Ambedkar Circle
-
గద్వాల జిల్లాలో ఉద్రిక్తత.. ఎస్ఐకి తీవ్ర గాయాలు
సాక్షి, గద్వాల: జోగులాంబ గద్వాలలోని కేటిదొడ్ది మండలం ఇర్కిచేడులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. బీఆర్ అంబేడ్కర్ విగ్రహ ఆవిష్కరణలో రెండు వర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో ఓ వర్గం వ్యక్తులు అంబేడ్కర్ విగ్రహానికి నిప్పంటించారు. ఈ సందర్బంలో ఇరు వర్గాలను చెదరగొట్టే క్రమంలో ఎస్ఐకి మంటలు అంటుకున్నాయి. దీంతో ఆయన తీవ్రంగా గాయపడినట్టు సమాచారం. ఈ నేపధ్యంలో పోలీసులు మోహరించి ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ ఘటనపై మరింత సమాచారం తెలియాల్సి ఉంది. -
కార్మిక శక్తిని దోచుకుంటే ప్రతిఘటనే
కర్నూలు(రాజ్‌విహార్) : సంస్కరణలు, వ్యతిరేక విధానాలతో కార్మిక శక్తిని దోచుకుంటే ప్రతిఘటన తప్పదని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షుడు ఎ.కె. పద్మనాభన్ హెచ్చరించారు. శనివారం కర్నూలులో ప్రారంభమైన సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సుందరయ్య భవన్ నుంచి పాతబస్తీ మీదుగా పాతబస్టాండ్ వరకు పది వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో వెయ్యి మంది ఎర్రచొక్కాలు ధరించి ప్రజలను ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా స్థానిక పాతబస్టాండ్‌లోని అంబేద్కర్ సర్కిల్లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చట్టాల సవరణ పేరుతో కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంతో ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలవుతాయని చెప్పారు. రైల్వే, ఇన్సూరెన్స్, విమానయాన, పోస్టల్ వంటి శాఖల్లో ఎఫ్‌డీఐల ప్రవేశం ప్రమాదకరమన్నారు. విదేశీ సంస్థలు, దేశంలోని బడాబాబుల సంస్థలకు దోచిపేట్టేందుకు ఈ సంస్కరణలు తీసుకోస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే విధానాలను అనుసరిస్తోందని గుర్తు చేశారు. దీనిపై ఇప్పటికే కార్మిక సంఘాలు నిరసనలు తెలుపుతూ వస్తున్నాయని చెప్పారు. వచ్చే 2015 సంవత్సరాన్ని చావుబతుకుల పోరాట సంవత్సరంగా పరిగణించి సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. లేనిపక్షంలో కార్మిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్య పోరాటాలతోనే పెట్టుబడిదారులు వేసిన బానిస సంకెళ్లు తెగుతాయని చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ఆయన అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను ఇంటికి పంపే పనిపెట్టుకున్నారని పేర్కొన్నారు. ఐకేపీలోని యానిమేటర్లు రెండు నెలలుగా సమ్మె చేస్తూ రోడ్డున పడినా కనీసం చర్చలకు పిలిచిన పాపాన పోలేదన్నారు. ఇటు లక్ష మంది అంగన్వాడీ కార్మికులు వేతనాలు పెంచాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇటు హౌసింగ్ వర్క్ ఇన్స్పెక్టర్లను తొలగించిన చంద్రబాబు సర్కారు ఆశావర్కర్ల, మున్సిపల్, మెడికల్ అండ్ హెల్త్, విద్యుత్ రంగ కార్మికులను ఇంటికి పంపేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పారు. వేతనం పెంచమని అడిగిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్న ఘనుడు చంద్రబాబు అన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను మోసం చేశారని, రూ.80 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పిన ఆయన కేవలం రూ.4500 కోట్లతోనే సరిపెట్టారని ఎద్దేవా చేశారు. కురు వృద్ధులు, భర్తలు లేని వితంతువులు, శారీరక వైకల్యం ఉన్న వికలాంగులకు ఇచ్చే పింఛన్లకు వంద కండీషన్లు పెట్టి 70 శాతం అర్హుల పేర్లను తొలగించి పేదల ఉసురు పోసుకున్నారని గుర్తు చేశారు. ఈ పాపం చంద్రబాబుకు అంటకపోదన్నారు. జిల్లాభివృద్ధి కోసం అరచేతిలో వైకంఠం చూపిన ఆయన ఇంకెన్నాళ్లు మోసగిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఒక రోబో (చంద్రబాబు) ఇతర జీరోల (మంత్రులు) పాలన సాగుతోందని, బాబు మనస్సులేని యంత్రంలా వ్యవహరిస్తే జీరోలుగా మారిన మంత్రులు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ సభకు జిల్లా అధ్యక్షుడు బి. రామాంజనేయులు అధ్యక్షత వహించగాా ఆ సంఘం అఖిల భాతర కార్యదర్శి డాక్టరు హేమలత, బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు పి. అశోక్‌బాబు, ఏపీ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఎం. జనార్దన్ రెడ్డి, ఏపీఎం ఎస్ఆర్యూ రాష్ట్ర కార్యదర్శి రాజామోహన్, పోస్టల్ సీ-3 సర్కిల్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఐసీఈయూ కడప డివిజినల్ కార్యదర్శి సుభశేఖర్, సీఐటీయూ కర్నూలు జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ భూముల కోసం రాస్తారోకో
బేల : వక్ఫ్ భూముల కోసం మండలకేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలోని అంతరాష్ట్రరోడ్డుపై గురువారం స్థానిక జామా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. వక్ఫ్ భూములను తమకు అప్పగించడంలో వక్ఫ్ బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్, త హశీల్దార్లు పట్టింపులేనట్లు వ్యవహరిస్తున్నారని ఆరోపిస్తూ వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మండల కో ఆప్షన్ సభ్యుడు తన్వీర్‌ఖాన్, కమిటీ సభ్యులు మాట్లాడారు. ఎనిమిదేళ్లుగా స్థానిక జామా మసీదు నిర్వహణను పట్టించుకోని నవాబొద్దీన్ వక్ఫ్ భూములను తన స్వాధీనంలో ఉంచుకున్నాడని ఆరోపించారు. విలువైన ఈ భూములను కమిటీకి అప్పగిస్తానని గతంలో రాత పూర్వకంగా రాసిచ్చి ఆ తర్వాత నిరాకరిస్తున్నాడని పేర్కొన్నారు. కోర్టు ఈ భూములను కమిటీకి అప్పగించాలనీ తీర్పు ఇచ్చినా ఆయన స్పందించడం లేదని పేర్కొన్నారు. వెంటనే ఈ భూములను జామా మసీదు మసాబ్ కమిటీకి అప్పగించాలని, లేని పక్షంలో నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. ధర్నా వద్దకు చేరుకున్న త హశీల్దార్, ఆందోళనకారులను సముదాయించారు. సమస్య ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఆందోళ నలో కమిటీ సభ్యులు అబ్ధుల్ సలీం, హపీజ్, మసూద్ హైమద్, బబన్, ముస్తాక్, షకీల్‌ఖాన్, సిరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
మందకృష్ణ.. గో బ్యాక్
తాడిపత్రి రూరల్ : తాడిపత్రిలో ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకష్ణ మాదిగ పర్యటనను అడ్డుకునేందుకు ఆ సంఘం నాయకులు సోమవారం ప్రయత్నించారు. పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద ఎమ్మార్పీఎస్ (దండువీరయ్య, ఎంఎస్ రాజు వర్గాల)కు చెందిన నాయకులు రామాంజనేయులు, గురుశంకర్, సాయిశేఖర్, కంబయ్య, రమణ, రామ్మోహన్, వెంకటశివ, శివ తదితరులు ‘మందకృష్ణ మాదిగ గోబ్యాక్.. పర్యటన రద్దు చేసుకోవాలి’ అంటూ నినాదాలు చేశారు. సీమాంధ్రకు వ్యతిరేకి అయిన నీవు ఇక్కడికెలా వస్తావంటూ విమర్శించారు. రోడ్డుపై బైఠాయించారు. సమాచారం తెలుసుకున్న పట్టణ, రూరల్ సీఐలు సుధాకర్‌రెడ్డి, వెంకటరెడ్డి తమ పోలీసు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకుని నాయకులను, కార్యకర్తలను అరెస్ట్ చేశారు. ఆందోళనకారులు పోలీసు స్టేషన్లోనూ కాసేపు నిరసన తెలిపారు. కేసీఆర్ రెచ్చగొడుతున్నారు తెలంగాణలో పుట్టిన ప్రతి బిడ్డా తెలంగాణవాదేనని, ఈ మాటను తాను ఆంధ్రప్రదేశ్-తెలంగాణలో ఎక్కడైనా చెబుతానని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ స్పష్టం చేశారు. సోమవారం ఆయన తాడిపత్రిలోని రఘు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన ఎమ్మార్పీఎస్ జిల్లా ముఖ్యకార్యకర్తల సమావేశానికి హాజరయ్యారు. తొలుత బస్టాండ్ సర్కిల్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేసీఆర్ రెచ్చగొట్టే ధోరణిలో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. మాదిగలలో చైతన్యం లేకే తనను అడ్డుకుంటున్నారని పేర్కొన్నారు. ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కోసం మరో ఉద్యమానికి సన్నద్ధం కావాలని మాదిగలకు పిలుపునిచ్చారు. సెప్టెంబరు నెలాఖరులోగా ఏపీ-తెలంగాణ రాష్ట్రాల నూతన కమిటీల సమన్వయంతో జాతీయ కమిటీని ప్రకటిస్తామని తెలిపారు. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులూ అనుకూలంగా ఉన్నారని, తక్షణమే ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా పోరాటాలు చేయాలన్నారు. -
20 ఏళ్లకు బస్‘స్టాండ్’
ఎన్నో ఏళ్ల గ్రామస్తుల కష్టాలు తొలగాయి. ఏడాది కాదు.. రెండేళ్లు కాదు.. 20 ఏళ్ల అనంతరం బేలలోని బస్టాండ్(పాతబస్టాండ్)కు ఆర్టీసీ బస్సుల రాకపోకలు పునఃప్రారంభమయ్యూరుు. అసౌకర్యాలు.. అపరిశుభ్రతతో శిథిలావస్థకు చేరి బస్టాండ్ నిరుపయోగంగా మారడంపై ఈ నెల 10న ‘సాక్షి’లో ‘ఒంటికి.. రెంటికి చోటేది?’ శీర్షికన కథనం ప్రచురితమైంది. స్పందించిన పంచాయతీ పాలకవర్గం, స్థానికులు బస్టాండ్‌లో పిచ్చిమొక్కలు, చెత్తాచెదారాన్ని తొలగించి సొబగులు అద్దడంతో బుధవారం బస్సుల రాకపోకలు పునఃప్రారంభమయ్యూరుు. దీంతో మండలవాసులు ఆనందం వ్యక్తంచేస్తున్నారు. బేల, న్యూస్‌లైన్ : మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా సమీపంలో ఆర్టీసీ బస్టాండ్‌ను 1989లో ప్రారంభించగా నాలుగేళ్లపాటు బస్సుల రాకపోకలు సాఫీగా సాగారుు. ఆ తర్వాత వివిధ సమస్యలు సాకుగా చూపి బస్సులు బస్టాండ్ వరకు రాకుండా స్థానిక ఇందిరా చౌరస్తాలో ఆపుతూ ప్రయూణికులను ఎక్కించుకుంటున్నారు. ఈ చౌరస్తాలో కనీస సౌకర్యాలు లేక ప్రయూణికులు నిత్యం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో బస్టాండ్ శిథిలావస్థకు చేరి నిరుపయోగంగా మారిన వైనంపై ‘సాక్షి’లో కథనం ప్రచురితం కావడంతో గ్రామ పంచాయతీ పాలకవర్గం, స్థానికులు స్పందించారు. వారం రోజులపాటు బస్టాండ్ ఆవరణలో పిచ్చిమొక్కలు తొలగించారు. యూత్ సభ్యులు మరమ్మ తు పనులు చేపట్టారు. ఆవరణ, బస్టాండ్ షెడ్లను శుభ్రం చేశారు. పునఃప్రారంభం కోసం ఆర్టీసీ అధికారులకు విన్నవించడంతో వారు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు. బుధవారం స్థానిక అంబేద్కర్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సులను అలంకరించి బ్యాండ్ మేళాల మధ్య పంచాయతీ పాలకవర్గం, వివిధ యూత్ క్లబ్‌ల సభ్యులు బస్టాండ్‌కు తీసుకొచ్చా రు. బస్టాండ్ ప్రాంగణాన్ని ఎమ్మెల్యే జోగు రామన్న పునఃప్రారంభించారు. ఎమ్మెల్యే, ఆర్టీసీ ఇన్చార్జి డీఎం శివ కేశ వ్, సర్పంచ్ మస్కే తేజ్‌రావు జెండా ఊపి బస్సుల రాకపోకలు పునరుద్ధరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడారు. ఎని మిది రోజుల్లోగా బస్టాండ్ ఆవరణలో మూత్రశాలలు, మరుగుదొడ్ల నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. త్వరలో అంబేద్కర్ చౌరస్తా నుంచి బస్టాండ్ వరకు సీసీ రోడ్డు, కల్వర్టు నిర్మాణాలు ప్రా రంభిస్తామని చెప్పారు. బస్టాండ్ పునర్నిర్మాణానికి నిధులు మంజూరయ్యేలా చూస్తానన్నారు. ఎస్సై దేశ్‌కార్ లక్ష్మణ్, డిపో అసిస్టెంట్ మేనేజర్ జాకబ్, డిపో ఎస్సై రాములు, ఉప సర్పంచ్ వట్టిపెల్లి ఇంద్రశేఖర్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రావుత్ మనోహర్, మాజీ సర్పంచ్ ఓల్లఫ్వార్ దేవన్న, జన చైతన్య సంఘం అధ్యక్షుడు ముక్కవార్ కిరణ్, బీజేవైఎం అధ్యక్షుడు గుండవార్ ఆకాష్, తెలంగాణ జాగృతి కమిటీ అధ్యక్షుడు షకీల్‌ఖాన్, సర్పంచులు శంకర్, రూప్‌రావు, బాపురావు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు క్యాతం రాఘవులు, నాయకులు, వార్డు సభ్యులు పాల్గొన్నారు. కాగా, సమస్యను స్థానికుల దృష్టికి తెచ్చి పరిష్కారానికి కృషి చేసిన ‘సాక్షి’కి స్థానిక ప్రయాణికులు కృతజ్ఞతలు తెలిపారు. -
జగన్‌కు మద్దతుగా రాస్తారోకో
కదిరి అర్బన్, న్యూస్‌లైన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి మద్దతుగా శుక్రవారం రాత్రి ఆ పార్టీ కదిరి నియోజకవర్గ సమన్వయకర్త ఎస్ఎండీ ఇస్మాయిల్, రాష్ట్ర నాయకులు సుధాకర్‌రెడ్డిల ఆధ్వర్యంలో 205 జాతీయ రహదారిపైనున్న అంబేద్కర్ సర్కిల్లో రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమన్యాయం చేయలేనపుడు రాష్ట్రాన్ని యధాతథంగా ఉంచాలంటూ తమ నాయకుడు జైల్లో ఆమరణ నిరాహారదీక్ష చేస్తుంటే ఆయన దీక్షను భగ్నం చేయడానికి ప్రభుత్వం పూనుకుందన్నారు. ఆస్పత్రిలో కనీసం కుటుంబ సభ్యులను కూడా ఆయన వద్దకు అనుమతించక పోవడం దారుణమని విమర్శించారు. పట్టణ ఎస్సై తబ్రేజ్ అక్కడికి చేరుకుని రాస్తారోకో విరమించాలని ఆందోళన కారులను కోరగా వారు ససేమిరా అన్నారు. దీంతో ఇస్మాయిల్ తదితరులను బలవంతంగా పోలీసు జీపు ఎక్కించి స్టేషన్‌కు తరలించారు. కార్యక్రమంలో నాయకులు చాంద్‌బాషా, లింగాల లోకేశ్వరెడ్డి, శివారెడ్డి, మాధురి రాజారెడ్డి, జాఫర్‌ఖాన్, ఇమ్రాన్, రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
జన హోరు
జిల్లా అంతటా సమైక్య నినాదం మార్మోగుతోంది. సమైక్య సెగ 30 రోజులుగా రగులుతూనే ఉంది. గురువారం జిల్లా వ్యాప్తంగా నిరసనలు ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ప్రజలు రోడ్లపైకి వచ్చి వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తున్నారు. రిలే నిరాహార దీక్షలు, మానవహారాలు, రోడ్డు దిగ్బంధాలు, వంటా-వార్పులతో ఊళ్లన్నీ హోరెత్తుతున్నాయి. లక్ష జన గర్జనతో కదిరి దద్దరిల్లింది. సాక్షి, అనంతపురం : సమైక్యాంధ్ర ఉద్యమం పతాక స్థాయికి చేరుకుంది. పట్టణాలు, గ్రామాలు సమైక్య నినాదంతో మార్మోగుతున్నాయి. కదిరిలోని అంబేద్కర్ సర్కిల్లో జేఏసీ ఆధ్వర్యంలో ‘ఖాద్రీ లక్ష జన గర్జన’ నిర్వహించారు. ఈ గర్జనలో సమైక్య నినాదాలు మిన్నంటాయి. జై సమైక్యాంధ్ర అంటూ లక్ష గొంతులు నినదించాయి. జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవీంద్ర, జిల్లా నాయకులు రమణారెడ్డి, జయరామప్ప, శంకర్‌తో పాటు పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటేశం, కదిరి ఆర్డీఓ రాజశేఖర్, డీఆర్డీఏ ఏపీడీ రామ్మూర్తిలతో పాటు కదిరి పరిసర ప్రాంతాల్లోని పది మండలాలకు చెందిన ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రైతులు, మహిళలు, విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. తొలుత మాజీ ఎంపీ కల్నల్ నిజాముద్దీన్, కాంగ్రెస్ నాయకులు డాక్టర్ సిద్దారెడ్డి, ఖాసీంఖాన్, బావుద్దీన్, టీడీపీ నాయకులు అత్తార్‌చాంద్‌బాషా, దేవానంద్ వేదికపైకి వచ్చి నిలబడ్డారు. అయితే కొంతమంది న్యాయవాదులు జోక్యం చేసుకుని రాజకీయ పార్టీల నాయకులు వేదిక నుంచి కిందకు దిగాలని పట్టుబట్టడంతో గందరగోళం నెలకొంది. ఈ దశలో ఆర్డీఓతో పాటు డీఎస్పీ దేవదానం, సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ తబ్రేజ్ తమ సిబ్బందితో వేదికపై ఉన్న అందర్నీ కిందకు దింపేశారు. ఆ తరువాత జేఏసీ నాయకులను మాత్రమే అనుమతించారు. ఇదే వేదికపై ప్రసంగించిన విశాలాంధ్ర మహాసభ ప్రతినిధి రవితేజ.. కేంద్ర మంత్రులు, ఎంపీలు, వివిధ రాజకీయ పార్టీల నాయకుల వైఖరిని తూర్పారబట్టారు. ఒకానొక దశలో వీరంతా జనంలోకి వస్తే.. దేంతో బుద్ధి చెబుతారని ప్రశ్నించగా... కొంత మంది యువకులు చెప్పులను చూపించారు. దీంతో మరోసారి గందరగోళం ఏర్పడింది. వేదిక ముందున్న వివిధ పార్టీల నాయకులు ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సభ ముగిసిన వెంటనే రవితేజను పోలీసులు వాహనంలో ఎక్కించుకుని పట్టణం దాటించారు. వాడవాడలా ఆందోళనలు అనంతపురంలో సంయుక్త జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. పశు సంవర్థక శాఖ ఉద్యోగులు సప్తగిరి సర్కిల్ నుంచి టవర్ క్లాక్ వరకు ర్యాలీ నిర్వహించి.. అక్కడ దీక్షలు చేస్తున్న వారికి సంఘీభావం తెలిపారు. పంచాయతీరాజ్ ఉద్యోగులు నల్ల దుస్తులు ధరించి తహశీల్దార్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. పీఆర్, జాక్టో, ఆర్ట్స్ కళాశాల, నీటిపారుదల, ఆర్అండ్బీ, ఐకేపీ, న్యాయవాదులు, ఆర్టీసీ, విద్యుత్‌శాఖ ఉద్యోగుల రిలేదీక్షలు కొనసాగుతున్నాయి. గురువారం నుంచి టౌన్ బ్యాంకు ఉద్యోగులు రిలే దీక్షలు ప్రారంభించారు. సెప్టెంబర్ 2వ తేదీ నుంచి విద్యుత్ ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్లనున్నట్లు ప్రకటించారు. అత్యవసర సేవలు నిలుపుదల, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీల ఇళ్లకు విద్యుత్ సరఫరా కట్ చేయనున్నట్లు ప్రకటించారు. ఎస్కేయూలో జేఏసీ నాయకుల రిలేదీక్ష 29వ రోజుకు చేరింది. జేఏసీ నాయకులు, విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించి.. జాతీయరహదారిపై రాస్తారోకో చేశారు. ధర్మవరంలో జేఏసీ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన చేపట్టారు. బత్తలపల్లిలో సమైక్యవాదులు బంద్ నిర్వహించారు. తాడిమర్రిలో సమైక్యవాదులు బైక్ ర్యాలీ చేశారు. గుంతకల్లులో వైఎస్సార్సీపీ యూత్ విభాగంలో మోటారు సైకిళ్లతో ర్యాలీ నిర్వహించారు. హిందూపురంలో జేఏసీ, విద్యార్థులు, అన్ని వర్గాల ప్రజలు భారీ ప్రదర్శన నిర్వహించారు. రోడ్లపై వంటా-వార్పు చేపట్టారు. ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో కాగడాల ప్రదర్శన నిర్వహించారు. చిలమత్తూరులో జేఏసీ నాయకులు బస్సు యాత్ర చేపట్టారు. లేపాక్షిలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. కళ్యాణదుర్గంలో జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించి.. సోనియా, కేసీఆర్ దిష్టిబొమ్మలు దహనం చేశారు. మడకశిరలో అంగన్వాడీ కార్యకర్తలు, జేఏసీ నాయకులు ర్యాలీ చేశారు. అమరాపురంలో ఉపాధ్యాయులు సర్వమత ప్రార్థనలు చేశారు. పుట్టపర్తిలో జేఏసీ నాయకుల రిలేదీక్ష కొనసాగుతోంది. కొత్తచెరువులో అంగన్వాడీ కార్యకర్తలు ప్రదర్శన నిర్వహించి నిరసన తెలిపారు. ఓడీసీలో రాస్తారోకో నిర్వహించి.. కేసీఆర్, సోనియాగాంధీ దిష్టిబొమ్మలు దహనం చేశారు. పెనుకొండలో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ నాయకుల రిలే దీక్ష కొనసాగుతోంది. సోమందేపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులు రాస్తారోకో చేశారు. రొద్దం, గోరంట్ల మండలాల్లో ఉపాధ్యాయ, ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో రిలేదీక్ష చేపట్టారు. రాయదుర్గంలో కేంద్ర ప్రభుత్వ తీరును కుంభకర్ణుడితో పోలుస్తూ.. ఉపాధ్యాయ జేఏసీ నాయకులు ప్రదర్శన నిర్వహించారు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, ఉద్యోగుల రిలేదీక్ష కొనసాగుతోంది. సమైక్య రాష్ర్ట పరిరక్షణ వేదిక నూతన కమిటీ ఏర్పాటు చేశారు. కాగా సమైక్యాంధ్ర కోరుతూ.. ఆర్టీసీ కండక్టర్ నాగరాజు చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష మూడో రోజుకు చేరింది. సమైక్య రాష్ట్ర పరిరక్షణ వేదిక ఆధ్వర్యంలో గొడుగులతో ప్రదర్శన నిర్వహించారు. మునిసిపల్ కమిషనర్ రోడ్లపై చిత్త ఊడ్చి నిరసన తెలిపారు. ఐటీఐ విద్యార్థులు, విద్యుత్‌శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. కణేకల్లులో విద్యుత్ శాఖ ఉద్యోగులు ర్యాలీ నిర్వహించారు. విద్యార్థి జేఏసీ నాయకుడు రాజేష్ 48 గంటల దీక్ష చేపట్టారు. రాప్తాడులో సమైక్యవాదులు రాస్తారోకో చేశారు. పుట్లూరులో సమైక్యవాదులు ర్యాలీ నిర్వహించారు. నార్పలలో విశ్వబ్రాహ్మణ సంఘం ఆద్వర్యంలో రిలేదీక్ష చేపట్టారు. తాడిపత్రిలో క్రైస్తవులు శిలువ మోస్తూ.. ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్రపై జేఏసీ ఆధ్వర్యంలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సమైక్యాంధ్ర గీతాలాపన చేశారు. యాడికిలో జేఏసీ నాయకులు, వాల్మీకి సంఘం నాయకుల ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ నేతలు చలో రాజ్‌భవన్ కార్యాక్రమం చేపట్టారు. ఉరవకొండలో ఉపాధ్యాయులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. రోడ్డుపైనే తెలుగు భాషా దినోత్సవం జరిపారు.