జిల్లా అంతటా సమైక్య నినాదం మార్మోగుతోంది. సమైక్య సెగ 30 రోజులుగా రగులుతూనే ఉంది. గురువారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు, రోడ్డు దిగ్బంధాలు, వంటా-వార్పులతో ఊళ్లన్నీ హోరెత్తుతున్నాయి. లక్ష జన గర్జనతో కదిరి దద్దరిల్లింది.
సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. పట్టణాలు, గ్రామాలు సమైక్య నినాదంతో మార్మోగుతున్నాయి. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్‌లో జేఏసీ ఆధ్వర్యంలో ‘ఖాద్రీ లక్ష జన గర్జన’ నిర్వహించారు. ఈ గర్జనలో సమైక్య నినాదాలు మిన్నంటాయి. జై సమైక్యాంధ్ర అంటూ లక్ష గొంతులు నినదించాయి. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర, జిల్లా నాయకులు రమణారెడ్డి, జయరామప్ప, శంకర్‌తో పాటు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటేశం, కదిరి ఆర్డీఓ రాజశేఖర్, డీఆర్‌డీఏ ఏపీడీ రామ్మూర్తిలతో పాటు కదిరి పరిసర ప్రాంతాల్లోని పది మండలాలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత మాజీ ఎంపీ కల్నల్ నిజాముద్దీన్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సిద్దారెడ్డి, ఖాసీంఖాన్, బావుద్దీన్, టీడీపీ నాయకులు అత్తార్‌చాంద్‌బాషా, దేవానంద్ వేదికపైకి వచ్చి నిలబడ్డారు.
అయితే కొంతమంది న్యాయవాదులు జోక్యం చేసుకుని రాజకీయ పార్టీల నాయకులు వేదిక నుంచి కిందకు దిగాలని పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. ఈ దశలో ఆర్డీఓతో పాటు డీఎస్పీ దేవదానం, సీఐ శ్రీనివాసరావు, ఎస్‌ఐ తబ్రేజ్ తమ సిబ్బందితో వేదికపై ఉన్న అందర్నీ కిందకు దింపేశారు. ఆ తరువాత జేఏసీ నాయకులను మాత్రమే అనుమతించారు. ఇదే వేదికపై ప్రసంగించిన విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి రవితేజ.. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల వైఖరిని తూర్పారబట్టారు. ఒకానొక దశలో వీరంతా జనంలోకి వస్తే.. దేంతో బుద్ధి చెబుతారని ప్రశ్నించగా... కొంత మంది యువకులు చెప్పులను చూపించారు. దీంతో మరోసారి గందరగోళం ఏర్పడింది. వేదిక ముందున్న వివిధ పార్టీల నాయకులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభ ముగిసిన వెంటనే రవితేజను పోలీసులు వాహనంలో ఎక్కించుకుని పట్టణం దాటించారు.
వాడవాడలా ఆందోళనలు
అనంతపురంలో సంయుక్త జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పశు సంవర్థక శాఖ ఉద్యోగులు సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి.. అక్కడ దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు నల్ల దుస్తులు ధరించి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పీఆర్, జాక్టో, ఆర్ట్స్ కళాశాల, నీటిపారుదల, ఆర్‌అండ్‌బీ, ఐకేపీ, న్యాయవాదులు, ఆర్టీసీ, విద్యుత్‌శాఖ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి.
గురువారం నుంచి టౌన్ బ్యాంకు ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలు నిలుపుదల, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లకు విద్యుత్ సరఫరా కట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలేదీక్ష 29వ రోజుకు చేరింది. జేఏసీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి.. జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. బత్తలపల్లిలో సమైక్యవాదులు బంద్ నిర్వహించారు.
తాడిమర్రిలో సమైక్యవాదులు బైక్ ర్యాలీ చేశారు. గుంతకల్లులో వైఎస్సార్‌సీపీ యూత్ విభాగంలో మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో జేఏసీ, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. రోడ్లపై వంటా-వార్పు చేపట్టారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు బస్సు యాత్ర చేపట్టారు. లేపాక్షిలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించి.. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు.
మడకశిరలో అంగన్‌వాడీ కార్యకర్తలు, జేఏసీ నాయకులు ర్యాలీ చేశారు. అమరాపురంలో ఉపాధ్యాయులు సర్వమత ప్రార్థనలు చేశారు. పుట్టపర్తిలో జేఏసీ నాయకుల రిలేదీక్ష కొనసాగుతోంది. కొత్తచెరువులో అంగన్‌వాడీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఓడీసీలో రాస్తారోకో నిర్వహించి.. కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. పెనుకొండలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ నాయకుల రిలే దీక్ష కొనసాగుతోంది. సోమందేపల్లిలో వైఎస్సార్‌సీపీ నాయకులు రాస్తారోకో చేశారు. రొద్దం, గోరంట్ల మండలాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్ష చేపట్టారు. రాయదుర్గంలో కేంద్ర ప్రభుత్వ తీరును కుంభకర్ణుడితో పోలుస్తూ.. ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిలేదీక్ష కొనసాగుతోంది. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక నూతన కమిటీ ఏర్పాటు చేశారు. కాగా సమైక్యాంధ్ర కోరుతూ.. ఆర్టీసీ కండక్టర్ నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గొడుగులతో ప్రదర్శన నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్ రోడ్లపై చిత్త ఊడ్చి నిరసన తెలిపారు. ఐటీఐ విద్యార్థులు, విద్యుత్‌శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో విద్యుత్ శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి జేఏసీ నాయకుడు రాజేష్ 48 గంటల దీక్ష చేపట్టారు. రాప్తాడులో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. పుట్లూరులో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. నార్పలలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో రిలేదీక్ష చేపట్టారు. తాడిపత్రిలో క్రైస్తవులు శిలువ మోస్తూ.. ప్రదర్శన నిర్వహించారు.
సమైక్యాంధ్రపై జేఏసీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర గీతాలాపన చేశారు. యాడికిలో జేఏసీ నాయకులు, వాల్మీకి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ నేతలు చలో రాజ్‌భవన్ కార్యాక్రమం చేపట్టారు. ఉరవకొండలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. రోడ్డుపైనే తెలుగు భాషా దినోత్సవం జరిపారు.
జన హోరు
Published Fri, Aug 30 2013 5:48 AM | Last Updated on Fri, Sep 1 2017 10:17 PM
Advertisement