2025–26లో కొత్త కాలేజీల కోసం ఎన్‌ఎంసీకి దరఖాస్తు చేయడం లేదని కూటమి సర్కారు వెల్లడి
నూతన కాలేజీలను ప్రైవేట్ పరం చేసేందుకు సన్నద్ధం
ఇప్పటికే 700 ఎంబీబీఎస్ సీట్లు కోల్పోయిన విద్యార్థులు
ఈసారైనా కొత్త కాలేజీలు వస్తాయనే ఆశతో లాంగ్‌టర్మ్ శిక్షణతో సిద్ధం
రెండేళ్లలో ఏకంగా 2,450 సీట్లు నష్టపోతున్న వైనం
సాక్షి, అమరావతి: రెండేళ్లలో ఏకంగా 2,450 ఎంబీబీఎస్ సీట్లు..! కూటమి సర్కారు కక్షపూరిత విధా నాలతో మన రాష్ట్రం నష్టపోతున్న వైద్య సీట్ల సంఖ్య ఇదీ! ఎన్‌ఎంసీని ఒప్పించి ఒక్కో మెడికల్ సీటు సాధించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు విశ్వ ప్రయత్నాలు చేస్తుంటాయి. అలాంటిది.. ఇచ్చిన సీట్లను సైతం కాలదన్నే సర్కారును ఏమనాలి? సీఎం చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాలు మన విద్యార్థుల వైద్య విద్య కలలను ఛిద్రం చేస్తున్నాయి.
ఇప్ప టికే దాదాపుగా సిద్ధమైన నూతన ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు సిద్ధమైన కూటమి సర్కారు ‘పీపీపీ’ పాట పాడుతూ మన విద్యార్థులకు తీరని ద్రోహం తలపెడుతోంది. కూటమి ప్రభుత్వం నిర్వాకాలతో ఈ విద్యా సంవత్సరంలో అదనంగా సమకూ రాల్సిన 700 ఎంబీబీఎస్ సీట్లను మన రాష్ట్రం కోల్పోయింది. దీంతో నీట్ యూజీలో ఉత్తమ స్కోర్ చేసినప్పటికీ సీటు దక్కక బీసీ, ఎస్సీ విద్యా ర్థులు తీవ్రంగా నష్టపోయారు.
2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి కొత్త వైద్య కళాశాలల కోసం నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ)కి దరఖాస్తు చేయడం లేదని ఇప్పటికే ప్రకటించింది. నూతన వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్‌కు అప్పగించడం కోసం ట్రాన్సాక్షన్ అడ్వైజర్‌ను నియ మించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. కూట మి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కళాశాలల నిర్మాణాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఆ నిర్మాణాలు దెబ్బ తినకుండా సేఫ్‌గా క్లోజ్ చేసేందుకు రూ.100 కోట్ల వ్యయం అవుతుందని అంచనా .
700 సీట్లకు మోకాలడ్డు..
పేదలకు చేరువలో ఉచితంగా సూపర్ స్పెషాలిటీ వైద్యంతోపాటు మన విద్యార్థులకు వైద్య విద్య అవకాశాలను పెంపొందించే లక్ష్యంతో మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
వీటిలో ఐదు వైద్య కళాశాలలు వైఎస్సార్ సీపీ హయాంలోనే 2023–24లో ప్రారంభం కాగా 750 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాయి. ప్రస్తుత విద్యా సంవత్సరంలో మరో ఐదు మెడికల్ కాలేజీలను ప్రారంభించి 750 సీట్లు సమకూరాల్సి ఉండగా చంద్రబాబు సర్కారు నిర్వాకాలతో కేవలం 50 సీట్లతో ఒక కళాశాల మాత్రమే అందుబాటులోకి వచ్చింది.
పులివెందుల మెడికల్ కాలేజీకి 50 ఎంబీబీఎస్ సీట్లను ఎన్‌ఎంసీ మంజూరు చేసినప్పటికీ కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా లేఖ రాసి అనుమతులు రద్దు చేయించింది. దీంతో ఈ విద్యా సంవత్సరం 700 ఎంబీబీఎస్ సీట్లను రాష్ట్రం కోల్పోయింది.
నీట్‌లో మంచి స్కోర్ సాధించినా
వైద్య విద్యలో ఏటా పెరుగుతున్న పోటీకి అనుగుణంగా రాష్ట్రంలో సీట్లు పెరగలేదు. దీంతో ఈ విద్యా సంవత్సరం నీట్‌లో 600 వరకూ స్కోర్ చేసినప్పటికీ ఓసీ విద్యార్థులు, 500 పైబడి మార్కులు సాధించినా బీసీ, ఎస్సీ విద్యార్థులు మెడిసిన్ చదివే అవకాశం లభించక అన్యాయానికి గురయ్యారు.
ఈ నేపథ్యంలో 2025–26లో అయినా కొత్త మెడికల్ కళాశాలలు ప్రారంభమైతే సీట్లు పెరుగుతాయని ఆశలు పెట్టుకుని ప్రత్యామ్నాయ కోర్సుల్లో చేరకుండా చాలా మంది విద్యార్థులు నీట్–2025కు సన్నద్ధం అవుతున్నారు.
కానీ కూటమి ప్రభుత్వం కొత్త వైద్య కళాశాలలు ప్రారంభించేలా చర్యలు తీసుకోకుండా ఇప్పటికే దాదాపుగా సిద్ధమైన వాటిని సైతం ప్రైవేట్ పరం చేసేలా అడుగులు వేయటాన్ని విద్యా రంగ నిపుణులు తీవ్రంగా తప్పుబడుతున్నారు.
మరో ఏడు కాలేజీల్లో
మరోవైపు ముందస్తు ప్రణాళిక ప్రకారం 2025–26 విద్యా సంవత్సరంలో పిడుగురాళ్ల, బాపట్ల, పార్వతీపురం, నర్సీపట్నం, పెనుకొండ, పాలకొల్లు, అమలాపురంలో నూతన వైద్య కళాశాలలు ప్రారంభమై వీటి ద్వారా మరో 1,050 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూరాల్సి ఉంది.
వీటితో పాటు ఈ ఏడాది నిలిచిపోయిన మిగిలిన నాలుగు మెడికల్ కళాశాలలు, పాడేరులో సీట్లు పెంపునకు ప్రభుత్వం చర్యలు తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించింది. దీంతో 2024–25లో 700 ఎంబీబీఎస్ సీట్లు, 2025–26లో ఏకంగా 1,750 సీట్లు చొప్పున మొత్తంగా రెండేళ్లలో మొత్తం 2,450 సీట్లను మన విద్యార్థులు కోల్పోనున్నారు.
ఏడు నెలల్లో అస్తవ్యస్థం..
వైద్య కళాశాలల్లో సౌకర్యాలు లేకుంటే వాటిని కల్పించేందుకు ప్రభుత్వం కృషి చేయాలి. అదనపు బడ్జెట్ కేటా యించి ఎంబీబీఎస్ సీట్లు రాబట్టేలా చర్యలు తీసుకోవాలి. అలాకాకుండా వచ్చిన సీట్లు సైతం వద్దంటూ చంద్రబాబు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరించింది. విజనరీ అని చెప్పుకునే నాయకుడు భవిష్యత్తు తరాలకు ఏం కావాలో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి.
అలా కాకుండా పీపీపీ అంటూ పేద, మధ్య తరగతి పిల్లలకు తీవ్ర అన్యాయం తలపెడుతున్నారు. పీజీ ఫీజులపై స్పష్టత లేకుండా కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. సీట్ లభించి కళాశాలల్లో చేరిన వారిని ఎంత ఫీజు కట్టాలోననే ఆందోళన వెంటాడుతోంది. ఏడు నెలల పాలనలో రాష్ట్రంలో వైద్య విద్యను అస్తవ్యస్థంగా మార్చారు. – ఈశ్వరయ్య, పేరెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment