
మీడియాతో మాట్లాడుతున్న వెలంపల్లి, కేశినేని
ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే దాడులు
కుట్రలు, కుతంత్రాలు పన్నినా జగన్‌ను ఎదుర్కొనటం సాధ్యం కాదు
జగన్‌కు భద్రత పెంచాలి
ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి
సాక్షి, అమరావతి/గన్నవరం/కంకిపాడు: సీఎం జగన్‌పై జరిగిన దాడి ముమ్మాటికీ చంద్రబాబు, ఆయన మిత్రపక్షాల కుట్రేనని విజయవాడ ఎంపీ కేశినేని నాని, ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు ఆరోపించారు. విజయవాడ చేరుకున్న మేమంతా సిద్ధం బస్సుయాత్రలో సీఎం జగన్‌మోహన్‌రెడ్డిపై దాడిచేయటాన్ని తీవ్రంగా ఖండించారు. జగన్ ప్రాణాలే లక్ష్యంగా కూటమి దాడికి తెగపడిందని, దీనిపై ఎన్నికల సంఘం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం జగన్‌కు భద్రత లేకుండా పోయిందన్నారు. ఆయన ప్రాణాలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.
కేసరపల్లి బస ప్రాంగణం వద్ద శనివారం రాత్రి వారు విలేకరులతో మాట్లాడారు. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమిగా కలిసినప్పటికీ జగన్‌కు ప్రజల్లో లభిస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకపోతున్నాయని విమర్శించారు. చంద్రబాబే తన తొత్తులతో జగన్‌పై దాడి చేయించారని ఆరోపించారు. కరెంటు లేని ప్రాంతాన్ని ఎంచుకుని జగన్‌పై దాడిచేసి, ఆయన ప్రాణాలు తీయాలనుకున్నారని మండిపడ్డారు. వారు ఎన్ని హామీలిచి్చనా ప్రజలు వారివెంట లేరని తెలిసి జగన్‌ను ఏదో విధంగా అంతమొందించలనే కుట్ర పన్ని ఆయనపై హత్యాయత్నం చేశారన్నారు. సీఎం జగన్‌కు చాలా పెద్ద దెబ్బ తగిలిందని, బ్లడ్ కారిందని, పక్కనే ఉన్న తన కంటికి కూడా గాయమైందని వెలంపల్లి చెప్పారు.
ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వెలంపల్లి
ఇది కచ్చితంగా హత్యాయత్నమేనని, ఆ వస్తువు తాలూకు పదును, వేగం చూస్తే ఇదే అర్థమవుతోందని తెలిపారు. సీఎం జగన్‌కు తగిలాక.. పక్కనున్న తనకు అదే వస్తువు తగిలిందని, తనకు కూడా గాయమైందంటేనే దాని వేగాన్ని అర్థం చేసుకోవచ్చని చెప్పారు. చంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా గాయాన్ని తట్టుకుని జగన్ చిరునవ్వుతో ప్రజలకు నేనున్నా అనే భరోసా కల్పించారని చెప్పారు. జగన్‌లాంటి గొప్పవ్యక్తి రక్తం కళ్లజూసిన చంద్రబాబుకు పుట్టగతులుండవన్నారు. ఇప్పటివరకు పదికిపైగా సర్వేలు వచ్చాయని, జగన్ ఈ ఎన్నికల్లో స్వీప్ చేయబోతున్నారని చెబున్నాయని, దీంతో చంద్రబాబు ఈ కుట్రకు తెరలేపారని చెప్పారు.
చంద్రబాబు నీచపు, వెన్నుపోటు, దుర్మార్గపు రాజకీయాలకు తెరతీశారని, గతంలోను విజయవాడలో అనేక కుట్రలు, కుతంత్రాలు చేశారని చెప్పారు. వంగవీటి రంగా హత్య ఘటనలో చంద్రబాబు పాత్ర ఉందని ఆరోపించారు. జగన్‌పై జరిగిన దాడిలో చంద్రబాబు, కూటమి మూల్యం చెల్లించుకోకతప్పదని హెచ్చరించారు. పోలీసులు వెంటనే సమగ్ర దర్యాప్తు జరిపి నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.
కేంద్రానికి, ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
ఇది ప్రతిపక్షాల కుట్ర కోణంగానే భావిస్తున్నట్లు ఎంపీ కేశినేని నాని చెప్పారు. ఇది చాలా తీవ్ర పరిణామమన్నారు. ఈ సంఘటనపై పోలీసులు విచారించాలని, ఎన్నికల కమిషన్ కూడా స్పందించి దీనిపై నిజాలను నిగ్గుతేల్చాలని కోరారు. ఈ దుశ్చర్యకు పాల్పడినవారిని పోలీసులు అరెస్ట్ చేసి ఎవరు చేయించారో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ దుర్ఘటనపై ఢిల్లీలో కూడా ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తామని, సీఎం జగన్‌కు సరైన సెక్యూరిటీ కూడా ఇవ్వాలని కేంద్రం దృష్టికి తీసుకెళతామని చెప్పారు.
జగన్‌కు వస్తున్న ప్రజాదరణను తట్టుకోలేకపోతున్నారని, ముఖ్యంగా విజయవాడలో ఈ తీరు విపరీతంగా ఉందని తెలిపారు. ఈ పరిస్థితుల్లో సీఎం భద్రత పెంచాలని కోరారు. గాయం చాలా లోతుగా అయిందని, నొప్పికి సీఎం జగన్ విలవిల్లాడారని, అయినా యాత్రను కొనసాగించారని చెప్పారు. సీఎం జగన్‌కు ఆ వస్తువు తగిలే సమయంలో ‘టప్’మనే శబ్దాన్ని తాను స్పష్టంగా విన్నానని, అది రాయి కాకపోవచ్చని పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment