రుణ సదుపాయంతో దూసుకెళ్తున్న మొబైల్ పోన్ల విక్రయాలు
రాష్ట్రంలో నెలకు సగటున 60 వేల ఫోన్లకు పైగా అమ్మకం
ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థల నుంచి ఇబ్బడిముబ్బడిగా రుణాలు
రుణాల ద్వారానే 7 లక్షలకు పైగా కొనుగోళ్లు
ఏటా రూ.వెయ్యి కోట్లకు పైగానే మొబైల్ ఫోన్లపై రుణాలిస్తున్న వైనం
క్రెడిట్ కార్డులు, నగదు ద్వారా తీసుకునే ఫోన్లు వీటికి అదనం
ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఆర్బీఐకి ఇచ్చిన రుణ వ్యయ పరిమితి నివేదికలో వెల్లడి
వాయిదా పద్ధతుల్లో కొనుగోలు చేస్తున్న వస్తువుల్లో ఇన్నాళ్లూ టీవీలు, రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషిన్లదే అగ్రస్థానం. ఇప్పుడు వాటిని వెనక్కి నెట్టేసి మొబైల్ ఫోన్లు దూసుకెళుతున్నాయి. ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థలు ఇబ్బడిముబ్బడిగా రుణసదుపాయం కల్పిస్తుండటంతో గ్రామీణ ప్రాంతాల వారు సైతం ఈఎంఐ (ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్) పద్ధతిలో ఫోన్లు కొనుక్కోవడం రివాజుగా మారింది.
గతంలో రుణం కావాలంటే బ్యాంకులకు వెళ్లి స్థిర, చరాస్తుల తనఖా వంటివి చేస్తేగానీ వచ్చేది కాదు. ఇప్పుడు అలాంటివేమీ లేకుండా 15 నిమిషాల్లోనే రుణం ఇవ్వడం, ఫోన్ కొనుక్కోవడం అన్నీ జరిగిపోతున్నాయి. ఈ వ్యాపారం రాష్ట్రంలో ఇప్పుడు ఏటా వందల కోట్ల రూపాయలకు చేరినట్టు ప్రైవేట్ రుణ సంస్థలు తాజాగా ఆర్‌బీఐకి ఇచ్చిన రుణ వ్యయ పరిమితి నివేదికలో వెల్లడించాయి. – సాక్షి ప్రతినిధి, అనంతపురం
ఏటా 7 లక్షలకు పైగా ఫోన్లు రుణ సదుపాయంతోనే..
రాష్ట్రవ్యాప్తంగా క్యాష్, క్రెడిట్ కార్డు ద్వారా కాకుండా కేవలం రుణ సదుపాయంతో కొనుగోలు చేస్తున్న మొబైల్ ఫోన్లు నెలకు సగటున 60 వేలకు పైగా ఉన్నట్టు తేలింది. ఏటా 7 లక్షలకు పైగా ఫోన్లు ఈఎంఐ సదుపాయంపై విక్రయాలు జరుగుతున్నాయన్న మాట.
ఇలా రుణ సదుసాయం కల్పిస్తున్న వాటిలో బజాజ్ ఫైనాన్స్, హెచ్‌డీఎఫ్‌సీ, టీవీఎస్, హెచ్‌బీ తదితర సంస్థలు అగ్రభాగాన నిలిచాయి. ఏపీలో నెలకు రూ.90 కోట్ల వరకూ మొబైల్ ఫోన్లకు రుణ సదుపాయం కల్పిస్తున్నట్టు తేలింది. మొబైల్ కొనుగోళ్లలో 55 శాతం వాటాను గ్రామీణ ప్రాంతాలే కలిగి ఉన్నట్టు ప్రైవేట్ ఫైనాన్స్ సంస్థ ప్రతినిధి ఒకరు చెప్పారు.
సిబిల్ స్కోరు ఆధారంగా..
పాన్‌కార్డు, ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా ఉంటే చాలు సులభంగా రుణాలు మంజూరు చేస్తున్నారు. ప్రధానంగా సిబిల్ (క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో) స్కోర్ ఆధారంగా రుణాలిస్తున్నారు. స్కోర్ 730 పాయింట్లకు తగ్గకుండా ఉంటే రుణానికి అర్హులు. గతంలో ఏదైనా వస్తువు తీసుకుని క్రమం తప్పకుండా వాయిదాలు కట్టిన వారికి తర్వాత రెట్టింపు రుణ సదుపాయం కల్పిస్తున్నారు.
దీనిని అదునుగా చేసుకుంటున్న వినియోగదారులు ఖరీదైన మొబైల్ ఫోన్లను కొనుగోలు చేస్తున్నారు. ఏ పల్లెలో చూసినా ఆండ్రాయిడ్ 4జి, 5జి మొబైల్ ఫోన్లు దర్శనమిస్తున్నాయి. ఇలా ఈఎంఐ సదుపాయంపై మొబైల్ ఫోన్ల కొనుగోలు చేయడం వేలాది కుటుంబాల ఆర్థిక స్థితిగతులపైనా తీవ్ర ప్రభావం చూపుతున్నట్టు నిపుణులు భావిస్తున్నారు.
రికవరీ మామూలుగా ఉండదు మరి
జీరో వడ్డీ పేరుతో చాలామంది వినియోగదారులు ఈఎంఐ విధానంలో ఫోన్లు కొనుగోలు చేసి ఇరుక్కుంటున్నారు. కానీ.. అలాంటివేమీ ఉండవు. ప్రాసెసింగ్ ఫీజులు, ఇతరత్రా కలిపి రూ.1,500 వరకూ వినియోగదారులపై భారం పడుతుంది. పైగా.. ఫైనాన్స్‌లో కొంటున్నారంటే డిస్కౌంట్లు తక్కువ. ఎంఆర్‌పీకే కొనాల్సి ఉంటుంది.
రికవరీ సైతం అలాగే ఉంటుంది. రుణ సదుపాయంపై ఫోన్ కొనుగోలు చేసిన వారి ఖాతా నుంచి ఫైనాన్స్ సంస్థకు ఆటో డెబిట్ ద్వారా సొమ్ము వెళుతుంది. ఈఎంఐ తేదీ నాటికి చెల్లించాల్సిన సొమ్ము కంటే బ్యాంకులో రూ.10 తక్కువ బ్యాలెన్స్ ఉన్నా రూ.500 నుంచి రూ.800 వరకూ ఫైన్ పడుతుంది.
రెండు నెలలు సరిగా ఈఎంఐ చెల్లించకపోతే రికవరీ ఏజెంట్లు వెంటనే కొనుగోలుదారు ఇంటికి వెళతారు. ఫైనాన్స్ పైన తీసుకున్న మొబైల్ ఫోన్‌కు సంబంధించి అప్పు చెల్లించకపోతే ఐఎంఈఐ నంబర్‌ను బ్లాక్ చేసి ఫోన్ పనిచేయకుండా చేసే సదుపాయం ఫైనాన్స్ సంస్థ చేతిలో ఉంటుంది.
రాష్ట్రంలో ఫోన్లపై రుణాల లెక్క ఇదీ
రాష్ట్రంలో నెలకు రుణాల ద్వారా కొంటున్న ఫోన్ల సంఖ్య60,000
గరిష్ట ఫోన్ విలువ రూ.1,20,000
రుణ సదుపాయంపై నెలకు ఫోన్ల కొనుగోళ్ల విలువరూ.90 కోట్లుఈఎంఐ కాలపరిమితి 10–20 నెలలు
ఈఎంఐ ద్వారా తీసుకునే కనిష్ట ఫోన్ విలువ రూ.12,500
Comments
Please login to add a commentAdd a comment