కర్నూలు(రాజ్‌విహార్) : సంస్కరణలు, వ్యతిరేక విధానాలతో కార్మిక శక్తిని దోచుకుంటే ప్రతిఘటన తప్పదని సీఐటీయూ అఖిల భారత అధ్యక్షుడు ఎ.కె. పద్మనాభన్ హెచ్చరించారు. శనివారం కర్నూలులో ప్రారంభమైన సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. సుందరయ్య భవన్ నుంచి పాతబస్తీ మీదుగా పాతబస్టాండ్ వరకు పది వేల మందితో భారీ ర్యాలీ నిర్వహించారు. ఇందులో వెయ్యి మంది ఎర్రచొక్కాలు ధరించి ప్రజలను ఆకట్టుకున్నారు.
ఈ సందర్భంగా స్థానిక పాతబస్టాండ్‌లోని అంబేద్కర్ సర్కిల్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. చట్టాల సవరణ పేరుతో కార్మిక రంగాన్ని నిర్వీర్యం చేసేందుకు కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోందని చెప్పారు. విదేశీ పెట్టుబడులను ఆహ్వానించడంతో ప్రభుత్వ రంగ సంస్థలు కుదేలవుతాయని చెప్పారు. రైల్వే, ఇన్సూరెన్స్, విమానయాన, పోస్టల్ వంటి శాఖల్లో ఎఫ్‌డీఐల ప్రవేశం ప్రమాదకరమన్నారు. విదేశీ సంస్థలు, దేశంలోని బడాబాబుల సంస్థలకు దోచిపేట్టేందుకు ఈ సంస్కరణలు తీసుకోస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ అధికారంలో ఉన్న తెలుగుదేశం ప్రభుత్వం కూడా అదే విధానాలను అనుసరిస్తోందని గుర్తు చేశారు.
దీనిపై ఇప్పటికే కార్మిక సంఘాలు నిరసనలు తెలుపుతూ వస్తున్నాయని చెప్పారు. వచ్చే 2015 సంవత్సరాన్ని చావుబతుకుల పోరాట సంవత్సరంగా పరిగణించి సమరశీల పోరాటాలు నిర్వహించాల్సిన సమయం వచ్చిందన్నారు. లేనిపక్షంలో కార్మిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఐక్య పోరాటాలతోనే పెట్టుబడిదారులు వేసిన బానిస సంకెళ్లు తెగుతాయని చెప్పారు. అనంతరం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎంఎ గఫూర్ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఎన్నికల ముందు ఎన్నో హామీలు ఇచ్చారని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామని ప్రకటించిన ఆయన అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఊడగొడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగులను ఇంటికి పంపే పనిపెట్టుకున్నారని పేర్కొన్నారు.
ఐకేపీలోని యానిమేటర్లు రెండు నెలలుగా సమ్మె చేస్తూ రోడ్డున పడినా కనీసం చర్చలకు పిలిచిన పాపాన పోలేదన్నారు. ఇటు లక్ష మంది అంగన్‌వాడీ కార్మికులు వేతనాలు పెంచాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు. ఇటు హౌసింగ్ వర్క్ ఇన్‌స్పెక్టర్లను తొలగించిన చంద్రబాబు సర్కారు ఆశావర్కర్ల, మున్సిపల్, మెడికల్ అండ్ హెల్త్, విద్యుత్ రంగ కార్మికులను ఇంటికి పంపేందుకు కుట్ర పన్నుతున్నారని చెప్పారు. వేతనం పెంచమని అడిగిన ప్రతి ఒక్కరిపై కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్న ఘనుడు చంద్రబాబు అన్నారు. రుణ మాఫీ పేరుతో రైతులను మోసం చేశారని, రూ.80 వేల కోట్లు మాఫీ చేస్తామని చెప్పిన ఆయన కేవలం రూ.4500 కోట్లతోనే సరిపెట్టారని ఎద్దేవా చేశారు. కురు వృద్ధులు, భర్తలు లేని వితంతువులు, శారీరక వైకల్యం ఉన్న వికలాంగులకు ఇచ్చే పింఛన్లకు వంద కండీషన్లు పెట్టి 70 శాతం అర్హుల పేర్లను తొలగించి పేదల ఉసురు పోసుకున్నారని గుర్తు చేశారు. ఈ పాపం చంద్రబాబుకు అంటకపోదన్నారు. జిల్లాభివృద్ధి కోసం అరచేతిలో వైకంఠం చూపిన ఆయన ఇంకెన్నాళ్లు మోసగిస్తారని ప్రశ్నించారు.
రాష్ట్రంలో ఒక రోబో (చంద్రబాబు) ఇతర జీరోల (మంత్రులు) పాలన సాగుతోందని, బాబు మనస్సులేని యంత్రంలా వ్యవహరిస్తే జీరోలుగా మారిన మంత్రులు మౌనంగా ఉన్నారని ఎద్దేవా చేశారు. ఈ సభకు జిల్లా అధ్యక్షుడు బి. రామాంజనేయులు అధ్యక్షత వహించగాా ఆ సంఘం అఖిల భాతర కార్యదర్శి డాక్టరు హేమలత, బీఎస్‌ఎన్‌ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షుడు పి. అశోక్‌బాబు, ఏపీ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ రాష్ట్ర ఛైర్మన్ ఎం. జనార్దన్ రెడ్డి, ఏపీఎం ఎస్‌ఆర్‌యూ రాష్ట్ర కార్యదర్శి రాజామోహన్, పోస్టల్ సీ-3 సర్కిల్ ప్రధాన కార్యదర్శి ప్రసాద్, ఐసీఈయూ కడప డివిజినల్ కార్యదర్శి సుభశేఖర్, సీఐటీయూ కర్నూలు జిల్లా కార్యదర్శి రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
కార్మిక శక్తిని దోచుకుంటే ప్రతిఘటనే
Published Sun, Dec 14 2014 2:47 AM | Last Updated on Sat, Sep 2 2017 6:07 PM
Advertisement
Advertisement