
‘రౌడీ రాజ్యం’పై కన్నెర్ర
- మహిళా తహ సిల్దార్‌పై దాడి.. నిరసనల వెల్లువ
- ఎమ్మెల్యే చింతమనేనిపై చర్యకు డిమాండ్
- నల్ల బ్యాడ్జీలతో రెవెన్యూ ఉద్యోగుల నిరసన
జంగారెడ్డిగూడెం రూరల్: ఇసుక మాఫియాను అడ్డుకునేందుకు వెళ్లిన కృష్ణా జిల్లా ముసునూరు తహసిల్దార్ వనజాక్షి, ఆర్‌ఐపై దాడికి పాల్పడిన దెందులూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్, అతని అనుచరులపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ వెల్లువెత్తుతోంది. గురువారం స్థానిక తహసిల్దార్ కార్యాలయం వద్ద రెవెన్యూ అధికారులు ఆందోళన చేశారు. రెవెన్యూ ఎంప్లాయూస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వరరావు పిలుపు మేరకు ఉద్యోగులు, అధికారులు నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు.
యూనియన్ జిల్లా ఉపాధ్యక్షుడు, తహసిల్దార్ జీవీవీ సత్యనారాయణ మాట్లాడుతూ ఎమ్మెల్యే చింతమనేని, అతని అనుచరుల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. యూనియన్ డివిజన్ అధ్యక్షుడు పి.సత్యనారాయణ మాట్లాడుతూ బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని, లేకపోతే సంఘం ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేస్తామన్నారు. డెప్యూటీ తహసిల్దార్, ఎన్‌జీవో డివిజన్ కార్యదర్శి కె.వెంకటేశ్వరరావు, యూనియన్ డివిజన్ ఉపాధ్యక్షుడు మధ్యాహ్నపు సోమేశ్వరరావు, పాయం రమేష్, వీఆర్వోలు, సిబ్బంది పాల్గొన్నారు.
దాడులు అమానుషం
పెంటపాడు (తాడేపల్లిగూడెం): విధి నిర్వహణలో ఉన్న మహిళా తహసిల్దార్‌పై దాడికి పాల్పడం అమానుషమని పెంటపాడు తహసిల్దార్ కార్యాలయ సిబ్బంది నిరసన తెలిపారు. నల్లబ్యాడ్జీలు ధరించి తహసిల్దార్ ఎ.మధుసూదనరావు, ఆర్‌ఐ కోటేశ్వరరావు, డీటీ సత్యనారాయణమూర్తి, సీఎస్‌ఆర్‌ఐ రాధాబాయి. శేషగిరిరావు, వీఆర్వో, వీఆర్‌ఏలు ఆందోళన చేశారు.