తనకు నచ్చని అధికారులపై అనుచరవర్గంలోని మహిళలు, దళితులను ఉసిగొల్పి తప్పుడు కేసులు పెట్టించడం.. వంటి వాటితో ఐదారేళ్లుగా దందా చేస్తున్న...
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తనకు నచ్చని అధికారులపై అనుచరవర్గంలోని మహిళలు, దళితులను ఉసిగొల్పి తప్పుడు కేసులు పెట్టించడం.. వంటి వాటితో ఐదారేళ్లుగా దందా చేస్తున్న దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ గురువారం మరోసారి అదే చీప్ ట్రిక్‌ను ప్రయోగించారు. కృష్ణాజిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై బుధవారం చింతమనేని, ఆయన అనుచరుల దాడిని నిరసిస్తూ రాష్ర్టవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు రోడ్డెక్కారు. దీంతో చింతమనేని మరోసారి తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు.
ముసునూరు ఇసుక ర్యాంపు వద్ద తహశీల్దార్ వనజాక్షి తమపై దాడి చేశారని, కులం పేరుతో దుర్భాషలాడారని విజయరాయి ఇసుక సొసైటీ సభ్యులైన మీసాల కుమారి, సేసం నాగలక్ష్మిలతో పెదవేగి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయించారు. ఇసుక సొసైటీ సభ్యులపై దాడి చేసిన తహశీల్దార్‌ను వెంటనే అరెస్ట్ చేసి విధుల నుంచి తొలగించాలని గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అనుచరులు భారీఎత్తున ధర్నా చేపట్టారు. అనంతరం ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు వినతిపత్రం సమర్పించారు. చింతమనేని ఏలూరు రేంజి డీఐజీ హరికుమార్‌తో భేటీ అయ్యారు.