
ఐకేపీ ఉద్యోగుల సమ్మె విరమణ
ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణి వైఖరికి నిరసనగా ఐకేపీ ఉద్యోగులు వారం రోజులుగా సామూహిక సెలవు పెట్టి చేస్తున్న సమ్మెను మంగళవారం విరమించారు. పీడీ వెంటనే రాజీనామా చేయాలని, ఉద్యోగుల పట్ల తన వైఖరి మార్చుకోవాలని వారు డిమాండ్ చేసినప్పటికీ ఆమె ఏమాత్రం వెనక్కు తగ్గలేదు. ఎవరేం చేసుకున్నా తనకు నష్టం లేదన్నట్టుగా వ్యవహరించారు. దీంతో ఆమె ఇక మెట్టు దిగదని గ్రహించిన ఉద్యోగులు.. సెర్ప్ సీఈవో హామీతో పట్టువీడక తప్పలేదు. ఎట్టకేలకు బుధవారం నుంచి విధుల్లోకి చేరుతున్నట్లు ప్రకటించారు.
సెర్ప్ సీఈఓ రాజశేఖర్ ఆహ్వానం మేరకు ఐకేపీ ఉద్యోగ సంఘాల నాయకులు సంపత్ తదితరులు సోమవారం హైదరాబాదుకు వెళ్లి చర్చలు జరిపారు. తాను ఉద్యోగులకు పూర్తిగా సహకరిస్తానని, వీలైనంత త్వరగా సమస్య పరిష్కరించేలా చూస్తానని ఆయన ఇచ్చిన హామీ మేరకు సమ్మె విరమిస్తున్నామని ఉద్యోగులు తెలిపారు. రఘునాథపాలెంలోని స్త్రీశక్తి భవనంలో మంగళవారం జరిగిన డీఆర్‌డీఏ-ఐకేపీ ఉద్యోగుల సమావేశంలో ఈ విషయం వెల్లడించారు.
సమస్య పరిష్కరించకుంటే మరో ఉద్యమం...
ఐకేపీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించకుంటే మరో ఉద్యమానికి సిద్ధం అవుతామని టీజీవో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏలూరి శ్రీనివాసరావు, టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, టీజీవో జిల్లా అధ్యక్షుడు ఖాజామియా, కార్యదర్శి రత్నాకర్ హెచ్చరించారు. ఐకేపీ ఉద్యోగుల సమావేశానికి హాజరైన వారు తొలుత సీపీవోతో జరిగిన చర్చల గురించి సంపత్‌ను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ.. ఉద్యోగులకు సీఈవో ఇచ్చిన హామీ అమలయ్యేలా చూడాలని కోరారు. లేకుంటే మళ్లీ ఉద్యమించక తప్పదన్నారు. ఐకేపీ ఉద్యోగులకు తాము ఎప్పుడూ అండగా ఉంటామని హామీ ఇచ్చారు. సమావేశంలో ఐకేపి, వివిధ సంఘాల నాయకులు దాసు, వెంకటేశ్వర్లు, అనూరాధ, జ్యోతి, సీతారాములు, లక్ష్మణ్‌రావు తదితరులు పాల్గొన్నారు.