'తప్పు నీదే.. అక్కడికి వెళ్లడం వల్లే గొడవ'
హైదరాబాద్ : దాడి చేసిన పార్టీ ఎమ్మెల్యేపై చర్య తీసుకోవాల్సిన చంద్రబాబు నాయుడు...ఎమ్మార్వో వనజాక్షిపై ఎదురుదాడికి దిగినట్లు సమాచారం. న్యాయం జరుగుతుందని ముఖ్యమంత్రిని ముఖ్యమంత్రిని కలిసిన కృష్ణాజిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షికి మరింత అవమానం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం వ్యవహారంలో తప్పు నీదేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు - వనజాక్షితో అన్నట్టు తెలుస్తోంది.
అసలు ఘటన ఎలా జరిగింది, ఆ రోజు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా సీఎం చేయనట్టు సమాచారం. 'తహసీల్దార్ అయిఉండి ఎందుకు ఇసుక ర్యాంప్ వద్దకు వెళ్లావని, నువ్వు వెళ్లకుండా పోలీసులను పంపిస్తే సరిపోయేది కదా, నీవు అక్కడికి వెళ్లడం వల్లే గొడవ జరిగిందని వనజాక్షిపై చంద్రబాబు అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. ట్రాక్టర్లకు అడ్డుగా కూర్చొవడం వల్లే ఎమ్మెల్యే, ఆయన అనుచరులు దాడికి ప్రయత్నించి ఉంటారని చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.
ఇప్పటికిప్పుడు ఎమ్మెల్యేపైగాని, ఆయన అనుచరులపై ఎటువంటి చర్యలు ఉండవని సీఎం స్పష్టం చేసినట్టు తెలుస్తోంది. తక్షణం ఆందోళన విరమించాలని ముఖ్యమంత్రి రెవెన్యూ ఉద్యోగులపై ఒత్తిడి చేశారని, ఎమ్మార్వో వనజాక్షి, రెవెన్యూ ఉద్యోగుల సంఘాల ప్రతినిధులు చంద్రబాబుతో మాట్లాడుతున్నప్పుడు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అక్కడే ఉండటం గమనార్హం.