government whip chintamaneni prabhakar
-
మళ్లీ అదే చీప్ ట్రిక్...ఎమ్మెల్యే హల్చల్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: తనకు నచ్చని అధికారులపై అనుచరవర్గంలోని మహిళలు, దళితులను ఉసిగొల్పి తప్పుడు కేసులు పెట్టించడం.. వంటి వాటితో ఐదారేళ్లుగా దందా చేస్తున్న దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ గురువారం మరోసారి అదే చీప్ ట్రిక్‌ను ప్రయోగించారు. కృష్ణాజిల్లా ముసునూరు తహశీల్దార్ వనజాక్షిపై బుధవారం చింతమనేని, ఆయన అనుచరుల దాడిని నిరసిస్తూ రాష్ర్టవ్యాప్తంగా రెవెన్యూ ఉద్యోగులు రోడ్డెక్కారు. దీంతో చింతమనేని మరోసారి తనదైన శైలిలో ఎదురుదాడికి దిగారు. ముసునూరు ఇసుక ర్యాంపు వద్ద తహశీల్దార్ వనజాక్షి తమపై దాడి చేశారని, కులం పేరుతో దుర్భాషలాడారని విజయరాయి ఇసుక సొసైటీ సభ్యులైన మీసాల కుమారి, సేసం నాగలక్ష్మిలతో పెదవేగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయించారు. ఇసుక సొసైటీ సభ్యులపై దాడి చేసిన తహశీల్దార్‌ను వెంటనే అరెస్ట్ చేసి విధుల నుంచి తొలగించాలని గురువారం ఉదయం కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే అనుచరులు భారీఎత్తున ధర్నా చేపట్టారు. అనంతరం ఎస్పీ భాస్కర్‌భూషణ్‌కు వినతిపత్రం సమర్పించారు. చింతమనేని ఏలూరు రేంజి డీఐజీ హరికుమార్‌తో భేటీ అయ్యారు. -
ఎన్నాళ్లీ ఉన్మాదం
- పరాకాష్టకు చేరిన విప్ అరాచకత్వం - అద్దె జనంతో అడ్డగోలు వ్యవహారాలు - అధికార పార్టీకీ తలనొప్పిగా మారిన చింతమనేని చిల్లర చేష్టలు సాక్షి ప్రతినిధి, ఏలూరు : స్వచ్ఛమైన జనం, పచ్చనైన పల్లెపట్టులతో ప్రశాంతంగా ఉండే పశ్చిమగోదావరి జిల్లాకు ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఉన్మాదం మాయని మచ్చను తెస్తోంది. అనుచరులను పోగేసుకుని దాడులు, ధర్నాలు చేస్తూ ప్రజలను, ప్రభుత్వ అధికారులను, చివరకు పోలీసులను కూడా భయపెడుతూ చింతమనేని నెరపుతున్న దుష్ట రాజకీయం ఇప్పుడు పరాకాష్టకు చేరింది. అద్దె జనంతో అడ్డగోలు వ్యవహారాలు ఎన్నాళ్లంటూ అధికారులు ప్రభుత్వాన్ని బహిరంగంగా నిలదీసే పరిస్థితి ఎదురైంది. వనజాక్షిపై దాడితోనే రాష్ట్రమంతా వెలుగులోకి వాస్తవానికి చింతమనేని చిల్లర చేష్టలు, దందాలు, పంచాయతీలు జిల్లా ప్రజలందరికీ తెలుసు. ఇక్కడి ప్రభుత్వ అధికారులకు, పోలీసులకు, పాత్రికేయులకు ఆయన వివాదాస్పద వ్యవహారశైలి కొత్తేం కాదు. ఏడాదికి ముందు టీడీపీ ఎమ్మెల్యేగా ఎన్ని అరాచకాలు చేసినా.. ప్రతిపక్ష శాసనసభ్యుడిని కాబట్టే తనను పాలకులు వేధిస్తున్నారంటూ నానాయాగీ చేసేవారు. అధికారంలోకి వచ్చిన దరిమిలా, విప్ పదవిలో ఉంటూ చింతమనేని చేస్తున్న వ్యవహారాలు అధికారులకు భరించలేని తలనొప్పిగా పరిణమించాయి. అటవీశాఖ అధికారిపై దాడి చేసినా, మార్క్‌ఫెడ్ డీఎంపై దౌర్జన్యానికి పాల్పడినా, ఐసీడీఎస్ అధికారులను బెదిరింపులకు గురిచేసినా, ఏలూరు టూటౌన్ పోలీస్‌స్టేషన్‌పై దాడి చేసినంత పనిచేసి నిందితులను బయటకు తీసుకువెళ్లిపోయినా, చీటికీ మాటికీ ప్రభుత్వ ఉద్యోగులను బండబూతులు తిట్టినా మన జిల్లాలో అధికారులెవరూ బహిరంగంగా ఆయనపై ఫిర్యాదు చేసే సాహసం చేయలేకపోయారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లినా ఫలితం లేకపోవడంతో అతని హావభావ విన్యాసాలన్నీ మౌనంగానే భరించారే గానీ రోడ్డుకెక్కి ఆందోళన చేయలేకపోయారు. కానీ పొరుగున కృష్ణాజిల్లాకు చెందిన ముసునూరు తహసిల్దార్ వనజాక్షి మాత్రం వెనక్కి తగ్గలేదు. బుధవారం జరిగిన దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. చింతమనేని అరాచకపర్వాన్ని రాష్ట్రమంతటికీ తెలిసేలా చేశారు. ఆమెకు మద్దతుగా రాష్ట్రంలోని అన్ని జిల్లాల ఉద్యోగ సంఘాల నేతలూ ముందుకురావడంతో మన జిల్లాలోని ఉద్యోగ నేతలూ ధైర్యంగా గళం విప్పారు. చింతమనేనిపై నిప్పులు చెరిగారు. ఆయన నేరచరిత్ర చిట్టా విప్పారు. అరెస్టు చేయకుంటే పాలన స్తంభింపజేస్తామని ప్రకటించారు. కిరాయిమూకలతో ఎంతమందిపై దాడులు చేయిస్తారని ప్రశ్నించారు. ఈ దశలో చింతమనేనిని ప్రభుత్వం అరెస్టు చేస్తుందా.. లేదా ఆయన తన వర్గానికి చెందిన మహిళలతో పెట్టించిన ఎదురుకేసుల నేపథ్యంలో రాజీ చేస్తుందా.. అన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. టీడీపీ నేతలకూ తలనొప్పి? కేవలం సామాజికవర్గ నేపథ్యంలో చింతమనేనికి మద్దతిచ్చే నేతలు తప్పించి అధికార తెలుగుదేశం పార్టీలోనూ ఆయన వ్యవహారశైలిపై తీవ్ర అసమ్మతి నెలకొంది. టీడీపీ అధికారంలోకి వచ్చిన దరిమిలా ఇసుక, మట్టి తవ్వకాలు, ఉద్యోగుల బదిలీల్లో తనదైన ముద్ర వేసి ఆర్థికంగా బలపడుతున్న చింతమనేని జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో తలదూర్చుతున్నారనే అసంతృప్తి ఆయా నేతలకు ఉంది. తాజా పరిమాణాలన్నీ నిశితంగా గమనిస్తున్న చింతమనేని వ్యతిరేకులు ఇదే అదనుగా పార్టీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. మరోపక్క మంత్రి పదవి కోసం ఎన్నాళ్ల నుంచో వేచిచూస్తున్న ప్రభాకర్ ఆశకు ఈ ఘటనతో గండిపడినట్టేనని టీడీపీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. -
‘రౌడీ రాజ్యం’పై కన్నెర్ర
- మహిళా తహ సిల్దార్‌పై దాడి.. నిరసనల వెల్లువ - ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యకు డిమాండ్ - నల్ల బ్యాడ్జీలతో రెవెన్యూ ఉద్యోగుల నిరసన జంగారెడ్డిగూడెం రూరల్: ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన కృష్ణా జిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షి, ఆర్ఐపై దాడికి పాల్పడిన దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. గురువారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులు ఆందోళన చేశారు. రెవెన్యూ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఉద్యోగులు, అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు, తహసిల్దార్ జీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతమనేని, అతని అనుచరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యూనియన్ డివిజన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ మాట్లాడుతూ బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. డెప్యూటీ తహసిల్దార్, ఎన్జీవో డివిజన్ కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు, యూనియన్ డివిజన్ ఉపాధ్యక్షుడు మధ్యాహ్నపు సోమేశ్వరరావు, పాయం రమేష్, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు. దాడులు అమానుషం పెంటపాడు (తాడేపల్లిగూడెం): విధి నిర్వహణలో ఉన్న మహిళా తహసిల్దార్‌పై దాడికి పాల్పడం అమానుషమని పెంటపాడు తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి తహసిల్దార్ ఎ.మధుసూదనరావు, ఆర్ఐ కోటేశ్వరరావు, డీటీ సత్యనారాయణమూర్తి, సీఎస్ఆర్ఐ రాధాబాయి. శేషగిరిరావు, వీఆర్వో, వీఆర్ఏలు ఆందోళన చేశారు. -
బరుల్లో ‘కోట్లా’ట
సాక్షి ప్రతినిధి, ఏలూరు :ఊహించినట్టుగానే పందెం కోడే గెలి చింది. ఏటా మాదిరిగానే ముందువరకూ ఉత్కంఠ నెలకొన్నా సంక్రాంతి సంబరాల తొలి రోజు భోగినాడు జిల్లావ్యాప్తంగా పందెం కోళ్లకు రెక్కలు తెగాయి. నోట్ల కట్టలు తెగిపడ్డాయి. బరుల్లో కోట్లాది రూపాయల మేర పందాలు సాగాయి. హైకోర్టు ఉత్తర్వులు, దానిపై సుప్రీం కోర్టు స్పందన ఎలా ఉన్నా జిల్లాలోని బరులు పందెం రాయుళ్లు, జూదగాళ్లు, వాటిని చూసేందుకు వచ్చే ప్రేక్షకులతో కిక్కిరిసిపోతున్నాయి. వాస్తవానికి బుధవారం ఉదయం వరకు పందాలపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పోలీసులు కూడా ఎక్కడా పందాలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. బరులు సిద్ధం చేసిన ప్రాం తాల్లో అప్రమత్తమయ్యారు. సరిగ్గా ఉదయం 11గంటల సమయంలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ ఏలూరులో డీఐజీ హరికుమార్‌ను కలిసి బయటకు వచ్చి పందాలకు ఇబ్బందుల్లేని వ్యాఖ్యానించారు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి మౌఖిక ఆదేశాలు రావడంతో అప్పటివరకు బరుల వద్ద పదుల సంఖ్యలో పహరా కాసిన పోలీసులు ఉన్నట్టుండి వెనుదిరిగారు. ఆ తర్వాత నుంచి బరుల్లో కోడి పందాలు హోరెత్తాయి. వీటి ముసుగులో జూదాలు, గుండాట, బెట్టింగ్‌లకు అడ్డూఅదుపు లేకుండా పోతోంది. మద్యం ఏరులై పారు తోంది. చాలా బరుల్లో రాత్రివేళ జనరేటర్లు పెట్టి ఫ్లడ్ లైట్ల వెలుతురులో పం దాలు ఆడుతున్నారు. బుధవారం రాత్రి పొద్దుపోయే నాటికి జిల్లావ్యాప్తంగా రూ.60 కోట్లు చేతులు మారాయనేది ఓ అంచనా. భోగి నాడు మొదలైన పందాలు, జూదాలు గురు, శుక్రవారాల్లో కూడా జోరుగా సాగుతాయని, మొత్తంగా మూడు రోజుల్లో రూ.200 వందల కోట్లు చేతులు మారతాయని అంచనా. చింతమనేని, వేటుకూరితో మొదలు దెందులూరు నియోజకవర్గం కొప్పాకలో ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, కలవపూడిలో ఎమ్మెల్యే వేటుకూరి వెంకటశివరామరాజు బుధవారం 12గంటల సమయంలో కోడి పందాలను లాంఛనంగా ప్రారంభిం చారు. డెల్టాలోని ప్రధాన బరులుగా పేరు గాంచిన వెంప, భీమవరం ప్రక్రృ తి ఆశ్రమం, ఐ.భీమవరం, మహదేవపట్నం, పూలపల్లి తదితర బరుల్లో మధ్యాహ్నం 12 గంటల తరువాత కోడి పందాలు ప్రారంభమయ్యాయి. భీమవరం మండలం వెంప బరిలో బీజేపీ రాష్ట్ర సమన్వయకర్త పురిఘళ్ల రఘురామ్, కనుమూరి రఘురామకృష్ణంరాజు, మంత్రి గంటా శ్రీనివాసరావు కుమారుడు రవితేజ, అల్లుడు ప్రశాంత్ తదితరులు పాల్గొని సందడి చేశారు. ఈ గ్రామంలో జరిగిన రెండు ప్రధాన బరుల్లో సుమారు రూ.8 కోట్ల మేర కోడి పందాల లావాదేవీలు జరిగినట్టు తెలిసింది. భోగి రోజు వరకు జిల్లాలో భీమవరం మండలం వెంపలో నిర్వహించిన పందాలే హైలైట్‌గా నిలిచాయని అంటున్నారు. కాగా, ఏటా పెద్దఎత్తున పందాలు సాగే భీమవరం ప్రకృతి ఆశ్రమంలోని ప్రధాన బరిలో మొదటి రోజు పం దాలు నిర్వహించలేదు. ఐ.భీమవరంలో కూడా నామమాత్రంగా నిర్వహించారు. ఉండి నియోజకవర్గ పరిధిలోని సీసలి, ఐ.భీమవరం, మహదేవపట్నం, యండగండి, కోలమూరులలో భారీగా పందాలు జరిగాయి. ఇక్కడ సుమారు రూ.7 కోట్లు చేతుల మారాయని తెలుస్తోంది. చింతలపూడి మండలం రాఘవాపురం, పాతచింతలపూడిల్లో కోడిపందాలు జోరుగా జరి గాయి. లింగపాలెం మండలం కొణిజర్ల, లింగపాలెం, అయ్యపరాజుగూడెం, ములగలంపాడు, సింగగూడెంలో భారీ పందాలు జరిగాయి. ఇక్కడ తొలిరోజే దాదాపుగా కోటి రూపాయలు చేతులు మారినట్టు అంచనా. గుండాటను తిలకించిన ఎమ్మెల్యే జవహర్ కొవ్వూరు నియోజకవర్గంలో దాదాపుగా 12 బరుల్లో కోడిపందాలు జరిగాయి. కొవ్వూరు పట్టణంలో కోడి పందాలను ఎమ్మెల్యే కేఎస్ జవహర్ ప్రారంభించి గుండాటను తిలకించారు. ఇక్కడ రూ.50 లక్షల వరకు చేతులు మారాయని అంచనా. నరసాపురం నియోజకవర్గంలో మూడుచోట్ల జరిగిన కోడిపందాల్లో దాదాపు రూ.20 లక్షలు చేతులు మారాయని అంటున్నారు. పాలకొల్లు నియోజకవర్గం పూలపల్లి, కలగంపూడి గ్రామాల్లో భారీ పందాలు జరిగాయి. పూలపల్లిలో పందాలను నరసాపురం ఎంపీ గోకరాజు గంగరాజు, ఎమ్మెల్సీ అంగర రామ్మోహనరావు తిలకించారు. వెంపలో భారీ పందాలు భీమవరం : భీమవరం మండలం వెంపలో రెండుచోట్ల పోటాపోటీగా నిర్వహించిన కోడి పందాల్లో తొలిరోజున రూ.8 కోట్ల నుంచి రూ.10 కోట్ల మేర పందాలు సాగారుు. బయట పందాలు సైతం భారీగానే జరిగారుు. ఇది జిల్లాలోనే రికార్డు అని పందాల రాయుళ్లు చెబుతున్నారు. ఒక బరిలో 50 పందాలు వేయగా, రెండో బరిలో 30 వరకూ పందాలు పడ్డారుు. డెల్టాలో ప్రతిచోటా పెద్దఎత్తున కోడి పందాలు వేశారు. ఒక్కొక్క కోడిపై రూ .50 వేల నుంచి రూ.2 లక్షల వరకు బెట్టింగ్‌లు జరిగారుు. ప్రతి చోట బరులకు సమీపంలోనే బెల్ట్ షాపులు ఏర్పాటుచేసి మద్యం అమ్మకాలు సాగించారు. గుండాట, పేకాట, కోతాట, బాలాట, రంగాటలు పెద్దఎత్తున ఏర్పాటు చేశారు. వీటిటో యువత పెద్దఎత్తున సొమ్ములను ఒడ్డి జేబులు గుల్ల చేసుకున్నారు. నోటీసులిస్తాం : లాయర్ రాయల్ హైకోర్టు, సుప్రీంకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి కోడిపందాలు వేసిన వారికి, ప్రోత్సహించిన నాయకులకు లీగల్ నోటీసులు పంపిస్తామని ఏలూరుకు చెందిన న్యాయవాది పీడీఆర్ రాయల్ చెప్పారు. వార్తా ఛానళ్లలో ప్రసారమైన కథనాల క్లిప్పింగ్‌లు, పత్రికల్లో వచ్చిన వార్తల ఆధారంగా పందాలరాయుళ్లకు నోటీసులు ఇస్తామని తెలిపారు. పండగ మూడురోజుల తర్వాత ఎవరూ పట్టించుకోరనే ధీమాతోనే జూదగాళ్లు తెగిస్తున్నారని, అందుకే తాము పండగ తర్వాతే ఈ విషయమై అలుపెరుగని పోరాటం చేస్తామని చెప్పారు. చట్టప్రకారం పని చేస్తున్న జిల్లా పోలీసులపై రాజకీయ నేతలు ఒత్తిడి తేవడం దారుణమన్నారు. ఈ విషయంలో కోర్టు ధిక్కారం కింద సదరు నేతలపై కేసులు నమోదు చేయాలని రాయల్ డిమాండ్ చేశారు.