ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ (డీఆర్‌డీఏ)లోని ఐకేపీ ఉద్యోగులకు, ఆ శాఖ ప్రాజెక్టు డెరైక్టర్ పద్మజారాణికి మధ్య ఏర్పడిన వివాదం హైదరాబాద్‌కు చేరింది. పీడీ వైఖరితో విసిగి సిబ్బంది సామూహిక సెలువులు పెట్టిన విషయం తెలిసిందే. పీడీ తమను వేధిస్తున్నారని, కించపరిచేలా మాట్లాడుతున్నారని ఉద్యోగుల ఆరోపణల నేపథ్యంలో ఈ సమస్యను పరిష్కరించాలని సెర్ప్ సీఈవో రాజశేఖర్ సామాజిక భద్రత డెరైక్టర్ చిన్న తాతయ్యను ఆదేశించారు. దీంతో శుక్రవారం ఆయన జిల్లాకు వచ్చారు. డీఆర్‌డీఏ పీడీకి, సిబ్బందికి మధ్య సయోధ్య కుదిర్చేందుకు వారితో వేర్వేరుగా సమావేశమయ్యారు. ముందుగా స్థానిక టీటీడీసీలో మహిళా సమాఖ్య సభ్యులు, ఐకేపీ ఉద్యోగులు టీఎన్‌జీవోస్ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు సమక్షంలో డెరైక్టర్‌ను కలిసి పద్మజారాణి వల్ల తమకు ఎదురవుతున్న ఇబ్బందులను వివరించారు. జిల్లాస్థాయి సమీక్ష సమావేశంలో ఐకేపీపై దుర్భాషలాడారని, జిల్లా సమాఖ్య ఏమైనా పార్లమెంటా అని వ్యాఖ్యానించారని, దళిత, గిరిజన మహిళలను అవమానపరిచేలా మాట్లాడుతున్నారని ఆరోపించారు. ఇటీవల ఓ అధికారిణి రాజీనామాకు కూడా పీడీనే కారణమని అన్నారు. కింది స్థాయి ఉద్యోగులు మొదలు డీపీఎం స్థాయి అధికారుల వరకు ఆమె అసభ్య పదజాలంతో దూషిస్తారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ కారణాలతోనే తాము సామూహిక సెలవులు పెట్టినట్లు ఆయనకు విన్నవించారు. అనంతరం ఆయన డీఆర్‌డీఏ పీడీతో సమావేశం అయ్యారు. అనంతరం ‘న్యూస్‌లైన్’తో మాట్లాడుతూ.. ఇరుపక్షాల వారి వాదనలు విన్నామని, సిబ్బందితో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారని, అయితే ఉద్యోగులే ఆమె వైఖరితో విసిగిపోయామంటున్నారని తెలిపారు. ఆమెను బదిలీ చేయాలని, లేదా విధుల నుంచి తొలగించాలని, అప్పటివరకు సామూహిక సెలవులు విరమించేది లేదంటున్నారని వివరించారు. చిన్నచిన్న లోపాలే వీరి మధ్య ఎడబాటుకు కారణమన్నారు. ఈ వివరాలన్నింటినీ సెర్ప్ సీఈవో దృష్టికి తీసుకె ళ్లి ఇరు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కృషి చేస్తానని చెప్పారు. డెరైక్టర్‌ను కలిసిన వారిలో ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కలకోటి సంపత్, ఆంజనేయులు, దాసు, దుర్గారావు, అనూరాధ, జ్యోతి, వెంకటమ్మ ఉన్నారు.
రాజీపడే ప్రసక్తే లేదు...
డీఆర్‌డీఏ పీడీకి వ్యతిరేకంగా ఆశాఖ ఉద్యోగులు సామూహిక సెలవులు పెట్టి కార్యాలయం ఎదుట చేస్తున్న ధర్నా శుక్రవారం మూడో రోజుకు చేరుకుంది. ఈ సందర్బంగా ఐకేపీ ఉద్యోగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కలకోటి సంపత్ మాట్లాడుతూ తాము చేస్తున్న ఆందోళనను విరమించాలని సెర్ప్ డెరైక్టర్ సూచించారని, అయితే పీడీని మార్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లో రాజీపడే ప్రసక్తే లేదని డెరైక్టర్‌కు తేల్చిచెప్పామన్నారు.
బాధ్యతలు నుంచి తప్పుకునే యోచనలో పీడీ..?
డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణి తన బాధ్యతల నుంచి తప్పుకునే యోచనలో ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇక్కడ పీడీగా భాద్యతలు చేపట్టిన నాటి నుంచి ఉద్యోగులకు, తనకు ఎదో ఒక విషయంలో తరుచూ వివాదాలు జరుగుతున్నాయని, ఇక వారితో కలిసి పనిచేయలేననే ఆలోచనకు ఆమె వచ్చారని తెలిసింది. అంతేకాక ఇటీవల సిబ్బంది ఆందోళనలు కూడా ఉధృతం కావడంతో ఉన్నతాధికారుల నుంచి విమర్శలు వస్తాయని భావించి ముందుగానే తప్పుకునేందుకు సిద్ధమయ్యారని, తనకు డీపీవోగా పనిచేసిన అనుభవం ఉండటంతో అదే శాఖలో పూర్తిస్థాయి భాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఉన్నతాధికారులను కోరనున్నట్లు సమాచారం.
రాజధానికి పంచాయితీ
Published Sat, Jan 4 2014 5:43 AM | Last Updated on Sat, Sep 2 2017 2:17 AM
Advertisement
Advertisement