అనంతపురం టౌన్: పని చేయని వారిని ఇంటికి పంపేందుకు కూడా వెనుకాడేది లేదని డీఆర్‌డీఏ పీడీ వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఎవరైనా సరే విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే వేటు తప్పదన్నారు. బుధవారం ఆయన జిల్లాలోని ఏరియా కోఆర్డినేటర్లు, ఏపీఎంలు, ఇతర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో వెయ్యి కిలోమీటర్ల మేర అవెన్యూ ప్లాంటేషన్ చేయాలని లక్ష్యంగా ఉంచుకున్నామన్నారు. ఇప్పటి వరకు 558 కిలోమీటర్ల పరిధిలో 2 లక్షల 16 వేల గుంతలు తవ్వి లక్షకు పైగా మొక్కలు నాటామన్నారు. అటవీశాఖ నుంచి ఆరు అడుగులకు పైగా ఎత్తున్న మొక్కలు సేకరించినట్లు చెప్పారు. ఇంకా మొక్కలు అవసరం కావడంతో ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసేందుకు కలెక్టర్ నుంచి అనుమతి పొందినట్లు చెప్పారు. అందరూ సమన్వయంతో పని చేసి గుంతలు తీయడం, మొక్కలు నాటడంపై దృష్టిసారించాలన్నారు.
6 వేల ఎకరాల్లో పండ్లతోటలు
జిల్లా వ్యాప్తంగా 6 వేల ఎకరాల్లో పండ్ల తోటల సాగు చేపట్టనున్నట్లు చెప్పారు. ఇప్పటి వరకు 1,500 ఎకరాల్లో పండ్ల తోటలు సాగులో ఉన్నా... ఆన్‌లైన్‌లో 950 ఎకరాలు మాత్రమే నమోదు చేశారని, మిగిలినవి కూడా ఆన్‌లైన్ చేయాలన్నారు. పెద్దపప్పూరు, శింగనమల, నల్లమాడ మండలాలు పండ్ల తోటల సాగు చివరి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. రెండ్రోజుల్లో పరిస్థితిలో మార్పు రాకుంటే అక్కడికి కొత్త అధికారులను పంపాల్సి ఉంటుందని హెచ్చరించారు.
ఎన్‌పీఏ సంఘాలను గుర్తించి వన్‌టైం సెటిల్‌మెంట్ కోసం తీర్మాణం చేసి బ్యాంకుల్లో ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకోసం వారం పాటు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలన్నారు. ఇప్పటి వరకు 50 వేల వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, అన్నింటికీ జియోట్యాగింగ్ చేయించాలన్నారు. ప్రధానంగా చంద్రన్న బీమాలో నమోదైన వారిని వివరాలను పరిశీలించాలన్నారు. సెప్టెంబర్ 1 నుంచి కొత్త వాళ్లను నమోదు చేయించాలన్నారు. తాజాగా ఔట్‌సోర్సింగ్ కింద పని చేస్తూ ఈపీఎఫ్ లేని వాళ్లందరినీ చంద్రన్న బీమాలో చేర్చేలా ఆదేశాలు అందినట్లు చెప్పారు. ఈ క్రమంలో అందరూ చంద్రన్న బీమాపై అవగాహన కల్పించాలన్నారు. కాన్ఫరెన్స్ సందర్భంగా కొందరు ఉద్యోగులు అందుబాటులోకి రాకపోవడంపై పీడీ ఆగ్రహం వ్యక్తం చేశారు.
పనిచేయకపోతే పంపించేస్తా
Published Wed, Aug 30 2017 10:50 PM | Last Updated on Tue, Sep 12 2017 1:23 AM
Advertisement
Advertisement