
వైఎస్సార్‌సీపీ రాజ్యసభా పక్ష నేత వి.విజయసాయిరెడ్డి
సాక్షి, అమరావతి : రాజకీయాల నుంచి తాను తప్పుకుంటున్నానని వైఎస్సార్‌సీపీ రాజ్యసభా పక్ష నేత వి.విజయసాయిరెడ్డి స్పష్టం చేశారు. రాజ్యసభ సభ్యత్వానికి శనివారం రాజీనామా చేస్తున్నానని ప్రకటించారు. తాను ఏ రాజకీయ పార్టీలోనూ చేరడం లేదని.. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేయడం లేదన్నారు. ఈ నిర్ణయం పూర్తిగా తన వ్యక్తి గతమని, ఎలాంటి ఒత్తిళ్లు లేవని.. ఎవరూ ప్రభావితం చేయలేదని తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పోస్ట్ చేశారు.
‘నాలుగు దశాబ్దాలుగా, మూడు తరాలుగా నన్ను నమ్మి ఆదరించిన వైఎస్ కుటుంబానికి రుణపడి ఉన్నాను. రెండుసార్లు రాజ్యసభ సభ్యుడిగా అవకాశం ఇచ్చిన వైఎస్ జగన్‌కు, నన్ను ఇంతటి ఉన్నత స్థాయికి తీసుకెళ్లిన భారతమ్మకు సదా కృతజ్ఞుడిని. జగన్‌కు మంచి జరగాలని కోరుకుంటున్నా. పార్టీ ప్రయోజనాల కోసం చిత్తశుద్ధితో శక్తివంచన లేకుండా కృషి చేశా. కేంద్రానికి, రాష్ట్రానికి మధ్య వారధిలా పనిచేశా. దాదాపు తొమ్మిది సంవత్సరాలు ప్రోత్సహించి కొండంత బలాన్ని, మనో ధైర్యాన్నిచ్చి తెలుగు రాష్ట్రాల్లో నాకు గుర్తింపునిచ్చిన ప్రధాని మోదీకి, హోం మంత్రి అమిత్ షాకు ప్రత్యేక ధన్యవాదాలు.
టీడీపీతో రాజకీయంగా విభేదించా. చంద్రబాబు కుటుంబంతో నాకు వ్యక్తిగతంగా విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్‌తో చిరకాల స్నేహం ఉంది. నా భవిష్యత్తు వ్యవసాయం. సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఆదరించిన నా రాష్ట్ర ప్రజలకు, మిత్రులకు, సహచరులకు, పార్టీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికీ పేరు పేరునా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నా’ అని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు.
పార్టీ శ్రేణుల విస్మయం..
వైఎస్సార్‌సీపీ రాజ్యసభ పక్ష నేత వి.విజయ సాయిరెడ్డి రాజకీయాల నుంచి తప్పుకుంటున్నానని, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తానని ప్రకటించడం బాధాకరమని పార్టీ శ్రేణులు పేర్కొంటున్నాయి. తాను ప్రలోభాలకు లొంగలేదని సాయిరెడ్డి పేర్కొన్నప్పటికీ... వైఎస్సార్‌సీపీ బలంతో గెలిచి ఇంకా మూడున్నరేళ్లు పదవీకాలం ఉండగానే రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం పరోక్షంగా కూటమి పార్టీలకు లబ్ధి చేకూరుస్తుంది కదా? అని ప్రశ్నిస్తున్నారు.

ఎందుకంటే... ఆయన రాజీనామా చేసిన స్థానంలో మళ్లీ పోటీ చేసి గెలిచేంత సంఖ్యా బలం ప్రస్తుతం వైఎస్సార్‌సీపీకి లేదు. అంటే దీని అర్థం.. బీజేపీ, టీడీపీలకు చెందిన వారు ఎంపీలుగా ఎన్నికయ్యేందుకు ఈ చర్య పరోక్షంగా ఉపకరిస్తుందని విశ్లేషిస్తున్నారు. అధికారం కోల్పోయి కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీ గొంతుకను మరింత బలంగా వినిపిస్తూ ప్రజల తరఫున పోరాడాల్సిన తరుణంలో ఇలా రాజకీయాల నుంచి తప్పుకోనున్నట్లు ప్రకటించడం.. రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని విజయసాయిరెడ్డి నిర్ణయించుకోవటాన్ని వైఎస్సార్‌సీపీ శ్రేణులు తప్పుబడుతున్నాయి.
రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను.
రాజ్యసభ సభ్యత్వానికి రేపు 25వ తారీఖున రాజీనామా చేస్తున్నాను.
ఏ రాజకీయపార్టీ లోను చేరడంలేదు. వేరే పదవులో, ప్రయోజనాలో లేక డబ్బులో ఆశించి రాజీనామా చేరడంలేదు.
ఈ నిర్ణయం పూర్తిగా నా వ్యక్తి గతం. ఎలాంటి ఒత్తిళ్లు లేవు. ఎవరూ ప్రభావితం చెయ్యలేదు.…— Vijayasai Reddy V (@VSReddy_MP) January 24, 2025
Comments
Please login to add a commentAdd a comment