గాంధీనగర్: గుజరాత్ నవ్‌సారీ జిల్లా ఖేర్గాంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే అనంత్ పటేల్‌పై దాడి జరగడం తీవ్ర ఉద్రిక్తతలకు దారి తీసింది. ఘటన అనంతరం ఎమ్మెల్యేకు మద్దతుగా వేల మంది తరలివచ్చారు. దాడిని నిరసిస్తూ ఆగ్రహంతో అక్కడున్న ఓ దుకాణానికి నిప్పు పెట్టారు. మంటలార్పేందుకు వచ్చిన ఫైరింజన్‌ను కూడా తగలబెట్టారు. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన రాజకీయంగా తీవ్ర దుమారం రేపింది.
జిల్లా పంచాయతీ చీఫ్ అతని అనచరులే తనపై దాడి చేశారని ఎమ్మెల్యే అనంత్ పటేల్ వెల్లడించారు. ఖేర్గాంకు ఓ సమావేశం కోసం వచ్చిన తన కారును ధ్వంసం చేసి ఆపై కొట్టారని ఆరోపించారు. ఆదివాసీ అయి ఉండి నాయకుడివి అవుతావా? నిన్ను ఇక్కడ అడుగు పెట్టనివ్వం అని జిల్లా పంచాయతీ చీఫ్ తనతో దుర్భాషలాడారని ఎమ్మెల్యే తెలిపారు. వాళ్లను అరెస్టు చేసేవరకు ఆందోళన విరమించమని స్పష్టం చేశారు.
అంతేకాదు తనపై దాడికి పాల్పడిన వారిని అరెస్టు చేయకపోతే 14 జిల్లాల్లోని హైవేలను దిగ్భందిస్తామని అనంత్ పటేల్ హెచ్చరించారు. బీజేపీ పాలనలో ఎవరైనా గళమెత్తితే ఇలానే దాడులు చేస్తున్నారని, లేదంటే జైలుకు పంపిస్తున్నారని విమర్శించారు.
చదవండి: కాంగ్రెస్ ఎమ్మెల్యే మృతి.. సీఎం దిగ్భ్రాంతి
Comments
Please login to add a commentAdd a comment