ఇక తాడో పేడో..
రెవెన్యూ అసోసియేషన్ సమరశంఖం
ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయాలని డిమాండ్
‘తెలుగుదేశం పార్టీ నేతల నైజం బయటపడింది. గతంలో మాదిరిగానే అధికారులు, ఉద్యోగులపై టీడీపీ నాయకులు, కార్యకర్తల వేధింపులు, దాడులు మొదలయ్యాయి. ఛోటా మోటా నాయకుల పైరవీలు, ఒత్తిళ్లను ఇకపై ఉపేక్షించకూడదు. ఇటువంటి ఘటనలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. లేదంటే వరుస దాడులు జరుగుతాయి..’ ముసునూరు తహశీల్దారుపై టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడిన ఘటనపై రెవెన్యూ అసోసియేషన్ నాయకులు వెల్లడించిన అభిప్రాయాలివి.
విజయవాడ : తహశీల్దారు వనజాక్షిపై దాడికి పాల్పడటం, ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో డ్వాక్రా మహిళలతో ఆమెపై కేసు కూడా పెట్టించడంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తహశీల్దార్‌పై దాడికి పాల్పడిందిగాక ఆమెపై తప్పుడు కేసు పెట్టించి ఎమ్మెల్యే డబ్బులిచ్చి ధర్నా జరిపించటంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్.. రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల రెవెన్యూ అసోసియేషన్‌లతో సంప్రదింపులు జరిపి కేవలం కొద్ది గంటల్లో ఏకతాటిపైకి తీసుకువచ్చింది. ఇప్పటికే అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో చీఫ్ సెక్రటరీకి, ఇతర రెవెన్యూ ఉన్నతాధికారులకు ముసునూరు తహశీల్దార్‌పై జరిగిన దాడి విషయమై ఫిర్యాదు చేశారు.
రౌడీ రాజకీయాలకు తలొగ్గం...
ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోతే పోరాటం ఉధృతం చేయాలని గురువారం సబ్-కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ తహశీల్దార్ వనజాక్షికి రాష్ట్రంలోని రెవెన్యూ కుటుంబమంతా అండగా ఉంటుందన్నారు. రౌడీ రాజకీయాలకు రెవెన్యూ అసోసియేషన్ తలొగ్గదని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను, అతని అనుచరులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు ప్రేక్షకప్రాత్ర పోషించిన ముసునూరు ఎస్‌ఐని, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలన్నారు.
నేడు కార్యాలయాలకు తాళాలు...
అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనీల్ జన్నిసన్ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 10 గంటలలోపు ఎమ్మెల్యేను అరెస్టు చేయాలన్నారు. లేకుంటే జిల్లాలో అన్ని తహశీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి రోజంతా ధర్నాలు చేస్తామన్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇసుక విధులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కేసులో న్యాయం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి బోజరాజు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఆగడాలపై సమైక్య పోరాటం అవసరమన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టాలన్నారు.
న్యాయ పోరాటం చేస్తా
ఈ ఘటనలో తాను న్యాయ పోరాటం చేస్తానని ముసునూరు తహశీల్దార్ వనజాక్షి అన్నారు. తనపై జరిగిన దాడి ఘటనను వివరిస్తూ.. తన సిబ్బందిని నిర్బంధించారని తెలిసి.. తాను ఆ ప్రదేశానికి వెళ్లానని చెప్పారు. అప్పటికే దెందులూరు ఎమ్మెల్యే, అతని అనుచరులు 25 ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారని తెలిపారు. ట్రాక్టర్లను ఆపమంటూ తాను అడ్డుకోగా ఎమ్మెల్యే తనపై దాడి చేయించారని వివరించారు. సర్వే జరిపి సరిహద్దులు నిర్ణయించిన తరువాత ఇసుక తవ్వుకోండని ఎమ్మెల్యేకు చెప్పినా ఆయన తనపై దాడిచేయించారని చెప్పారు. 500 మీటర్లు దాటి లోపలకు వచ్చి ఇసుకను తవ్వుకుపోతున్నారనే ఫిర్యాదుపై తాను అక్కడకు వెళ్లగా ఈ సంఘటన జరిగిందని ఆమె వివరించారు. ఈ ఘటనపై ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గేదిలేదని, తనకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, గన్నవరం తహశీల్దార్ మాధురి, కలెక్టరేట్ రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధి పాల్ తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సంఘీభావం
తహశీల్దార్ వనజాక్షికి జిల్లా కలెక్టర్ బాబు.ఎ సంఘీభావం తెలిపారు. ఈ విషయంలో తాను పూర్తి మద్దతు ఇచ్చి రెవెన్యూ అసోసియేషన్‌కు అండగా ఉంటానన్నారు. విజయవాడ సబ్-కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, నూజివీడు ఆర్డీవో రంగయ్య తదితరులు కూడా తమ సంఘీభావం తెలిపారు. ఎంపీడీవోల అసోసియేసన్, వ్యవసాయ శాఖ అధికారులు, వీఆర్‌వో, వీఆర్‌ఏల అసోసియేషన్‌లు కూడా ఈ ఘటనను ఖండించి పోరాటానికి సిద్ధమయ్యాయి. ఐద్వా మహిళలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు తహశీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడిని ఖండించారు.