ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్ : డీఆర్‌డీఏ పీడీ వైఖరిని నిరసిస్తూ వారం రోజులుగా 250 మంది ఐకేపీ ఉద్యోగులు సామూహికంగా సెలవు పెట్టి పట్టు విడవకుండా ఆందోళన చేస్తూనే ఉన్నారు. అయితే తాను కూడా మెట్టు దిగేది లేదనే రీతిలో పీడీ పద్మజారాణి వ్యవహరిస్తున్నారు. దీంతో జిల్లాలోని ఐకేపీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. ఇటీవల సెర్ప్ సంస్థ నుంచి ఓ అధికారి వచ్చి ఉద్యోగులు, పీడీ మధ్య సయోధ్య కుదిర్చేం దుకు ప్రయత్నించినా.. అది సఫలం కాలేదు. దీంతో రుణాలందక డ్వాక్రా గ్రూపు మహిళలు ఇబ్బంది పడుతున్నారు. ఈ సమస్యపై దృష్టి సారించాల్సిన జిల్లా ఉన్నతాధికారులు కూడా పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. మరో రెండు నెలల్లో ఆర్థిక సంవత్సరం ముగియనుంది. ఈ సమయంలో ఉద్యోగులు విధులకు హాజరు కాకుండా ఆందోళన చేస్తుండడంతో ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యం చేరుకునే అవకాశం లేదు. దీంతో ఇబ్బందులు తప్పేలా లేదు.
ఏజెన్సీలోనూ సమ్మె ఉధృతం...
ఐకేపీ సిబ్బంది సామూహిక సెలవులతో ఇప్పటికే సదరం, అభయహస్తం, ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళిక వంటి పథకాలతో లబ్ధి పొందలేక పలువురు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటివరకు మైదాన ప్రాంతానికే పరిమితమైన ఈ నిరసనకు మద్దతుగా ఏజెన్సీ మండలాల్లో పనిచేస్తున్న మిగిలిన ఐకేపి ఉద్యోగులు 150 మంది సైతం సోమవారం నుంచి సామూహిక సెలవులు పెట్టడంతో అక్కడ కూడా పాలన స్తంభించిపోయింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు ఈ అంశంపై దృష్టిసారించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని పలువురు కోరుతున్నారు.
పట్టు వీడని ఉద్యోగులు..
Published Tue, Jan 7 2014 2:44 AM | Last Updated on Sat, Sep 2 2017 2:21 AM
Advertisement
Advertisement