పొదుపు సంఘాల సభ్యుల ఆదాయంపై కూటమి సర్కారు ఆరా.. సంక్షేమ పథకాల్లో కోత వేసేందుకు స్కెచ్
కుటుంబం సమస్త సమాచారం ఇవ్వాలని ఆదేశాలు
ఇల్లు, కారు, బైక్, టీవీ, మొబైల్ ఫోన్లు తదితర అన్ని వివరాల సేకరణ
ఎంత మొత్తం డిజిటల్ లావాదేవీలు చేశారో చెప్పాల్సిందే
స్వయం ఉపాధి ఉంటే.. వచ్చే ఆదాయం, జీఎస్టీ నంబరూ వెల్లడించాలి
అన్ని జిల్లాలకు ఆరు పేజీలతో కూడిన ప్రశ్నావళి.. మెప్మా, డీఆర్‌డీఏ పీడీలకు సమాచార సేకరణ బాధ్యతలు
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సమస్త సమాచారాన్ని సేకరించే పనిలో టీడీపీ కూటమి ప్రభుత్వం పడింది. వారుంటున్న ఇంటి వివరాల నుంచి వాడే మొబైల్ వరకూ అన్ని వివరాలను సేకరిస్తోంది. ఇందుకోసం ఆరు పేజీలతో కూడిన ప్రశ్నావళిని అన్ని జిల్లాలకు ప్రభుత్వం పంపింది. ఎస్‌హెచ్‌జీలోని సభ్యుల రుణాలు, మొత్తం గ్రూపు ఎంతమేర రుణం తీసుకుంది? నెలవారీగా చెల్లిస్తున్న ఈఎంఐ ఎంత అనే వివరాలతో పాటు ఆయా సంఘాల్లో ఉంటున్న సభ్యుల కుటుంబాల్లోని ఇతరుల ఆదాయ వివరాలను కూడా సేకరిస్తుండటం అనుమానాలను రేకెత్తిస్తోంది.
ఈ మేరకు అన్ని జిల్లాల డీఆర్‌డీఏ పీడీలతో పాటు పట్టణాల్లోని మెప్మా పీడీలకు కూడా ఈ ప్రశ్నావళిని ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. అన్ని వివరాలను సేకరించి మెప్మా, డీఆర్‌డీఏ పీడీల సంతకాలతో పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, కేవలం గ్రూపులకు సంబంధించిన సమాచారం, ఆయా గ్రూపుల్లో ఉన్న మహిళల సమాచారం మాత్రమే కాకుండా మొత్తం వారి కుటుంబ ఆదాయ వివరాలను సేకరిస్తున్న నేపథ్యంలో రానున్న కాలంలో ప్రభుత్వం మంజూరుచేసే సంక్షేమ పథకాల అమలులో కోత విధించేందుకేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఇల్లు నుంచి సెల్లు వరకూ..
రాష్ట్రవ్యాప్తంగా 11.46 లక్షల పొదుపు సంఘాలున్నాయి. ఇందులో కోటి మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ అన్ని గ్రూపులకు సంబంధించిన సమాచారంతో పాటు గ్రూపులో ఉన్న మహిళలందరి సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. వారుంటున్న ఇంటి నుంచి.. వాడే సెల్‌ఫోన్ వరకూ అన్ని వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. నివాసం ఉంటున్న ఇల్లు సొంతానిదా? అద్దెకు ఉంటున్నారా? ఇల్లు ఏ రకానికి చెందినది.. అంటే, గుడిసె, పెంకుటిల్లు, భవంతి, అపార్టుమెంట్ అనే వివరాలను సేకరిస్తోంది. ఇంటి స్థలం, ఇల్లు, ఇతరత్రా ఏమైనా ప్రభుత్వ పథకాలు పొందారా? అని కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు.
అలాగే, వివిధ ప్రభుత్వ బీమా పథకాల ద్వారా లబ్ధిపొందారా? ఎంత మొత్తం పొందారు? ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా? కారు ఉందా? తదతర వివరాలను కూడా నింపాలని పేర్కొంది. ఇక సభ్యురాలి మొబైల్ నెంబరుతో పాటు ఎటువంటి ఫోన్ వినియోగిస్తున్నారు? డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారా? ఎంత మొత్తం నిర్వహిస్తున్నారు లాంటి వివరాలను కూడా ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ ఎస్‌హెచ్‌జీ ద్వారా ఏమైనా స్వయం ఉపాధి పొందుతుంటే.. తద్వారా వచ్చే ఆదాయం ఎంత? జీఎస్టీ నెంబరు వివరాలను కూడా సేకరిస్తున్నారు.
సంక్షేమ పథకాల కోతకేనా!?
కేవలం ఎస్‌హెచ్‌జీలో ఉంటున్న మహిళల ఆదాయ వివరాలతో ఆగకుండా కుటుంబంలోని ఇతర సభ్యుల ఆదాయ వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే, పొదుపు మహిళలు స్వయం ఉపాధి ద్వారా పొందుతున్న ఆదాయంతో పాటు కుటుంబంలోని సభ్యుల ఆదాయాన్ని కూడా తెలుసుకోనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల కోసం సేకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సేకరిస్తున్న వివరాలన్నీ ప్రభుత్వానికి చేరితే ఇస్తున్న కొద్దిపాటి సంక్షేమానికి కూడా కోతలు పెడతారనే భయాందోళనలను ఎస్‌హెచ్‌జీ సభ్యులు వ్యక్తంచేస్తున్నారు. అంతేకాక.. ఇంట్లో వాడుతున్న గ్యాస్ నెంబరును కూడా ఆర్పీల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుండటంతో వారు కలవరపడుతున్నారు. ఈ మొత్తం సమాచారాన్ని జిల్లాల మెప్మా, డీఆర్‌డీఏ పీడీలు సేకరించి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీకావడంతో వారు ఈ సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment