
చింతమనేనిపై గెలిచిన ఉత్సాహంతో దెందులూరు ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి
సాక్షి, ఏలూరు (టూటౌన్) : అసెంబ్లీ ఎన్నికల్లో వీచిన ఫ్యాన్ సుడిగాలికి ప్రభుత్వ విప్ చింతమేని ప్రభాకర్ కొట్టుకుపోయారు. ఇంతకాలం ఒక నియంతలా తనకు ఎదురులేదని విర్రవీగిన చింతమనేనికి నియోజకవర్గ ప్రజలు ఓటు అనే ఆయుథంతో గట్టిగా బుద్ధి చెప్పారు. రాజకీయాలకు కొత్త అయిన సాఫ్ట్‌వేర్ ఇంజినీరు అయిన కొఠారు అబ్బయ్య చౌదరిని ఆదరించారు.
రాజకీయాలకు కొత్త అయినా విద్యావంతుడు కావడం, ఆయన మాట తీరు, వ్యవహార శైలి నచ్చడంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పట్ల ప్రజలు చూపిన ఆదరణ వెరసి ఈ ఎన్నికల్లో విప్ చింతమనేని ప్రభాకర్‌కు తగిన గుణపాఠం చెప్పాయంటూ నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి పనిలోనూ వివాదాలకు కేంద్ర బిందువు కావడంతో పాటు చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా తిట్ల దండకం అందుకోవడం, చేయి చేసుకోవడం, అధికారులను వేధింపులకు గురిచేయడం వంటి అనేక కారణాలతో చింతమనేనిని ప్రజలు వ్యతిరేకించారు.
గత పదేళ్లుగా చింతమనేని వ్యవహార శైలితో విసుగు చెందిన నియోజకవర్గ ప్రజలు ఈ ఎన్నికల్లో ఆయన్ను తీవ్రంగా వ్యతిరేకించారు. నియోజకవర్గంలోని ఓట్లను 18 రౌండ్లలో లెక్కించగా 9, 18వ రౌండ్లలో మినహా మిగిలిన 16 రౌండ్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి స్పష్టమైన మెజార్టీ సాధించారు. 9వ రౌండులో టీడీపీకి 5,834, వైసీపీకి 4,779 ఓట్లు రావడంతో ఈ రౌండులో టీడీపీ 1,055 ఓట్ల ఆధిక్యాన్ని సాధించింది. చివరి రౌండు అయిన 18వ రౌండ్‌లో టీడీపీ 2,140 ఓట్లు సాధించగా వైసీపీ 1,928 ఓట్లు సాధించింది.
దీంతో ఆఖరి రౌండులో టీడీపీకి 212 ఓట్ల స్వల్ప ఆధిక్యం వచ్చింది. ఈ రెండు రౌండ్లు మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వెయ్యి ఓట్ల వరకూ మెజార్టీ సాధిస్తూ వచ్చింది. చివరకు మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తయ్యే సరికి ౖవైసీపీ అభ్యర్థి కొఠారు అబ్యయ్య చౌదరి 17,559 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. దీంతో దెందులూరులో చింతమనేని అడ్డాలో కొఠారు అబ్బయ్య చౌదరి పాగా వేశారు.