Revenue Services Association
-
రెవెన్యూ అసోసియేషన్ కార్యవర్గం ఎన్నిక
కాకినాడ సిటీ : రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కాకినాడ డివిజన్ కార్యవర్గం ఏకగ్రీంగా ఎన్నికైంది. మంగళవారం స్థానిక రెవెన్యూ భవన్లో సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షులు వీఎస్.దివాకర్ ఎన్నికల అధికారిగా వ్యవహరించి నూతన కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. సంఘ డివిజన్ అధ్యక్షులుగా పి.శ్రీనివాసరావు, అసోసియేట్ అధ్యక్షులుగా జె.సింహాద్రి, ఉపాధ్యక్షులుగా ఎన్ఎస్ఎస్.ప్రసాద్, పివి.సీతాపతిరావు, కె.రత్నకుమారి, కార్యదర్శిగా ఎ.తాతారావు, ట్రెజరర్‌గా జేవీఆర్.రమేష్, జాయింట్ సెక్రటరీలుగా పి.మాచారావు, కె.మరిడయ్య, వి.గోపి, ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఎస్.సత్యనారాయణ, కె.ఈశ్వరరావు, కౌన్సిల్ మెంబర్లుగా కె.శ్రీనివాస్, ఆర్టిటివిజె.సీతారామ్ ఎన్నికయ్యారు. నూతన కార్యవర్గాన్ని రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పితాని త్రినాద్ అభినందించారు. అనంతరం నూతనకార్యవర్గం మర్యాదపూర్వకంగా కాకినాడ ఆర్డీవో అంబేద్కర్‌ను కలిసింది. -
మాటలు చెప్పి..మభ్యపెట్టి..
- రాత్రికి రాత్రే తహశీల్దారుతో హైదరాబాదుకు.. - కమిటీ పేరుతో కాలయాపనకు సీఎం చంద్రబాబు యత్నం - ఇసుక తవ్విన ప్రాంతం పశ్చిమ గోదావరి జిల్లాలోకి వస్తుందని సర్వే బృందం నిర్ధారణ? - అధికారాన్ని ఉపయోగించి తహశీల్దార్‌దే తప్పని తేల్చిన ప్రభుత్వం! సాక్షి ప్రతినిధి, విజయవాడ : ముసునూరు తహశీల్దార్ వనజాక్షి పై టీడీపీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి నిరసనగా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ చేపట్టిన ఉద్యమాన్ని ప్రభుత్వం నీరుగార్చింది. శుక్రవారం నగరంలో రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులతో రాష్ట్ర మంత్రి ఉమామహేశ్వరరావు జరిపిన చర్చలు ఫలించని విషయం తెలిసిందే. దీంతో శనివారం ఉదయం తొమ్మిది గంటలకు సీఎం చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారంటూ.. రాత్రి పది గంటల సమయంలో టీడీపీ నేతలు ఆమెకు సమాచారం అందించి.. రాత్రికి రాత్రే హైదరాబాద్‌కు తీసుకువెళ్లటం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర నేతలకు సమాచారం అందించి రప్పించారు. శనివారం ఉదయం జరిగిన ఈ సమావేశంలో సీఎం స్థాయిలో బెదిరింపు ధోరణితో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఆమెను పరోక్షంగా బెదిరించి.. కంటితుడుపుగా ఐఏఎస్ అధికారితో విచారణ కమిటీ వేస్తున్నట్లు సీఎం చెప్పడం, కమిటీ నివేదిక రాగానే చర్యలు తీసుకుంటానని చెప్పి పంపించేయడం ఈ వ్యవహారాన్ని నీరుగార్చడానికేనని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉద్యమాన్ని విరమించుకుంటున్నట్లు రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ ప్రకటించడం ఒత్తిడి మేరకేనని అర్థమవుతోంది. తహశీల్దారుపై నెపం మోపేలా... శనివారం ఉదయం కృష్ణా, పశ్చిమ గోదావరి జిల్లాలకు చెందిన సర్వే బృందం ముసునూరు మండలం రంగంపేట వద్ద ఉన్న తమ్మిలేరు వాగు వద్ద సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో ఇసుక తీసిన వాగు ప్రాంతం కృష్ణాజిల్లా పరిధి దాటి.. పది మీటర్లు అవతల పశ్చిమగోదావరిలో ఉన్నట్లు తేల్చారు. దీనిని అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. అంటే తహశీల్దార్‌దే తప్పని నేతలు ఒక విధంగా తీర్పు చెప్పించారు. ఘటన జరిగిన రోజు తవ్వకాలను అడ్డుకున్న తహశీల్దారు.. సర్వే అనంతరం పశ్చిమగోదావరి పరిధిలోకి వస్తే తవ్వుకోవచ్చని ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌కు సూచించిన విషయం తెలిసిందే. అయినా ఆమెపై దాడికి దిగటం గమనార్హం. ఇప్పుడు మాత్రం హడావుడిగా సర్వే నిర్వహించడం వెనుక అంతరార్థమేమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. -
ఇక తాడో పేడో..
రెవెన్యూ అసోసియేషన్ సమరశంఖం ఎమ్మెల్యే చింతమనేనిని అరెస్టు చేయాలని డిమాండ్ ‘తెలుగుదేశం పార్టీ నేతల నైజం బయటపడింది. గతంలో మాదిరిగానే అధికారులు, ఉద్యోగులపై టీడీపీ నాయకులు, కార్యకర్తల వేధింపులు, దాడులు మొదలయ్యాయి. ఛోటా మోటా నాయకుల పైరవీలు, ఒత్తిళ్లను ఇకపై ఉపేక్షించకూడదు. ఇటువంటి ఘటనలకు ఆదిలోనే అడ్డుకట్ట వేయాలి. లేదంటే వరుస దాడులు జరుగుతాయి..’ ముసునూరు తహశీల్దారుపై టీడీపీకి చెందిన దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ దాడికి పాల్పడిన ఘటనపై రెవెన్యూ అసోసియేషన్ నాయకులు వెల్లడించిన అభిప్రాయాలివి. విజయవాడ : తహశీల్దారు వనజాక్షిపై దాడికి పాల్పడటం, ఆ తర్వాత పశ్చిమగోదావరి జిల్లాలో డ్వాక్రా మహిళలతో ఆమెపై కేసు కూడా పెట్టించడంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ తీవ్రంగా స్పందించింది. ఈ ఘటనపై తాడోపేడో తేల్చుకునేందుకు సిద్ధమైంది. తహశీల్దార్‌పై దాడికి పాల్పడిందిగాక ఆమెపై తప్పుడు కేసు పెట్టించి ఎమ్మెల్యే డబ్బులిచ్చి ధర్నా జరిపించటంపై రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా రెవెన్యూ అసోసియేషన్.. రాష్ట్రంలోని మిగిలిన 12 జిల్లాల రెవెన్యూ అసోసియేషన్లతో సంప్రదింపులు జరిపి కేవలం కొద్ది గంటల్లో ఏకతాటిపైకి తీసుకువచ్చింది. ఇప్పటికే అసోసియేషన్ రాష్ట అధ్యక్షుడు బొప్పరాజు వెంకటేశ్వర్లు హైదరాబాద్‌లో చీఫ్ సెక్రటరీకి, ఇతర రెవెన్యూ ఉన్నతాధికారులకు ముసునూరు తహశీల్దార్‌పై జరిగిన దాడి విషయమై ఫిర్యాదు చేశారు. రౌడీ రాజకీయాలకు తలొగ్గం... ఎమ్మెల్యేను అరెస్టు చేయకపోతే పోరాటం ఉధృతం చేయాలని గురువారం సబ్-కలెక్టర్ కార్యాలయంలో జరిగిన జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ సమావేశం తీర్మానించింది. ఈ సమావేశానికి అధ్యక్షత వహించిన రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ మాట్లాడుతూ తహశీల్దార్ వనజాక్షికి రాష్ట్రంలోని రెవెన్యూ కుటుంబమంతా అండగా ఉంటుందన్నారు. రౌడీ రాజకీయాలకు రెవెన్యూ అసోసియేషన్ తలొగ్గదని స్పష్టం చేశారు. ఈ సంఘటనలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను, అతని అనుచరులను అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ సంఘటన జరిగినప్పుడు ప్రేక్షకప్రాత్ర పోషించిన ముసునూరు ఎస్ఐని, ముగ్గురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేయాలన్నారు. నేడు కార్యాలయాలకు తాళాలు... అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనీల్ జన్నిసన్ మాట్లాడుతూ శుక్రవారం ఉదయం 10 గంటలలోపు ఎమ్మెల్యేను అరెస్టు చేయాలన్నారు. లేకుంటే జిల్లాలో అన్ని తహశీల్దార్ కార్యాలయాలకు తాళాలు వేసి రోజంతా ధర్నాలు చేస్తామన్నారు. తక్షణమే రెవెన్యూ అధికారులు, సిబ్బంది ఇసుక విధులను బహిష్కరించాలని నిర్ణయించినట్లు చెప్పారు. ఈ కేసులో న్యాయం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం నిర్వహిస్తామన్నారు. జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ కార్యదర్శి బోజరాజు మాట్లాడుతూ అధికార పార్టీ నేతల ఆగడాలపై సమైక్య పోరాటం అవసరమన్నారు. అన్ని ఉద్యోగ సంఘాలను కలుపుకొని రాష్ట్ర వ్యాప్త ఉద్యమం చేపట్టాలన్నారు. న్యాయ పోరాటం చేస్తా ఈ ఘటనలో తాను న్యాయ పోరాటం చేస్తానని ముసునూరు తహశీల్దార్ వనజాక్షి అన్నారు. తనపై జరిగిన దాడి ఘటనను వివరిస్తూ.. తన సిబ్బందిని నిర్బంధించారని తెలిసి.. తాను ఆ ప్రదేశానికి వెళ్లానని చెప్పారు. అప్పటికే దెందులూరు ఎమ్మెల్యే, అతని అనుచరులు 25 ట్రాక్టర్లతో ఇసుకను తరలించుకుపోతున్నారని తెలిపారు. ట్రాక్టర్లను ఆపమంటూ తాను అడ్డుకోగా ఎమ్మెల్యే తనపై దాడి చేయించారని వివరించారు. సర్వే జరిపి సరిహద్దులు నిర్ణయించిన తరువాత ఇసుక తవ్వుకోండని ఎమ్మెల్యేకు చెప్పినా ఆయన తనపై దాడిచేయించారని చెప్పారు. 500 మీటర్లు దాటి లోపలకు వచ్చి ఇసుకను తవ్వుకుపోతున్నారనే ఫిర్యాదుపై తాను అక్కడకు వెళ్లగా ఈ సంఘటన జరిగిందని ఆమె వివరించారు. ఈ ఘటనపై ఎట్టి పరిస్థితిలోనూ వెనక్కి తగ్గేదిలేదని, తనకు న్యాయం జరిగేవరకు పోరాటం చేస్తానని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో అర్బన్ తహశీల్దార్ ఆర్.శివరావు, గన్నవరం తహశీల్దార్ మాధురి, కలెక్టరేట్ రెవెన్యూ అసోసియేషన్ ప్రతినిధి పాల్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ సంఘీభావం తహశీల్దార్ వనజాక్షికి జిల్లా కలెక్టర్ బాబు.ఎ సంఘీభావం తెలిపారు. ఈ విషయంలో తాను పూర్తి మద్దతు ఇచ్చి రెవెన్యూ అసోసియేషన్‌కు అండగా ఉంటానన్నారు. విజయవాడ సబ్-కలెక్టర్ ఎస్.నాగలక్ష్మి, నూజివీడు ఆర్డీవో రంగయ్య తదితరులు కూడా తమ సంఘీభావం తెలిపారు. ఎంపీడీవోల అసోసియేసన్, వ్యవసాయ శాఖ అధికారులు, వీఆర్వో, వీఆర్ఏల అసోసియేషన్లు కూడా ఈ ఘటనను ఖండించి పోరాటానికి సిద్ధమయ్యాయి. ఐద్వా మహిళలు, వివిధ రాజకీయ పక్షాల నాయకులు తహశీల్దార్ వనజాక్షిపై జరిగిన దాడిని ఖండించారు. -
జన హోరు
జిల్లా అంతటా సమైక్య నినాదం మార్మోగుతోంది. సమైక్య సెగ 30 రోజులుగా రగులుతూనే ఉంది. గురువారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు, రోడ్డు దిగ్బంధాలు, వంటా-వార్పులతో ఊళ్లన్నీ హోరెత్తుతున్నాయి. లక్ష జన గర్జనతో కదిరి దద్దరిల్లింది. సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. పట్టణాలు, గ్రామాలు సమైక్య నినాదంతో మార్మోగుతున్నాయి. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్లో జేఏసీ ఆధ్వర్యంలో ‘ఖాద్రీ లక్ష జన గర్జన’ నిర్వహించారు. ఈ గర్జనలో సమైక్య నినాదాలు మిన్నంటాయి. జై సమైక్యాంధ్ర అంటూ లక్ష గొంతులు నినదించాయి. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర, జిల్లా నాయకులు రమణారెడ్డి, జయరామప్ప, శంకర్‌తో పాటు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటేశం, కదిరి ఆర్డీఓ రాజశేఖర్, డీఆర్డీఏ ఏపీడీ రామ్మూర్తిలతో పాటు కదిరి పరిసర ప్రాంతాల్లోని పది మండలాలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత మాజీ ఎంపీ కల్నల్ నిజాముద్దీన్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సిద్దారెడ్డి, ఖాసీంఖాన్, బావుద్దీన్, టీడీపీ నాయకులు అత్తార్‌చాంద్‌బాషా, దేవానంద్ వేదికపైకి వచ్చి నిలబడ్డారు. అయితే కొంతమంది న్యాయవాదులు జోక్యం చేసుకుని రాజకీయ పార్టీల నాయకులు వేదిక నుంచి కిందకు దిగాలని పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. ఈ దశలో ఆర్డీఓతో పాటు డీఎస్పీ దేవదానం, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ తబ్రేజ్ తమ సిబ్బందితో వేదికపై ఉన్న అందర్నీ కిందకు దింపేశారు. ఆ తరువాత జేఏసీ నాయకులను మాత్రమే అనుమతించారు. ఇదే వేదికపై ప్రసంగించిన విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి రవితేజ.. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల వైఖరిని తూర్పారబట్టారు. ఒకానొక దశలో వీరంతా జనంలోకి వస్తే.. దేంతో బుద్ధి చెబుతారని ప్రశ్నించగా... కొంత మంది యువకులు చెప్పులను చూపించారు. దీంతో మరోసారి గందరగోళం ఏర్పడింది. వేదిక ముందున్న వివిధ పార్టీల నాయకులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభ ముగిసిన వెంటనే రవితేజను పోలీసులు వాహనంలో ఎక్కించుకుని పట్టణం దాటించారు. వాడవాడలా ఆందోళనలు అనంతపురంలో సంయుక్త జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పశు సంవర్థక శాఖ ఉద్యోగులు సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి.. అక్కడ దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు నల్ల దుస్తులు ధరించి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పీఆర్, జాక్టో, ఆర్ట్స్ కళాశాల, నీటిపారుదల, ఆర్అండ్బీ, ఐకేపీ, న్యాయవాదులు, ఆర్టీసీ, విద్యుత్‌శాఖ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నుంచి టౌన్ బ్యాంకు ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలు నిలుపుదల, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లకు విద్యుత్ సరఫరా కట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలేదీక్ష 29వ రోజుకు చేరింది. జేఏసీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి.. జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. బత్తలపల్లిలో సమైక్యవాదులు బంద్ నిర్వహించారు. తాడిమర్రిలో సమైక్యవాదులు బైక్ ర్యాలీ చేశారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ యూత్ విభాగంలో మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో జేఏసీ, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. రోడ్లపై వంటా-వార్పు చేపట్టారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు బస్సు యాత్ర చేపట్టారు. లేపాక్షిలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించి.. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మడకశిరలో అంగన్వాడీ కార్యకర్తలు, జేఏసీ నాయకులు ర్యాలీ చేశారు. అమరాపురంలో ఉపాధ్యాయులు సర్వమత ప్రార్థనలు చేశారు. పుట్టపర్తిలో జేఏసీ నాయకుల రిలేదీక్ష కొనసాగుతోంది. కొత్తచెరువులో అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఓడీసీలో రాస్తారోకో నిర్వహించి.. కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. పెనుకొండలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ నాయకుల రిలే దీక్ష కొనసాగుతోంది. సోమందేపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు రాస్తారోకో చేశారు. రొద్దం, గోరంట్ల మండలాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్ష చేపట్టారు. రాయదుర్గంలో కేంద్ర ప్రభుత్వ తీరును కుంభకర్ణుడితో పోలుస్తూ.. ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిలేదీక్ష కొనసాగుతోంది. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక నూతన కమిటీ ఏర్పాటు చేశారు. కాగా సమైక్యాంధ్ర కోరుతూ.. ఆర్టీసీ కండక్టర్ నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గొడుగులతో ప్రదర్శన నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్ రోడ్లపై చిత్త ఊడ్చి నిరసన తెలిపారు. ఐటీఐ విద్యార్థులు, విద్యుత్‌శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో విద్యుత్ శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి జేఏసీ నాయకుడు రాజేష్ 48 గంటల దీక్ష చేపట్టారు. రాప్తాడులో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. పుట్లూరులో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. నార్పలలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో రిలేదీక్ష చేపట్టారు. తాడిపత్రిలో క్రైస్తవులు శిలువ మోస్తూ.. ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్రపై జేఏసీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర గీతాలాపన చేశారు. యాడికిలో జేఏసీ నాయకులు, వాల్మీకి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ నేతలు చలో రాజ్‌భవన్ కార్యాక్రమం చేపట్టారు. ఉరవకొండలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. రోడ్డుపైనే తెలుగు భాషా దినోత్సవం జరిపారు.