
దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు, మరికొందరు నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసు
బుధవారం రాత్రి పెళ్లి వేడుకలో ఎమ్మెల్యే చింతమనేని రచ్చ
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో కూటమి సర్కారు వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు కేసులకు తెగబడింది. బుధవారం రాత్రి పెదపాడు మండలం వట్లూరులోని పద్మావతి గార్డెన్స్‌లో వివాహ వేడుకకు హాజరైన టీడీపీ దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఉద్దేశపూర్వకంగానే రచ్చ చేసి, వైఎస్సార్‌సీపీ మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరిపైన, వైఎస్సార్‌సీపీ నేతలపైన దౌర్జన్యానికి పాల్పడ్డారు.
గురువారం తెల్లారేసరికి మొత్తం కథ మార్చేశారు. తన డ్రైవర్ మానుకొండ సుధీర్‌తో ఏలూరు త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో అబ్బయ్య చౌదరి, దెందులూరు నియోజకవర్గానికి చెందిన మరికొందరు వైఎస్సార్‌సీపీ నేతలపై తప్పుడు ఫిర్యాదు చేయించారు. వారు తనను దుర్భాషలాడుతూ కులం పేరుతో దూషించారని సుధీర్ ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.
ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, మట్టా ప్రవీణ్, జానంపేట బాబు, జితేంద్ర, సాయిరామ్ చౌదరి, మరో 20 మందిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
వివాహ వేడుకలో ఇదేం పని?
నోరు విప్పితే బూతులు మాట్లాడే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని వివాహ వేడుకలో కావాలనే గొడవకు దిగినట్టు వైఎస్సార్‌సీపీ నేతలు చెబుతున్నారు. అందరూ సంతోషంతో జరుపుకొనే వివాహ వేడుకలోనూ రాజకీయ రచ్చకు దిగడం, మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరితో గొడవ పెట్టుకోవటంపై టీడీపీ నేతలు సహా అందరూ తప్పుపడుతున్నారు. ఎమ్మెల్యే చింతమనేని కారు వెళ్లేందుకు దారి ఉన్నప్పటికీ, ఏదోలా రగడ సృష్టించాలనే ఉద్దేశంతోనే మాజీ ఎమ్మెల్యే కారు డ్రైవర్‌పై బూతులతో రెచ్చిపోయారని అంటున్నారు.
షూ వేసుకునే స్టిక్‌తో దాడి?
ఎమ్మెల్యే చింతమనేని బూట్లు వేసుకునేందుకు రెండు అడుగులు ఉండే ఐరన్ స్టిక్‌ను వినియోగిస్తారని తెలుస్తోంది. దానికి చివరగా పదునైన వంపు ఉంటుందని, దానితో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై దాడికి పాల్పడ్డారని బాధితులు చెబుతున్నారు. ఆయన బూతులు తిడుతుండగా వీడియో తీస్తున్న హేమంత్ నుంచి సెల్‌ఫోన్ లాక్కున్నారు.
అబ్బయ్య చౌదరి డ్రైవర్‌ను అసభ్య పదజాలంతో దుర్భాషలాడుతుండగా వారించిన వైఎస్సార్‌సీపీ పెదవేగి మండల అధ్యక్షుడు జానంపేట బాబు, దెందులూరు వైస్ ఎంపీపీ వేమూరి జితేంద్ర, మండల నాయకులు ఎం.కృష్ణారావుపై దాడి చేశారు. జానంపేట బాబుకు రెండు చేతులపై గాయాలయ్యాయి. వీడియో తీస్తున్న వారిపై చింతమనేని అనుచరులు దాడి చేసి సెల్‌ఫోన్లు లాక్కున్నట్లు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment