‘సాక్షి’పై కక్ష.. అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?: వైఎస్సార్‌సీపీ | YSRCP Leaders Reaction On False Cases On Sakshi News Paper | Sakshi
Sakshi News home page

‘సాక్షి’పై కక్ష.. అవినీతిని ప్రశ్నిస్తే తప్పుడు కేసులా?: వైఎస్సార్‌సీపీ

Published Fri, Oct 18 2024 1:40 PM | Last Updated on Fri, Oct 18 2024 2:46 PM

YSRCP Leaders Reaction On False Cases On Sakshi News Paper

సాక్షి, విజయవాడ: సాక్షి పత్రికపై చంద్రబాబు సర్కార్‌ కక్షసాధింపు చర్యలపై వైఎస్సార్‌సీపీ నేతలు మండిపడ్డారు. విజయవాడ వరదల్లో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. వరదల్లో అవినీతి చేసిన ఏకైక ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అంటూ ధ్వజమెత్తారు.

ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్‌ మాట్లాడుతూ.. పేదలకు, నష్టపోయిన వారికోసం వచ్చిన విరాళాల్లోనూ అవినీతి చేశారని.. ప్రభుత్వం అవినీతిని ప్రశ్నిస్తే వైఎస్సార్‌సీపీ, ప్రజాసంఘాలపై ఎదురుదాడి చేశారంటూ దుయ్యబట్టారు.

‘‘మీడియా స్వేచ్ఛకు కూటమి ప్రభుత్వం భంగం కలిగిస్తోంది. సాక్షి పత్రిక, ఎడిటర్‌ మురళిపై కేసులు పెట్టడం దుర్మార్గం. సాక్షి టీవీని ఆపేయాలంటూ సాక్షాత్తూ మంత్రులే పిలిచి వార్నింగ్ ఇస్తున్నారు. ప్రజాగొంతుకను నొక్కేయాలని కూటమి నేతలు చూస్తున్నారు. ఎన్ని కేసులు పెట్టినా నిరంతరం మేం ప్రజల పక్షాన పోరాడతాం. మీడియాపై పెట్టిన తప్పుడు కేసులను ఎత్తేయాలి’’ అని దేవినేని అవినాష్‌ డిమాండ్‌ చేశారు.

సాక్షిని టార్గెట్ చేయడం సరికాదు: మేయర్‌ రాయన భాగ్యలక్ష్మి
వరదల్లో అవినీతి జరిగిందని అందరికీ తెలుసు. ఎంతో కొంత అవినీతి జరగకుండా ఎలా సాధ్యమని సాక్షాత్తూ సీఎం చంద్రబాబే చెబుతున్నారు. వరదల్లో ఎంత ఖర్చుపెట్టారా లెక్కలిచ్చింది కూడా వాళ్లే. ఎన్యుమరేషన్ జరగలేదని వరద బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కలెక్టరేట్ వద్ద నిత్యం వందల్లో బాధితులు ధర్నాలు చేస్తున్నారు. పత్రికా స్వేచ్ఛ లేకుండా అణగదొక్కాలని చూస్తున్నారు. ప్రజలకు నిజం తెలియజేసే ఏకైక మీడియా సాక్షి మాత్రమే. సాక్షి మీడియాను టార్గెట్ చేయడం సరికాదు.

చంద్రబాబు నియంతృత్వానికి ఇది నిదర్శనం: మల్లాది విష్ణు 
రాష్ట్రంలో ప్రజలపక్షం , ప్రతిపక్షం ఉండకూడదని ప్రభుత్వం భావిస్తోంది. సాక్షి పత్రికపై ప్రైవేట్ వ్యక్తులతో కేసులు పెట్టించడం పత్రికా స్వేచ్ఛకు గొడ్డలిపెట్టు. ప్రభుత్వ రాక్షసత్వానికి..నియంతృత్వానికి ఇది నిదర్శనం. గత ఐదేళ్లలో వైఎస్‌ జగన్‌, వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంపై ఎల్లో మీడియాలో ఎన్నో అసత్య కథనాలు ప్రచురించారు. గతంలో ఏనాడైనా ఇలాంటి క్రిమినల్ చర్యలకు పాల్పడ్డామా?. పోలీసు స్టేషన్లలో ఫిర్యాదులు చేయించి కేసులు పెట్టించామా?. తప్పుడు ఆరోపణలపై సాక్షి పత్రిక ద్వారా వాస్తవాలను తెలియజేశాం. సాక్షి లేకపోతే ఏపీలో ప్రజలకు నిజాలు.. వాస్తవాలు తెలిసే పరిస్థితి ఉండదు

ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్నారు: వెల్లంపల్లి శ్రీనివాస్‌
కూటమి ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కక్ష సాధింపు పెరిగిపోయింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారి గొంతు నొక్కేస్తున్నారు. సాక్షి పత్రికపై కేసు పెట్టడం అమానుషం. మీ తప్పులను ఎత్తిచూపిస్తున్నందుకు ప్రైవేట్ కేసులు వేయడం సరికాదు. కేబుల్ టీవీలో సాక్షి ప్రసారాలను నిలిపివేశారు. వరదల్లో అనేక మంది నష్టపోయారు. వరద బాధితులకు అండగా నిలిచిన సాక్షిపై కేసులు పెట్టడం దుర్మార్గం. తక్షణమే సాక్షిపై పెట్టిన కేసులు ఎత్తేయాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement