజున సర్కారు కానుక | Increase in the number of liquor shops and smart outlets | Sakshi
Sakshi News home page

తప్పతాగండిక!.. జాతిపిత జయంతి రోజున సర్కారు కానుక

Published Wed, Oct 2 2024 5:50 AM | Last Updated on Wed, Oct 2 2024 6:54 AM

Increase in the number of liquor shops and smart outlets

ఊరూరా మద్యం దుకాణాలు.. వాడవాడలా బార్లు

రాష్ట్రంలో ఇక బాబు బ్రాండ్‌ మద్యం దందా 

దసరా నుంచి దోపిడీకి తలుపులు తెరిచిన సర్కారు పెద్దలు 

ప్రైవేటు మద్యం దుకాణాల ముసుగులో దండుకునేందుకు స్కెచ్‌ 

టీడీపీ మద్యం సిండికేట్‌కు అనుకూలంగా కథ నడిపిన ప్రభుత్వం 

మద్యం దుకాణాలు, స్మార్ట్‌ అవుట్‌ లెట్ల సంఖ్య పెంపు 

గ్రామీణాభివృద్ధికి ఊతమిస్తూ ప్రజలకు ఉపయోగపడేలా గాంధీ జయంతి సందర్భంగా ఏదో ఒక కొత్త వ్యవస్థకు శ్రీకారం చుట్టాల్సిందిపోయి.. తద్భిన్నంగా రాష్ట్రంలో చంద్రబాబు సర్కారు ఊరూరా మద్యం దుకాణాలు, వాడవాడలా బార్లు.. వెల్లివిరిసేలా చర్యలకు నడుం బిగించింది. దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా రాష్ట్ర ప్రజలకు ‘సరికొత్త మద్యం’ కానుకను అందించనుంది. 

విచ్చలవిడిగా మద్యం అమ్మకాలకు ‘పచ్చ’ జెండా ఊపుతూ సోమవారం అర్ధరాత్రి దాటాక ప్రత్యేక ఆర్డినెన్స్, ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. టీడీపీ కూటమి సిండికేట్‌కు అనుకూలంగా పక్కాగా కుట్ర పూరితంగా వ్యవహరించింది. ఈ పరంపరలో ఈ నెల 12 నుంచి అంటే దసరా రోజున ప్రైవేటు మద్యం దుకాణాల ద్వారా దోపిడీకి ‘పచ్చ’ ముఠా కొబ్బరి కాయ కొట్టనుంది.

సాక్షి, అమరావతి : ‘తప్పతాగండి.. సమస్యలు మరచిపోండి.. ప్రశ్నించడం మానేయండి..’ అంటూ రాష్ట్రంలో మద్యం ఏరులై పారించేందుకు చంద్రబాబు ప్రభుత్వం సన్నద్ధమైంది. అందుకోసం రాష్ట్రంలో మద్యం దుకాణాల సంఖ్యను భారీగా పెంచాలని నిర్ణయించింది. గత వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలో దశల వారీ మద్య నియంత్రణను సమర్థంగా అమలు చేయడంలో భాగంగా ప్రైవేటు మద్యం దుకాణాల వ్యవస్థను తొలగించి ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అంతకు ముందు టీడీపీ ప్రభుత్వ హయాంలో 4,380 మద్యం దుకాణాలు ఉండగా  దశల వారీగా వాటిని 2,934కు తగ్గించింది. 

మద్యం దుకాణాల వేళలు కుదిస్తూ ఉదయం 10 నుంచి రాత్రి 9 వరకే విక్రయాలకు అనుమతించింది. 4,380 పర్మిట్‌ రూమ్‌లు రద్దు చేయడంతో పాటు ఏకంగా 43 వేల బెల్ట్‌ దుకాణాలు పూర్తిగా తొలగించింది. కొత్త బార్లకు లైసెన్సులు ఇవ్వడం ఆపేసింది. వీటన్నింటినీ కొనసాగించాల్సింది పోయి.. అందుకు పూర్తి విరుద్ధంగా రాష్ట్రంలో ప్రస్తుత టీడీపీ కూటమి ప్రభుత్వం.. మద్యం ప్రవాహానికి గేట్లు ఎత్తేయనుంది. ప్రస్తుతం ప్రభుత్వ మద్యం దుకాణాలు 2,934 ఉండగా.. వీటిని ప్రభుత్వ పరిధి నుంచి తగ్గించి.. మొదటి దశలోనే వాటి సంఖ్యను 3,396 దుకాణాలకు పెంచింది. 

వాటికి అదనంగా 12 స్మార్ట్‌ స్టోర్స్‌ ఏర్పాటు చేయనుంది. ఏడాదికి రూ.కోటి లైసెన్స్‌ ఫీజుగా ఈ స్మార్ట్‌ స్టోర్స్‌ కాల పరిమితి ఏకంగా ఐదేళ్లుగా నిర్ణయించింది. తర్వాతి దశల్లో మరిన్ని మద్యం దుకాణాలు, స్మార్ట్‌ స్టోర్స్‌ను అనుమతించాలని భావిస్తోంది. ఇక మద్యం దుకాణాల సమయాన్ని కూడా ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు అధికారికంగా అ­నుమతించనుంది. అనధికారికంగా అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు జరపాలని నిర్ణయించింది. 

పచ్చ సిండికేట్‌దే మద్యం దందా
» ప్రైవేటు మద్యం దుకాణాల కేటాయింపు అంతా టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లో సాగనుంది. గతంలో 2014 నుంచి 2019 వరకు పచ్చ సిండికేట్‌ ఏడాదికి రూ.2.50 లక్షల కోట్ల దోపిడీకి పాల్పడిన విషయం తెలిసిందే. ఈసారి అంతకు మించి అన్న రీతిలో భారీ దోపిడీకి రంగం సిద్ధం చేసింది. అందుకోసం ఆర్డినెన్స్‌ జారీ నుంచి లైసెన్సుల కేటాయింపు వరకు రాష్ట్ర ప్రభుత్వమే టీడీపీ కూటమి సిండికేట్‌కు అనుకూలంగా పక్కా పన్నాగంతో పావులు కదిపింది. 

» సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత ప్రైవేటు మద్యం దుకాణాలకు అనుమతినిస్తూ ఆర్డినెన్స్‌ జారీ చేసి.. దాంతోపాటే ప్రైవేటు మద్యం దుకాణాల లైసెన్స్‌ల జారీకి నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. మంగళవారం ఉదయం నుంచే మద్యం దుకాణాల టెండర్ల ప్రక్రియ మొదలుపెట్టింది. ఈ నెల 11న లాటరీ విధానంలో లైసెన్సులు కేటాయిస్తామని, 12 నుంచే అంటే దసరా రోజునే ప్రైవేటు మద్యం దుకాణాలు తెరుచుకుంటాయని వెల్లడించింది.

» అంటే టీడీపీ మద్యం సిండికేట్‌కు అనుకూలంగా ప్రభుత్వం ఎంత పక్కా పన్నాగంతో వ్యవహరించిందన్నది స్పష్టమవుతోంది. పేరుకి లాటరీ విధానంలో కేటాయింపు అని ప్రకటించినప్పటికీ.. టీడీపీ కూటమి ప్రజాప్రతినిధులే బినామీ పేర్లతో మద్యం దుకాణాలను గుప్పిట పట్టేందుకు ఇప్పటికే సిండికేట్‌ను రూపొందించారు. 

» రాష్ట్ర ప్రభుత్వ పెద్దలు చెప్పిన జాబితా ప్రకారమే మద్యం దుకాణాల లైసెన్సులు కేటాయించాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులకు ఇప్పటికే మౌఖికంగా ఆదేశించారు. అందుకు తగ్గట్గునే శ్రీకాకుళం నుంచి అనంతపురం జిల్లా వరకు టీడీపీ ప్రజాప్రతినిధులు సిండికేట్లుగా ఏర్పడ్డారు. 

ఇతరులు ఎవరూ టెండర్లు దాఖలు చేయకుండా అడ్డుకోవాలని.. ఎవరు టెండర్లు దాఖలు చేసినా సరే వారికి ఎవరూ దుకాణం అద్దెకు ఇవ్వడానికి వీల్లేదని, ఇచ్చినా ఎక్సైజ్‌ శాఖ అధికారుల ద్వారా దాడులు చేసి వేధిస్తామని బెదిరించాలని హుకుం జారీ చేశారు. టెండర్ల ప్రక్రియ మొదలు కావడమే తరువాయి టీడీపీ సిండికేట్‌ రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలను హస్తగతం చేసుకోవడం ఖాయం.

ఉద్యోగుల నిరసన.. తెరచుకోని దుకాణాలు
ప్రభుత్వ మద్యం దుకాణాల ఉద్యోగుల నిరసనతో రాష్ట్రంలో మంగళవారం మద్యం అమ్మకాలకు బ్రేక్‌ పడింది. తమ ఉద్యోగాలను అర్ధంతరంగా తొలగించిన టీడీపీ కూటమి ప్రభుత్వంపై రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 15 వేల మంది తీవ్ర స్థాయిలో నిరసన వ్యక్తం చేస్తూ మద్యం దుకాణాలను తెరవలేదు. మరోవైపు టీడీపీ అనుకూల సిండికేట్‌కు మద్యం దుకాణాలను కట్టబెట్టాలన్న ఆతృతలో ప్రభుత్వం సోమవారం అర్ధరాత్రి హడావుడిగా తీసుకువచ్చిన జీవోతో మరింత గందరగోళం నెలకొంది. 

మరోవైపు బుధవారం గాంధీ జయంతి సందర్భంగా మద్యం దుకాణాలను తెరవకూడదు. అంటే వరుసగా రెండు రోజులు మద్యం అమ్మకాలు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం ఆందోళన చెందింది. దాంతో ఎట్టి పరిస్థితుల్లోనైనా సరే మంగళవారం సాయంత్రానికి దుకాణాలు తెరిపించాలని ఎక్సైజ్‌ శాఖ అధికారులు, ఉద్యోగులపై ఒత్తిడి తెచ్చింది. ప్రభుత్వ మద్యం దుకాణాల్లోని మద్యం నిల్వలు, ఇతర సామగ్రిని స్వాధీనం చేసుకోవాలని ఆదేశించింది. 

కానీ మంగళవారం (అక్టోబరు 1) నుంచి ఈ నెల 11 వరకు రాష్ట్రంలో మద్యం అమ్మకాల విషయంపై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ఆర్డినెన్స్‌ ప్రకారం ప్రభుత్వ మద్యం దుకాణాలు ఇక ఉనికిలో లేనట్టే. కాబట్టి వాటిని తెరవకూడదు.. మద్యం అమ్మకూడదు. దాంతో రాష్ట్ర బేవరేజస్‌ కార్పొరేషన్‌ అధికారులు మద్యం దుకాణాలను తెరవలేరు. ఈ విషయాన్ని మంగళవారం మధ్యాహ్నం గుర్తించిన ప్రభుత్వం కంగారు పడింది. 

ప్రైవేటు మద్యం దుకాణాలు వచ్చేంత వరకు ప్రభుత్వ మద్యం దుకాణాలను కొనసాగించాలని ఎక్సైజ్‌ అధికారులను ఆదేశించింది. దీంతో వారు ఆందోళన చేస్తున్న ఉద్యోగుల వద్దకు వెళ్లి అతి కష్టంగా కొంత మందికి నచ్చజెప్పి దుకాణాలు తెరిపించారు. చాలా మంది ఉద్యోగులు విధులకు దూరంగా ఉన్నారు.  

ఈ బెదిరింపులేంటి?
శ్రీకాకుళం క్రైమ్‌:  శ్రీకాకుళం జిల్లాలోని ప్రభుత్వ మద్యం దుకాణాల్లో మంగళవారం ఎక్సైజ్‌ పోలీసుల బెదిరింపుల నడుమ సూపర్‌వైజర్లు, సేల్స్‌మెన్‌లు మద్యం అమ్మకాలు సాగించారు. తమ ఉద్యోగానికి భద్రత చూపించని కూటమి ప్రభుత్వం.. కేసులు పెడతామంటూ బెదిరిస్తూ విక్రయాలు చేయించడంపై వారు ఎదురుతిరిగారు. 

ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం నాటికి పూర్తయిన లావా దేవీలన్నింటి గురించి లెక్కలు చెప్పి, ప్రభుత్వం కేటాయించిన కానిస్టేబుల్‌కు మంగళవారం తాళాలు, షాపు హ్యాండోవర్‌ చేశారు. అయితే తాము సూచించే తేదీ వరకు అమ్మకాలు జరపాలని ఎక్సైజ్‌ పోలీసు అధికారులు ఆదేశించడం పట్ల నిరసన తెలిపారు. 

ప్రభుత్వం తమ ఉద్యోగాలు తీసేయడమే కాకుండా, ఇలా బెదిరించడం తగదని జిల్లా సేల్స్‌మెన్, సూపర్‌వైజర్ల సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కీర్తి ధర్మారావు, సంతోష్‌కుమార్‌లు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఉదయం నుంచి షాపులు మూత పడటంతో మద్యం విక్రయాలు దాదాపు రెట్టింపు ధరతో సాగాయి.

నోటిఫికేషన్‌లో ప్రధానాంశాలు
» మంగళవారం నుంచి ఈ నెల 9 వరకు దరఖాస్తుల స్వీకరణ  
»  ఈ నెల 11వ తేదీ లాటరీ ద్వారా లైసెన్సుదారుల ఎంపిక 
»  ఈ నెల 12వ తేదీ నుంచి ప్రైవేటు మద్యం దుకాణాలు ప్రారంభం

లైసెన్స్‌ ఫీజు వివరాలు
»  10 వేల లోపు జనాభా ఉంటే: రూ.50 లక్షలు
»  10 వేల నుంచి 50 వేల జనాభా ఉంటే రూ.55 లక్షలు
»  50,001 నుంచి 5 లక్షల జనాభా ఉంటే రూ.65 లక్షలు
»  5 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉంటే రూ.85 లక్షలు

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement