భూమా కేసుతో చింతమనేని కేసు పోల్చలేం: బాబు
ఢిల్లీ: తహశీల్దార్ వనజాక్షిపై దాడి విషయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు. జరిగిందేదో జరిగిపోయింది.. అసలు ఎందుకు జరిగిందో తెలుసుకుంటానని ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియా ప్రతినిధులతో అన్నారు. ఇప్పటికే తాను వనజాక్షితో, ఉద్యోగ సంఘాలతో మాట్లాడానని, చట్టప్రకారం చర్యలు ఉంటాయని తెలిపారు. అయితే, భూమా నాగిరెడ్డి కేసుతో చింతమనేని ప్రభాకర్ కేసును పోల్చలేమని ఆయన అన్నారు.
మరోపక్క, ఉమ్మడి రాజధాని హైదరాబాద్లో సెక్షన్ 8పై హోంమంత్రి రాజ్నాథ్ సింగ్తో మాట్లాడినట్లు తెలిపారు. విభజన చట్టంలో అంశాలు అమలు చేయాల్సిన బాధ్యత హోమంత్రిదేనని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మొన్నటి వరకు విద్యుత్ సమస్యలపై తెలంగాణప్రభుత్వం విమర్శించిందని, ఇప్పుడు పాలమూరు ప్రాజెక్టుపై తమను విమర్శిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం తనకు లేదని, సముద్రంలోకి వృథాగా పోయే నీటికోసమే పట్టిసీమ ప్రాజెక్టు కడుతున్నామని ఆయన అన్నారు. పాలమూరు ప్రాజెక్టుపై ఏకపక్షంగా ఉండేది లేదని, ఇరు రాష్ట్రాలు దీనిపై చర్చించాల్సిందేనని చెప్పారు.