శాంతిభద్రతల విఘాతానికి చంద్రబాబు పన్నాగం
తిరుమల–తిరుపతిలో మోహరించిన కూటమి గూండాలు
రాళ్లు, కర్రలు, సోడా బుడ్డీలతో మాటు
గ్రేటర్ రాయలసీమ జిల్లాల్లోనూ పోలీసు నిర్బంధం.. అనధికార ఎమర్జెన్సీ
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత హోదాలో.. సీఎం హోదాలో అనేకసార్లు తిరుమల శ్రీవారిని దర్శించుకుని తన భక్తిప్రపత్తులను పరిపరి విధాలుగా చాటుకున్న వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తాజా తిరుమల పర్యటనను అడ్డుకునేందుకు చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం భారీ కుట్రపన్నింది.
సీఎం హోదాల్లో మహానేత వైఎస్, ఆయన తనయుడు జగన్ ఐదేసి ఏళ్లపాటు శ్రీవారికి పట్టువస్త్రాలు సమర్పించినా ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కారు తన కూటమి గూండాలను రంగంలోకి దింపి శాంతిభద్రతల సమస్య సృష్టించేందుకూ బరితెగించింది.
ఇందుకోసం ఎమర్జెన్సీని తలపించేలా యావత్ గ్రేటర్ రాయలసీమలో పోలీసు నిర్బంధాన్ని అమలుచేసింది. దీంతో.. సీఎం చంద్రబాబే స్వయంగా తిరుమల–తిరుపతి కేంద్రంగా శాంతిభద్రతలకు విఘాతం కల్పించేందుకు కుట్ర పన్నడం యావత్ దేశాన్ని విభ్రాంతికి గురిచేసింది.
చంద్రబాబు బెంబేలు..
తిరుమల లడ్డూ ప్రాశస్త్యాన్ని దెబ్బతీసేలా చంద్రబాబు వ్యవహరించిన తీరుకు నిరసనగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాల్లో పూజలు చేయాలని ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సంకల్పించింది. అందులో భాగంగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల శ్రీవారిని దర్శించుకుని పూజలు చేస్తానని ప్రకటించడంతో చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి.
లడ్డూ ప్రసాదంపై దుష్ప్రచారానికి ఆధారాలు చూపించలేకపోవడంతో ఇప్పటికే టీడీపీ ప్రభుత్వ కుట్ర జాతీయస్థాయిలో బట్టబయలైంది. ఈ నేపథ్యంలో.. జగన్ తిరుమల పర్యటన కూడా విజయవంతమైతే తాను మరింత సంకటస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుందని బాబు బెంబేలెత్తిపోయారు. అందుకే ఏకంగా ఆయన పర్యటననే అడ్డుకునేందుకు కుతంత్రం పన్నారు.
పోలీసు నిర్బంధం.. అనధికార ఎమర్జెన్సీ..
ఇందులో భాగంగా చంద్రబాబు పోలీసు అస్త్రాన్ని ప్రయోగించారు. వేలాదిమంది పోలీసులతో తిరుమల–తిరుపతిని దిగ్బంధించారు. రేణిగుంట విమానాశ్రయం నుంచి తిరుమల వరకు అన్ని మార్గాల్లోనూ ఆంక్షలు విధించి పోలీసు నిర్బంధం కొనసాగించారు. వాహనాల్లో వచ్చే భక్తులను తనిఖీల పేరుతో వేధించారు.
ఇక తిరుపతి జిల్లాతోపాటు వైఎస్సార్, అన్నమయ్య, కర్నూలు, అనంతపురం, ఎస్పీఎస్‌ఆర్ నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను గృహ నిర్బంధంలో ఉంచారు. ప్రధానంగా ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు గడప దాటకుండా కట్టుదిట్టం చేశారు.
‘వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తిరుమల పర్యటనకు అనుమతిలేదు. మీరు కూడా ఆ పర్యటనలో పాల్గొనేందుకు ప్రయత్నిస్తే అరెస్టుచేస్తాం’ అని వైఎస్సార్‌సీపీ నేతల ఇళ్లకు వెళ్లి నోటీసులిచ్చి భయభ్రాంతులకు గురిచేశారు.
జగన్‌పై దాడికి పక్కా స్కెచ్..
ఓ వైపు పోలీసు నిర్బంధాన్ని ఇలా కొనసాగిస్తూనే మరోవైపు చంద్రబాబు ప్రభుత్వం భారీ కుట్రకు సిద్ధపడింది. వైఎస్ జగన్ తిరుమల పర్యటనకొస్తే ఆయనపై దాడి చేసేందుకు పక్కా స్కెచ్ వేసింది. తన వెంట నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో లేకుండా జగన్ వస్తే భక్తుల ముసుగులో టీడీపీ గుండాలు ఆయన్ను అడ్డుకోడానికి ప్రయత్నించాలనేది కుట్ర.
ఇందుకోసం పక్క రాష్ట్రాల నుంచి బీజేపీ నాయకులను కూడా రప్పించారు. తద్వారా శాంతిభద్రతల సమస్య సృష్టించి ఆ ముసుగులో రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలపై పెను దాడులు చేసేందుకు సిద్ధపడింది. అందుకు టీడీపీ, జనసేన, బీజేపీ గుండాలు రేణిగుంట విమానాశ్రయం–తిరుమల మార్గంలో రాళ్లు, కర్రలు, సోడా బుడ్డీల గుట్టలుగా పోగేసి మాటేశారు.
Comments
Please login to add a commentAdd a comment