అంతా.. నీవల్లే!
ఉద్యోగులు మొండిగా ఉంటే ఎలా?!
మీవల్లే ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు
ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే {పయత్నం
కేసుపై రాజీకి వచ్చేలా సీఎం ఎత్తుగడ
ఉద్యోగ సంఘాలనేతలతో చంద్రబాబు భేటీ
హైదరాబాద్: టీడీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ కృష్ణా జిల్లా ముసునూరు తహసీల్దార్ వనజాక్షిపై చేసిన దాడి వ్యవహారాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం సెటిల్ చేశారు. తహసీల్దార్ మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసి, ఆమె రాజీకి సిద్ధపడేలా కొంత బెదిరింపు ధోరణిలో మాట్లాడారు. ముఖ్యమంత్రి శనివారం తన నివాసంలో తహసీల్దార్‌తోపాటు ఉద్యోగ సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఎమ్మెల్యే చింతమనేనితోనూ ఆయన మాట్లాడినట్లు తెలిసింది. ఎమ్మెల్యే అనుచరులు దాడి నేపథ్యంలో మానసిక వేదన అనుభవిస్తున్న వనజాక్షిపై సీఎం కనీసం సానుభూతి చూపలేదు. పైగా తప్పంతా ఆమెదేనన్న భావన కలిగించేందుకు ప్రయత్నించారు. ‘‘ఉద్యోగాలు చేయాలి.. కానీ మొండిగా ఉంటే ఎలా? అది జిల్లా సరిహద్దుకు సంబంధించిన సమస్య అని ఎమ్మెల్యే చెప్పారు. ఆ విషయాన్ని ఉన్నతాధికారులకు నివేదించాలి.
ఇలాంటి సమస్య వచ్చినప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఇసుక ర్యాంప్ వద్దకు ఎవరు వెళ్లమన్నారు? మీరు వెళ్లి ట్రాక్టర్లకు అడ్డంగా కూర్చోవటం వల్లే ఎమ్మెల్యే అనుచరులు రెచ్చిపోయారు. నేరుగా స్పాట్‌కు వెళ్లి గొడవ చేస్తే ప్రభుత్వానికి వచ్చే ప్రయోజనం ఏమిటి? వెళ్లిన తర్వాతైనా.. అవతలి వాళ్లు తమదే అని గట్టిగా చెప్పినప్పుడు వెనక్కి తగ్గి ఉండాల్సింది. ట్రాక్టర్లకు అడ్డంగా కూర్చోవడం ఏమిటి? గొడవ చేయడం ఎందుకు? ఎస్‌ఐ కూడా మౌనంగా ఉండటం తప్పు. గొడవ జరుగుతుంటే సర్ది చెప్పడానికి ప్రయత్నించలేదు. తహసీల్దార్‌ను అక్కడి నుంచి తీసుకెళితే సరిపోయేది. అదీ చేయలేదు. ఈ మొత్తం వ్యవహారం వల్ల ప్రభుత్వానికి నష్టమే తప్ప లాభం లేదు’’ అని సీఎం అన్నారు.
విచారణ నివేదిక వచ్చాక అరెస్టుపై నిర్ణయం
చింతమనేనిపై చర్య తీసుకోవాలంటూ ఎలాంటి ఒత్తిడి చేయొద్దని ఉద్యోగ సంఘాల నేతలను చంద్రబాబు కోరారు. పరిస్థితులను అర్థం చేసుకొని, ఆందోళన కార్యక్రమాలను విరమించుకోవాలని చెప్పారు. తహసీల్దార్‌పై దాడి చేసిన తమ పార్టీ ఎమ్మెల్యేపై ప్రస్తుతం చర్య తీసుకోలేమని, సీనియర్ ఐఏఎస్ అధికారితో కమిటీ వేసి విచారణ చేయిస్తామని హామీ ఇచ్చారు. విచారణ నివేదిక వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అరెస్టుపై నిర్ణయం తీసుకుంటానని చెప్పారు. పుష్కరాల సమయంలో విధులు బహిష్కరిస్తామనటం సరికాదని, వెంటనే విధుల్లో చేరాలని సూచించారు.
నా ఆత్మాభిమానాన్ని దెబ్బతీశారు
దాడికి పాల్పడిన ఎమ్మెల్యేను అరెస్టు చేయాల్సిందేననే వాదనను ముసునూరు తహసీల్దార్ వనజాక్షి, ఉద్యోగ సంఘాల నాయకులు చర్చల సందర్భంగా ముఖ్యమంత్రి వద్ద గట్టిగా వినిపించారు. విధి నిర్వహణలో ఉన్న తన పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించారని, దాడి చేశారని సీఎం దృష్టికి తీసుకెళ్లారు. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడానికి, విశ్వసనీయతను పెంచడానికే తాను గట్టిగా నిలబడ్డానని, అందులో తమ స్వార్థం లేదని ఆమె వివరించారు. మహిళ అని కూడా చూడకుండా దాడులు చేయడం, తనను తీవ్రంగా అవ మానించడం.. తన ఆత్మాభిమానాన్ని దెబ్బతీశాయని గద్గద స్వరంతో చెప్పారు. విధి నిర్వహణకు ఈ విధంగా ఆటంకం కలిగిస్తే కృష్ణా జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడా రెవెన్యూ సిబ్బంది ఉద్యోగాలు చేయలేరని స్పష్టం చేశారు.
ఇకపై ఇలా జరగకుండా జాగ్రత్తలు
ఎమ్మెల్యేపై కేసు నమోదు చేయడాన్ని ప్రభుత్వం వద్దనలేదని, విచారణ తర్వాత నిజానిజాలను నిర్ధారించి అరెస్టుపై నిర్ణయం తీసుకుందామని ముఖ్యమంత్రి చె ప్పారు. ‘‘ఐఏఎస్ అధికారిని నియమించి మొత్తం వ్యవహారంలో ఎవరిది తప్పుందో తేల్చమంటాను. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ సిబ్బంది వ్యవహరించాల్సిన విధానాన్ని సిఫారసు చేసే బాధ్యతనూ ఆ అధికారికి అప్పగిస్తాను. ఇకపై ఇలాంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటా’’ అని పేర్కొన్నారు. చర్చల్లో ఏపీ రెవిన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావుతో పాటు రెవెన్యూ సంఘం కృష్ణా జిల్లా అధ్యక్షుడు కె.చంద్రశేఖరరావు, కార్యదర్శి బి.భోజరాజు, ఉపాధ్యక్షుడు అనిల్ జన్నీసన్, కృష్ణా జిల్లా ఉద్యోగుల జేఏసీ అధ్యక్షుడు విద్యాసాగర్ పాల్గొన్నారు. వనజాక్షి, ఉద్యోగ సంఘాల నేతలతో కూడిన ప్రతినిధి బృందంతో, ఎమ్మెల్యేతో వేర్వేరుగా సీఎం భేటీ అయ్యారు. సీఎం హామీ మేరకు విధుల బహిష్కరణ కార్యక్రమాన్ని వాయిదా వేశామని చర్చల అనంతరం రెవెన్యూ ఉద్యోగ సంఘాల నేతలు మీడియాకు తెలిపారు. సీఎంతో చర్చలపై విలేకరులు పలు ప్రశ్నలు వేయగా ‘కమిటీ వేశారు. విచారణ జరిపిస్తామన్నారు..’ అని వనజాక్షి బదులిస్తుండగానే ఏపీ రెవిన్యూ సంఘం అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు జోక్యం చేసుకుని మాట్లాడారు.