drda pd
-
ఏమాత్రం సంపాదించారు?
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ) సమస్త సమాచారాన్ని సేకరించే పనిలో టీడీపీ కూటమి ప్రభుత్వం పడింది. వారుంటున్న ఇంటి వివరాల నుంచి వాడే మొబైల్ వరకూ అన్ని వివరాలను సేకరిస్తోంది. ఇందుకోసం ఆరు పేజీలతో కూడిన ప్రశ్నావళిని అన్ని జిల్లాలకు ప్రభుత్వం పంపింది. ఎస్‌హెచ్‌జీలోని సభ్యుల రుణాలు, మొత్తం గ్రూపు ఎంతమేర రుణం తీసుకుంది? నెలవారీగా చెల్లిస్తున్న ఈఎంఐ ఎంత అనే వివరాలతో పాటు ఆయా సంఘాల్లో ఉంటున్న సభ్యుల కుటుంబాల్లోని ఇతరుల ఆదాయ వివరాలను కూడా సేకరిస్తుండటం అనుమానాలను రేకెత్తిస్తోంది.ఈ మేరకు అన్ని జిల్లాల డీఆర్డీఏ పీడీలతో పాటు పట్టణాల్లోని మెప్మా పీడీలకు కూడా ఈ ప్రశ్నావళిని ప్రభుత్వం పంపినట్లు తెలుస్తోంది. అన్ని వివరాలను సేకరించి మెప్మా, డీఆర్డీఏ పీడీల సంతకాలతో పంపాలని ప్రభుత్వం ఆదేశించింది. అయితే, కేవలం గ్రూపులకు సంబంధించిన సమాచారం, ఆయా గ్రూపుల్లో ఉన్న మహిళల సమాచారం మాత్రమే కాకుండా మొత్తం వారి కుటుంబ ఆదాయ వివరాలను సేకరిస్తున్న నేపథ్యంలో రానున్న కాలంలో ప్రభుత్వం మంజూరుచేసే సంక్షేమ పథకాల అమలులో కోత విధించేందుకేననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇల్లు నుంచి సెల్లు వరకూ..రాష్ట్రవ్యాప్తంగా 11.46 లక్షల పొదుపు సంఘాలున్నాయి. ఇందులో కోటి మందికి పైగా మహిళలు సభ్యులుగా ఉన్నారు. ఈ అన్ని గ్రూపులకు సంబంధించిన సమాచారంతో పాటు గ్రూపులో ఉన్న మహిళలందరి సమాచారాన్ని ప్రభుత్వం సేకరిస్తోంది. వారుంటున్న ఇంటి నుంచి.. వాడే సెల్‌ఫోన్ వరకూ అన్ని వివరాలను సేకరించాలని ఆదేశాలు జారీచేసింది. నివాసం ఉంటున్న ఇల్లు సొంతానిదా? అద్దెకు ఉంటున్నారా? ఇల్లు ఏ రకానికి చెందినది.. అంటే, గుడిసె, పెంకుటిల్లు, భవంతి, అపార్టుమెంట్ అనే వివరాలను సేకరిస్తోంది. ఇంటి స్థలం, ఇల్లు, ఇతరత్రా ఏమైనా ప్రభుత్వ పథకాలు పొందారా? అని కూడా సమాచారాన్ని సేకరిస్తున్నారు.అలాగే, వివిధ ప్రభుత్వ బీమా పథకాల ద్వారా లబ్ధిపొందారా? ఎంత మొత్తం పొందారు? ఇంట్లో ఎవరైనా ఉద్యోగం చేస్తున్నారా? కారు ఉందా? తదతర వివరాలను కూడా నింపాలని పేర్కొంది. ఇక సభ్యురాలి మొబైల్ నెంబరుతో పాటు ఎటువంటి ఫోన్ వినియోగిస్తున్నారు? డిజిటల్ లావాదేవీలు నిర్వహిస్తున్నారా? ఎంత మొత్తం నిర్వహిస్తున్నారు లాంటి వివరాలను కూడా ఇవ్వాల్సిందేనని ఆదేశాలు జారీచేసింది. ఒకవేళ ఎస్‌హెచ్‌జీ ద్వారా ఏమైనా స్వయం ఉపాధి పొందుతుంటే.. తద్వారా వచ్చే ఆదాయం ఎంత? జీఎస్టీ నెంబరు వివరాలను కూడా సేకరిస్తున్నారు.సంక్షేమ పథకాల కోతకేనా!?కేవలం ఎస్‌హెచ్‌జీలో ఉంటున్న మహిళల ఆదాయ వివరాలతో ఆగకుండా కుటుంబంలోని ఇతర సభ్యుల ఆదాయ వివరాలను కూడా సేకరిస్తున్నారు. అలాగే, పొదుపు మహిళలు స్వయం ఉపాధి ద్వారా పొందుతున్న ఆదాయంతో పాటు కుటుంబంలోని సభ్యుల ఆదాయాన్ని కూడా తెలుసుకోనున్న నేపథ్యంలో సంక్షేమ పథకాల కోసం సేకరిస్తున్నారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా సేకరిస్తున్న వివరాలన్నీ ప్రభుత్వానికి చేరితే ఇస్తున్న కొద్దిపాటి సంక్షేమానికి కూడా కోతలు పెడతారనే భయాందోళనలను ఎస్‌హెచ్‌జీ సభ్యులు వ్యక్తంచేస్తున్నారు. అంతేకాక.. ఇంట్లో వాడుతున్న గ్యాస్ నెంబరును కూడా ఆర్పీల ద్వారా సమాచారాన్ని సేకరిస్తుండటంతో వారు కలవరపడుతున్నారు. ఈ మొత్తం సమాచారాన్ని జిల్లాల మెప్మా, డీఆర్డీఏ పీడీలు సేకరించి ఇవ్వాలని స్పష్టమైన ఆదేశాలు జారీకావడంతో వారు ఈ సమాచారాన్ని సేకరించే పనిలో పడ్డారు. -
ఏయ్ ఎక్కడికిపోయావ్ రా..?
సాక్షి, కాకినాడ ప్రతినిధి: అది కాకినాడ నగరంలోని మెక్లారిన్ హైస్కూల్.. శంకర్‌దాదా సినిమాలోలా ఆ స్కూల్‌కు ఓ ఆస్పత్రి బోర్డు తగిలించారు. ఇక అంబులెన్స్‌లు ఇతరత్రా వాటిని కూడా అక్కడ ఏర్పాటు చేసి.. ఆస్పత్రి వాతావరణాన్ని తలపించేలా సిద్ధం చేశారు. ఏంటని ఆరా తీస్తే.. అది విజయదేవరకొండ హీరోగా మైత్రి ప్రొడక్షన్ నిర్మిస్తున్న ‘డియర్ కామ్రేడ్’ సినిమా కోసం వేసిన సెట్టింగ్ అని తేలింది. కట్ చేస్తే.. ఇంతలో అక్కడికి ప్రాజెక్టు డైరెక్టర్ డీఆర్డీఏ, విశాఖపట్నం పేరున్న బోర్డుతో నలుపురంగులో ఉన్న ఓ వాహనం వచ్చి ఆగింది. అందులో నుంచి ఓ వ్యక్తి దిగారు.. మంచి టిప్‌టాప్‌గా ఉన్న ఆయనకు అస్సలు ఎండతగలకుండా పక్కన ఓ దఫేదారు గొడుగుపట్టుకుని ఆయనను అనుసరించాడు. ఆయన నేరుగా ఆస్పత్రిలా వేసిన సెట్టింగ్‌లోకి వెళ్లారు. మళ్లీ కట్ చేస్తే.. కొంత సేపటికి లోపలకు వెళ్లిన ఆయన చాలా కోపంగా బయటకి వచ్చారు. ‘‘ఏయ్ ఎక్కడికి పోయావ్రా?.. నేను నిన్ను వెతుక్కోవాలా.. ఏం నేను రావాలా వెనక్కి మళ్లీ సెల్ తీసుకోవడానికి అంటూ (రాయడానికి వీల్లేది తిట్లతో) ఆ దఫేదార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు. అంతే పాపం ఆ దఫేదార్ తెల్లముఖం వేసి.. ఆయన వెంట కుర్చీ పట్టుకుని నడుచుకుంటూ వెళ్లాడు.. ఇంతకీ ఆయన ఎవరని ఆరా తీస్తే.. ఆయన విశాఖ జిల్లా డీఆర్డీఏ పీడీ సత్యశ్రీనివాస్ అని.. ఆయనకు సినిమాల్లో నటించడం హాబీ అని తేలింది. విశాఖ డీఆర్డీఏ పీడీ సత్యశ్రీనివాస్ తన నోటికి పనిచెప్పారు. తన వెంట ఉండే దఫేదార్‌ను నానా బూతులు తిడుతూ దుర్భాషలాడారు. అంతేకాదు తన సొంత పనులకు ప్రభుత్వ వాహనాలను, సిబ్బందిని వినియోగిస్తూ మీడియాకు చిక్కారు. గతంలోనూ ఈయన పలు వివాదాస్పద వ్యవహారాల్లోనూ చిక్కుకొని విమర్శలు ఎదుర్కొన్నారు. తాజాగా కాకినాడలో ఓ సినిమా చిత్రీకరణలో పాల్గొనేందుకు ఆయన ఆదివారం వచ్చారు. అయితే నేరుగా ప్రభుత్వ వాహనంలోనే ఆయన తన దఫేదార్, ప్రభుత్వ డ్రైవర్‌ను వెంట తీసుకువచ్చారు. సినిమా చిత్రీకరణ జరిగినంత సేపు సిబ్బంది ఆయన వెంటే ఉన్నారు. ఆయనను నీడలా వెంటపెట్టుకునే ఉన్నారు. ఒకానొక దశలో దఫేదార్ ఆయన వెంట లేకపోవడంతో పీడీకి చిర్రెత్తుకొచ్చింది. అంతే తన నోటికి పని చెప్పారు. ఇష్టానుసారంగా దఫేదార్‌పై అందరూ చూస్తుండగానే విరుచుకుపడ్డారు. ఆయన దుర్భాషలాడిన వీడియోలు ప్రస్తుతం వైరల్ అయ్యాయి. డీఆర్డీఏ పీడీ సత్యశ్రీనివాస్, షూటింగ్ స్పాట్లో ప్రభుత్వ వాహనం జిల్లా పంచాయతీ అధికారి కూడా.. మరోవైపు తూర్పుగోదావరి జిల్లా పంచాయతీ ఇన్చార్జ్ అధికారి ఆనంద్ కూడా ఈ సినిమా షూటింగ్లో ఉన్న డీఆర్డీఏ పీడీని కలిసేందుకు మెక్లారిన్ హైస్కూల్‌కు వచ్చారు. ఆయన కూడా ప్రభుత్వ వాహనంలోనే తన సిబ్బందిని వెంట పెట్టుకుని వచ్చారు. సినిమా చిత్రీకరణలో సుమారు రెండు గంటల పాటు అక్కడే గడిపారు. పీడీ సినిమా చిత్రీకరణలో ఉండడంతో ఆయన కోసం అక్కడే వేచి ఉన్నారు. అయితే విశాఖ డీఆర్డీఏ పీడీ విషయాన్ని ఆయన వద్ద ప్రస్తావించగా.. ‘‘నాకు సత్యశ్రీనివాస్ స్నేహితుడని, అందుకే ఆయనను కలవడానికి వచ్చాను’’ అని సమాధానమచ్చారు. దఫేదార్‌ను దుర్భాషలాడిన విషయం తనకు తెలియదన్నారు. నిబంధనల ప్రకారం.. ఏ అధికారైనా తన వ్యక్తిగత పనులకు ప్రభుత్వ వాహనాలను, సిబ్బందిని వినియోగించకూడదు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయినా అధికారులు ఇలా యథేచ్ఛగా ప్రభుత్వ అధికారాలను, వాహనాలను, దుర్వినియోగం చేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాదు తన కిందిస్థాయి సిబ్బందిని ఇలా దుర్భాషలాడడంపైనా పలువురు మండిపడుతున్నారు. షూటింగ్ కోసం వచ్చిన వ్యక్తి ఇలా ప్రభుత్వ వాహనాలను వాడడం ఏంటని పలువురు ఆశ్చర్యపోయారు. -
స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలి
భీమిని : భీమిని, కన్నెపల్లి మండలాల్లోని గ్రామాలను స్వచ్ఛ గ్రామాలుగా తీర్చిదిద్దాలని డీఆర్డీఏ పీడీ శంకర్ సూచించారు. మంగళవారం ఉదయం భీమిని, కన్నెపల్లి మండలాల్లోని రాంపూర్, కన్నెపల్లి గ్రామాల్లో నిర్మించిన మరుగుదొడ్లను ఆయన పరిశీలించారు. మరుగుదొడ్ల ఆవశ్యకతను ప్రజలకు వివరించారు. బహిరంగ మలవిసర్జన ఉండకూడదని సూచించారు. ఈ నెల 31లోపు గ్రామాల్లో ప్రతి ఇంటికీ మరుగుదొడ్లు ఉండేలా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మండల అధికారులకు సూచించారు. సర్పంచ్‌లు, ప్రజాప్రతినిధులు ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఆయన వెంట వైస్‌ఎంపీపీ గడ్డం మహేశ్వర్‌గౌడ్, ఇన్చార్జి ఎంపీడీవో రాధాకృష్ణ తదితరులు ఉన్నారు. -
పనిచేయకపోతే పంపించేస్తా
అనంతపురం టౌన్: పని చేయని వారిని ఇంటికి పంపేందుకు కూడా వెనుకాడేది లేదని డీఆర్డీఏ పీడీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఎవరైనా సరే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదన్నారు. బుధవారం ఆయన జిల్లాలోని ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఎంలు, ఇతర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని లక్ష్యంగా ఉంచుకున్నామన్నారు. ఇప్పటి వరకు 558 కిలోమీటర్ల పరిధిలో 2 లక్షల 16 వేల గుంతలు తవ్వి లక్షకు పైగా మొక్కలు నాటామన్నారు. అటవీశాఖ నుంచి ఆరు అడుగులకు పైగా ఎత్తున్న మొక్కలు సేకరించినట్లు చెప్పారు. ఇంకా మొక్కలు అవసరం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు కలెక్టర్ నుంచి అనుమతి పొందినట్లు చెప్పారు. అందరూ సమన్వయంతో పని చేసి గుంతలు తీయడం, మొక్కలు నాటడంపై దృష్టిసారించాలన్నారు. 6 వేల ఎకరాల్లో పండ్లతోటలు జిల్లా వ్యాప్తంగా 6 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1,500 ఎకరాల్లో పండ్ల తోటలు సాగులో ఉన్నా... ఆన్లైన్లో 950 ఎకరాలు మాత్రమే నమోదు చేశారని, మిగిలినవి కూడా ఆన్లైన్ చేయాలన్నారు. పెద్దపప్పూరు, శింగనమల, నల్లమాడ మండలాలు పండ్ల తోటల సాగు చివరి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. రెండ్రోజుల్లో పరిస్థితిలో మార్పు రాకుంటే అక్కడికి కొత్త అధికారులను పంపాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఎన్పీఏ సంఘాలను గుర్తించి వన్‌టైం సెటిల్మెంట్ కోసం తీర్మాణం చేసి బ్యాంకుల్లో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం వారం పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు 50 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, అన్నింటికీ జియోట్యాగింగ్ చేయించాలన్నారు. ప్రధానంగా చంద్రన్న బీమాలో నమోదైన వారిని వివరాలను పరిశీలించాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త వాళ్లను నమోదు చేయించాలన్నారు. తాజాగా ఔట్సోర్సింగ్ కింద పని చేస్తూ ఈపీఎఫ్ లేని వాళ్లందరినీ చంద్రన్న బీమాలో చేర్చేలా ఆదేశాలు అందినట్లు చెప్పారు. ఈ క్రమంలో అందరూ చంద్రన్న బీమాపై అవగాహన కల్పించాలన్నారు. కాన్ఫరెన్స్ సందర్భంగా కొందరు ఉద్యోగులు అందుబాటులోకి రాకపోవడంపై పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
డీఆర్డీఏ పీడీపై ఉద్యోగుల తిరుగుబాటు
- ఏఓను సెర్ప్‌కు సరెండర్ చేయడంపై ఆగ్రహం - అధికారి తిట్లు భరించలేమని ఆవేదన కర్నూలు(హాస్పిటల్): ప్రతి చిన్న విషయానికి గట్టి గట్టిగా కేకలు వేయడం, అరవడం, కింది స్థాయి ఉద్యోగులను దూషించడం చేస్తున్నారంటూ డీఆర్డీఏ పీడీ వై. రామకృష్ణపై ఆ శాఖ ఉద్యోగులు తిరుగుబాటు చేసినంత పనిచేశారు. మంగళవారం సాయంత్రం ఉద్యోగులంతా కలిసి వెళ్లి సదరు అధికారిని నిలదీశారు. ఆ శాఖ ఏఓ షరీఫ్‌ను సెర్ప్ సీఈఓకు సరెండర్ చేస్తారన్న ప్రచారం జరగడంతో గందరగోళం నెలకొంది. సామాజిక భద్రత పింఛన్ల విషయంలో రాష్ట్రంలో అన్ని జిల్లాల కంటే కర్నూలు వెనుకబడి ఉందన్న కారణంతో నెలరోజుల క్రితం ఏఓ షరీఫ్‌ను పీడీ రామకృష్ణ మందలించారు. దీంతో కలత చెందిన షరీఫ్ ఎలాగూ రంజాన్ పండుగ ఉంది కాబట్టి 20 రోజుల పాటు సెలవుపై వెళ్లిపోయారు. అయితే మధ్యలోనే పీడీ వై. రామకృష్ణ కలుగజేసుకుని వెనక్కి పిలిపించారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య దూరం మరింత పెరిగింది. మూడురోజులుగా ఏఓ షరీఫ్ విధుల్లో చేరేందుకు రావడం, పీడీ చేర్చుకోకపోవడం జరుగుతోంది. విషయంపై మంగళవారం పలువురు ఉద్యోగ సంఘాల నాయకులు, ఉద్యోగులు పీడీని కలిశారు. అయినా పీడీ వై. రామకృష్ణ శాంతించకుండా ఇప్పటికే తాను సెర్ఫ్ సీఈఓకు లేఖ రాశానని, అక్కడి నుంచి వచ్చే ఆదేశాలను బట్టి నిర్ణయం తీసుకుంటానని, ఇప్పటికిప్పుడు షరీఫ్‌ను విధుల్లో తీసుకోలేనని తెగేసి చెప్పినట్లు తెలిసింది. దీంతో కార్యాలయ ఉద్యోగులు తీవ్రంగా మండిపడుతున్నారు. పీడీ తన వైఖరి మార్చుకోకపోతే సామూహిక సెలవులోకి వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. విషయమై పీడీని వివరణ కోరగా పింఛన్ల పంపిణీ విషయంలో జిల్లా వెనుకబడి ఉందని ఉన్నతాధికారుల నుంచి ఒత్తిడి ఉందని, ఈ నేపథ్యంలో ఆ విషయం చెప్పి మందలించిన మాట వాస్తవమేనన్నారు. పనిచేయాలని సూచిస్తే సెలవుపై వెళ్తే తానే చేయలేనని తెలిపారు. -
నేటి నుంచి సీబీఐటీ, వీబీఐటీలో ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ మీట్
చాపాడు: మండలంలోని పల్లవోలు వద్దగల శ్రీ చైతన్యభారతి, విజ్ఞాన భారతి ఇంజనీరింగ్ కాలేజీల్లో శనివారం నుంచి మూడు రోజుల పాటు జిల్లా స్థాయి గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్ నిర్వహిస్తున్నట్లు సీబీఐటీ, వీబీఐటీ కరస్పాండెంట్ వి.జయచంద్రారెడ్డి తెలిపారు. క్రీడలను ఉదయం 9.30 గంటలకు డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. వాలీబాల్, కబడ్డీ, టేబుల్ టెన్నిస్, షటిల్, లాంగ్ జంప్, షాట్‌పుట్, డిస్కస్ త్రో విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నట్లు చెప్పారు. -
ఉద్యోగాలకు 45 మంది ఎంపిక
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లా గ్రామీణాభివృద్ది సంస్థ, కడప ఈజీఎం ఆధ్వర్యంలో నవత ట్రాన్స్‌పోర్టులో శనివారం ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించామని డీఆర్డీఏ పీడీ అనిల్‌కుమార్‌రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్లర్క్, మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ ఉద్యోగాలకు 124 మంది హాజరు కాగా, 45 మంది ఎంపికయ్యారన్నారు. ఎంపికైనవారు ఈనెల 5వ తేదీన కడపలోని నవత ట్రాన్స్‌పోర్టులో రిపోర్టు చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో కంపెనీ ప్రతినిధి దివాకర్‌రావు, ఏపీఎం నిరంజన్, ఈజీఎం సిబ్బంది మహేష్, పృథ్విరాజ్ తదితరులు పాల్గొన్నారు. -
డీఆర్డీఏ పీడీ బాధ్యతల స్వీకరణ
శ్రీకాకుళం పాతబస్టాండ్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పథక సంచాలకులుగా డాక్టర్ జీసీ కిషోర్ కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. నెల రోజులుగా ఈ స్థానం ఖాళీగా ఉంది. ఇక్కడ పీడీగా పనిచేసిన ఎస్.తనూజారాణిని మాతృశాఖకు బదిలీ అయిన విషయం విధితమే. ఇంతవరకు ఇన్చార్జి బాధ్యతలను జేసీ–2 పి.రజనీ కాంతారావు నిర్వహించారు. ఆయన నుంచి కిషోర్ కుమార్ బాధ్యతలు తీసుకున్నారు. కిషోర్‌కుమార్ రెవెన్యూ శాఖలో స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో ఉన్నారు. 2007 గ్రూప్ వన్ బ్యాచ్‌కు చెందిన కిషోర్ కుమార్ విశాఖపట్నంలో పనిచేశారు. ఇటీవల కొంత కాలం ఖాళీగా ఉన్న తరువాత ప్రభుత్వం ఇక్కడ పీడీగా నియమించింది. బాధ్యతలు స్వీకరణ అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా అందజేసే పథకాలు, మహిళా ప్రగతి, ప్రభుత్వ సంక్షేమాలు అందరికీ అందేవిధంగా పనిచేస్తానన్నారు. మహిళలను ఆర్థికంగా బలమైన శక్తిగా మార్చేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, సంఘాలను బలోపేతం చేస్తానని చెప్పారు. మంగళవారం అన్ని స్థాయిల అధికారులతో సమావేశం నిర్వహించి, జిల్లాలోని పరిస్థితులు తెలుసుకొని మంచి పాలన అందించేందుకు కృషిచేస్తామన్నారు. -
హరితహారంపై నిర్లక్ష్యం వీడాలి
డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి కుల్కచర్ల: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న హరితహారంపై అధికారులు నిర్లక్ష్యం వీడాలని డీఆర్డీఏ పీడీ, మండల ప్రత్యేకాధికారి సర్వేశ్వర్‌రెడ్డి అన్నారు.మంగళవారం మండల అభివృద్ధి కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో తప్పకుండా 40 వేల మొక్కలు నాటాలని సూచించారు.ముఖ్యంగా సెక్టోరియల్ అధికారులు రోజూ పర్యవేక్షణ చేయాలని సూచించారు. గ్రామాల్లో ప్రభుత్వ, అసైన్డ్, పట్టా భూముల్లో మొక్కలు నాటాలని సూచించారు. గ్రామాల్లో మొక్కలు నాటేందుకు గుంతలు తీయించాలని ఉపాధిహామీ అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్‌బాబు, ఏపీఓ చారి, ఏఓ పాండు, ఏపీఎం శోభ, అటవీశాఖ అధికారి పర్వేజ్ ,విద్యాధికారి అబీబ్‌హమ్మద్, డిప్యూటీ తహసీల్దార్ అశోక్, ఆర్ఐ యాదయ్య పాల్గొన్నారు. -
తనిఖీల్లేవ్!
♦ ఆసరా పెన్షన్లలో సామాజిక తనిఖీలు బంద్ ♦ ఏడాది కాలంగా నిలిచిపోయిన ప్రక్రియ ♦ పరిశీలన లేక పెరుగుతున్న అవకతవకలు ♦ 42 మంది పింఛన్లు కాజేసిన కార్యదర్శులు ♦ చర్యలకు సిఫారసు చేసిన డీఆర్డీఏ పీడీ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆసరా (సామాజిక భద్రత పింఛన్ల పథకం)లో అవకతవకల గుర్తింపునకు తలపెట్టిన సామాజిక తనిఖీల ప్రక్రియకు సర్కారు మంగళం పాడింది. పథకం ప్రారంభంలో ఒకట్రెండు చోట్ల తనిఖీలు చేసిన అధికారులు.. ఆ తర్వాత జాడలేకుండా పోయారు. దీంతో ఏడాది కాలంగా ఈ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీలు జరగలేదు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సామాజిక తనిఖీలను తప్పనిసరి. ఇందులో భాగంగా ఎన్ఆర్ఈజీఏ, ఐడబ్ల్యూఎంఏ కార్యక్రమాలపై క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయి. కానీ సామాజిక భద్రత కింద ఇచ్చే పింఛన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ తనిఖీలకు సంబంధించి ఆదేశాల జారీని అటకెక్కించింది. దీంతో ఆసరా పథకంలో అక్రమాలు పెరుగుతున్నాయి. జిల్లాలో ఆసరా పథకం ద్వారా 2,99,278 మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి నెలకు రూ. 37.5 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే పింఛన్ల పంపిణీలో అక్రమాలపై క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదుల ఆధారంగా పరిశీలన చేపట్టి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆ మేరకు నిగ్గుతేల్చుతోంది. అయితే సామాజిక తనిఖీల ప్రక్రియలో గ్రామస్థాయిలో పరిశీలన చేపడతారు. లబ్ధిదారుల ముందే పరిశీలన చేపట్టి.. పూర్తివిషయాలను వెల్లడిస్తారు. అవకతవకలు జరిగినట్లు తేలితే వెంటనే వారిపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఏడాది కాలంగా సామాజిక తనిఖీలు తెరపైకి రాకపోవడంతో పథకం అమలులో పర్యవేక్షణ గాడితప్పింది. నాలుగు మండలాల్లో వెయ్యికిపైగా.. ఆసరా పింఛన్ల పథకం కింద 2014 సెప్టెంబర్ నుంచి లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో 2014-15 వార్షికం చివరల్లో ఆసరాపై సామాజిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో నాలుగు మండలాల్లోని అన్నిగ్రామాల్లో ఈ తనిఖీలు నిర్వహించగా.. సుమారు వెయ్యికిపైగా అవకతవకల్ని గుర్తించారు. ఈమేరకు సొమ్ము రికవరీ చేయాల్సిందిగా డీఆర్‌డీఏను ఆడిట్ అధికారులు సూచించారు. అయితే అన్ని మండలాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా.. అనుకోకుండా ఈ తనిఖీల ప్రక్రియను నిలిచిపోయింది. ఆసరాలో అక్రమాలపై ఇటీవల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో స్పందించిన అధికారులు కొన్ని గ్రామాల్లో క్రమ పద్ధతిలో సర్వే నిర్వహించారు. ఇందులో 42 మంది లబ్ధిదారులు మరణించినప్పటికీ.. వారి పింఛన్ డబ్బులు స్థానిక పంచాయతీ కార్యదర్శులు డ్రా చేస్తున్నట్లు డీఆర్డీఏ అధికారులు గుర్తించారు. దీంతో వారిపై చర్యలకు సిఫార్సు చేస్తూ డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి కలెక్టర్‌కు లేఖ రాశారు. -
లక్ష్యం మించి డ్వాక్రా రుణాలు
మాకవరపాలెం : జిల్లాలో లక్షా ్యన్ని మించి రూ.443 కోట్ల రుణాలు డ్వాక్రా మహిళలకు అందజేశామని డీర్‌డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ తెలిపారు. రూ.380 కోట్లు లక్ష ్యంకాగా రూ.443కోట్లు అందజేశామన్నారు. మండల పరిషత్ కార్యాలయంలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. జిల్లాలోని మొత్తం 38 వేల డ్వాక్రా సంఘాలకు 1999 నుంచి ఇప్పటి వరకు రూ.1600 కోట్లు రుణాలిచ్చామన్నారు. ప్రస్తుతం వీరంతా రూ. 593కోట్లు బ్యాంకులకు చెల్లించాలన్నారు. వీటిలో మొండి బకాయిలు రూ.16 కోట్లు ఉన్నాయన్నారు. జిల్లాలో 3.19లక్షల మందికి పింఛన్లుగా ప్రతి నెలా రూ.8కోట్లు పంపిణీ చేస్తున్నామన్నారు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఆధార్ సీడింగ్ 1.08లక్షల మంది పెన్షన్‌దారులకు పూర్తయిందన్నారు. బయోమెట్రిక్‌లో భాగంగా ఇంకా 46వేల మంది నుంచి వేలిముద్రలు సేకరించాల్సి ఉందన్నారు. వేలి ముద్రలు పడని వారుంటే వారి బంధువుల వేలి ముద్రలు ఇవ్వవచ్చన్నారు. నెలాఖరుకు ఈ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. చనిపోయిన 3450మంది పింఛనుదారుల పేర్లను తొలగించామన్నారు. బోగస్ పింఛన్లను తొలగించేందుకు ఆధార్ సీడింగ్ చేపడుతున్నామన్నారు. కొత్తగా 29,600 మంది పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారని వివరించా రు. డ్వాక్రా సంఘాల సభ్యుల పిల్లలయిన 54వేల మంది విద్యార్థులు ఒక్కొక్కరికీ రూ. 1200చొప్పున ఏటా రూ.5.66కోట్లు అందజేస్తున్నామన్నారు. జనశ్రీ పథకంలో భాగంగా జిల్లా వ్యాప్తం గా లక్ష మంది ఎస్సీ,ఎస్టీలను ఈ పథకంలో చేర్చడమే లక్ష ్యమన్నారు. ఒక్కొక్కరు రూ.15 చెల్లించి ఈ బీమా పథకంలో చేరితే సాధారణ మరణానికి రూ. 30వేలు, ప్రమాదవశాత్తూ మృతి చెందితే రూ.75వేలు అందుతుందన్నారు. వచ్చేనెల 16నుంచి 23వ తేదీ వరకు ఐకేపీ ఆధ్వర్యంలో బీమా వారోత్సవాలు నిర్వహణకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. ఇందులో భాగంగా విద్యార్థులకు ష్కాలర్‌షిప్‌లను పంపిణీ చేస్తామన్నారు. కార్యక్రమంలో ఐకేపీ ఇన్సూరెన్స్ విభాగం ఏపీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. బైక్ ఎక్కిన పీడీ గొలుగొండ : డ్వాక్రా మహిళలు సమావేశమై పొదుపు, బకాయిలు తీర్చేపద్ధతులపై చర్చించుకోవాలని డీఆర్డీఏ పీడీ సత్యసాయి శ్రీనివాస్ పేర్కొన్నారు. మండలంలోని చీడిగుమ్మల పంచాయతీ యరకంపేటలో మంగళవారం డ్వాక్రా మహిళలతో సమావేశమయ్యారు. ఈ ప్రాంతంలో ఎన్ని సంఘాలున్నాయి? ఎంత మేర రుణం తీర్చారు? తదితర విషయాలు తెలుసుకున్నారు. విధిగా వారానికి ఒకసారి సమావేశం కావాలన్నారు. మద్యపాన నిషేధంపై కూడా చర్చించుకోవాలన్నారు. ఉపాధి హామీలో కూరగాయల సాగు గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం మండలంలో మారుమూల డొంకాడ వెళ్లి, అక్కడి ఐకేపీ బాలబడి కేంద్రాన్ని పరిశీలించారు. ఐదేళ్లలోపు చిన్నారులకు ఆటపాటలతో చదువుపై ఆసక్తి కలిగించే విధానాన్ని అడిగి తెలుసుకున్నారు. గ్రామానికి రహదారి సౌకర్యం లేకపోవడంతో మూడు కిలోమీటర్లు ద్విచక్ర వాహనం, మరో రెండు కిలోమీటర్లు కాలినడకన గ్రామానికి చేరుకున్నారు. గిరిజనులు తాగునీరు, విద్యుత్, రోడ్డు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని పీడీని కోరారు. కార్యక్రమంలో ఎంపీపీ సుర్ల లక్ష్మీనారాయణ, బాలబడుల జిల్లా ఇన్చార్జి గోవిందరావు, డివిజన్ ఇన్చార్జి కొండలరావు,ఐకేపీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఐకేపీ మహిళపై డీఆర్డీఏ పీడీ అత్యాచారం?
-
ఐకేపీ మహిళపై డీఆర్డీఏ పీడీ అత్యాచారం?
పశ్చిమగోదావరి జిల్లా డీఆర్డీఏ పీడీ శివశంకర్‌పై అత్యాచారం ఆరోపణలు వచ్చాయి. శివశంకర్ తనపై అత్యాచారం చేశారంటూ ఓ మహిళ కోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశంతో త్రీటౌన్ పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో పీడీ శివశంకర్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలికి ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో వైద్య పరీక్ష లు నిర్వహించి నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ హరికృష్ణను న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి పి.లక్ష్మీశారద ఆదేశించారు. నిడదవోలు మండలం అట్లపాడు గ్రామానికి చెందిన ఓ వివాహిత (32) ఐకేపీ అధ్యక్షురాలిగా పనిచేస్తోంది. ఏలూరు సమీపంలోని వట్లూరు టీటీడీసీలో జరిగే సమావేశానికి హాజరుకావాలని ఆమెకు ఫోన్ రావడంతో నిడదవోలు ఐకేపీ కార్యాలయంలో పని ముగించుకుని సాయంత్రం ఏలూరు చేరుకుని, అక్కడ నుంచి ఆటోలో టీటీడీసీకి వెళ్లింది. అక్కడ పని పూర్తయ్యేసరికి రాత్రి 10.15 కావడంతో రాత్రికి అక్కడే పడుకుని ఉదయం వెళ్లిపోవాలని భావించింది. అయితే, అక్కడకు వచ్చిన నైట్ వాచ్మెన్ బాబూరావు ఆమెను డీఆర్డీఏ పీడీ శివశంకర్, గెస్ట్‌హౌస్‌లో ఉన్న తన రూమ్‌కు రమ్మన్నారని చెప్పాడు. వివాహిత అక్కడకు వెళ్లగా ఆయన ఆమెను రూమ్‌లోకి బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్టు బాధితురాలు తెలిపింది. తెల్లవారుజామున 4.30 గంటల సమయంలో తప్పించుకుని బయటకు వచ్చి,ఉదయాన్నే తనపై అత్యాచారం జరిగిన విషయాన్ని అదే సెంటర్లోని ఉద్యోగులైన ఇందిర, జమునలకు తెలిపింది. తనకు జరిగిన అన్యాయంపై జిల్లా న్యాయ సేవాధికార సంస్థను ఆశ్రయించింది. బాధితురాలిని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. త్రీటౌన్ పోలీసులు డీఆర్డీఎ పీడీ కె.శివశంకర్‌పై ఐపీసీ సెక్షన్ 176(బి) కింద కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. -
ఐకేపీ ఉద్యోగుల సమ్మె విరమణ
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: డీఆర్డీఏ పీడీ పద్మజారాణి వైఖరికి నిరసనగా ఐకేపీ ఉద్యోగులు వారం రోజులుగా సామూహిక సెలవు పెట్టి చేస్తున్న సమ్మెను మంగళవారం విరమించారు. పీడీ వెంటనే రాజీనామా చేయాలని, ఉద్యోగుల పట్ల తన వైఖరి మార్చుకోవాలని వారు డిమాండ్ చేసినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఎవరేం చేసుకున్నా తనకు నష్టం లేదన్నట్టుగా వ్యవహరించారు. దీంతో ఆమె ఇక మెట్టు దిగదని గ్రహించిన ఉద్యోగులు.. సెర్ప్ సీఈవో హామీతో పట్టువీడక తప్పలేదు. ఎట్టకేలకు బుధవారం నుంచి విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించారు. సెర్ప్ సీఈఓ రాజశేఖర్ ఆహ్వానం మేరకు ఐకేపీ ఉద్యోగ సంఘాల నాయకులు సంపత్ తదితరులు సోమవారం హైదరాబాదుకు వెళ్లి చర్చలు జరిపారు. తాను ఉద్యోగులకు పూర్తిగా సహకరిస్తానని, వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించేలా చూస్తానని ఆయన ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నామని ఉద్యోగులు తెలిపారు. రఘునాథపాలెంలోని స్త్రీశక్తి భవనంలో మంగళవారం జరిగిన డీఆర్డీఏ-ఐకేపీ ఉద్యోగుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు. సమస్య పరిష్కరించకుంటే మరో ఉద్యమం... ఐకేపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమానికి సిద్ధం అవుతామని టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఖాజామియా, కార్యదర్శి రత్నాకర్ హెచ్చరించారు. ఐకేపీ ఉద్యోగుల సమావేశానికి హాజరైన వారు తొలుత సీపీవోతో జరిగిన చర్చల గురించి సంపత్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులకు సీఈవో ఇచ్చిన హామీ అమలయ్యేలా చూడాలని కోరారు. లేకుంటే మళ్లీ ఉద్యమించక తప్పదన్నారు. ఐకేపీ ఉద్యోగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఐకేపి, వివిధ సంఘాల నాయకులు దాసు, వెంకటేశ్వర్లు, అనూరాధ, జ్యోతి, సీతారాములు, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.