డీఆర్‌డీఏ పీడీ వైఖరిపై నిరసన | IKP staff launch relay fast | Sakshi
Sakshi News home page

డీఆర్‌డీఏ పీడీ వైఖరిపై నిరసన

Published Wed, Jan 1 2014 5:13 AM | Last Updated on Sat, Sep 2 2017 2:09 AM

IKP staff launch relay fast

ఖమ్మం ఖిల్లా, న్యూస్‌లైన్: జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థలో పని చేస్తున్న ఐకేపీ ఉద్యోగులు, మహిళా సంఘాలపై డీఆర్‌డీఏ పీడీ పద్మజారాణి అకారణంగా వేధింపులకు పాల్పడుతున్నారని, ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ ఐకేపీ జిల్లా సంఘం ఆధ్వర్యంలో కిన్నెర జిల్లా సమాఖ్య సభ్యు లు, ఇతర ఉద్యోగులు మంగళవారం ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడిం చారు.
 
  తొలుత ఎనిమిది వందల మంది మహిళలు, వికలాంగులు డీఆర్‌డీఏ కార్యాలయం నుం చి ర్యాలీగా బయలుదేరి బస్‌డిపో రోడ్, పెవిలి యన్ గ్రౌండ్, మయూరీసెంటర్, బస్టాండ్, జడ్పీ సెంటర్ మీదుగా కలెక్టరేట్‌కు చేరుకున్నారు. ఈ ర్యాలీనికి టీఎన్‌జీఓస్  జిల్లా అధ్యక్షులు కూరపాటి రంగరాజు ప్రారంభించారు. కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న కూరపాటి రంగరాజు మాట్లాడుతూ  కొంతకాలంగా పీడీ ఉద్యోగులను దుర్బాషలాడుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, తీరు మార్చుకుంటుందిలే అని ఊరుకుంటే రోజురోజుకు ఆమె వైఖరి మితిమీరిపోతోందని అన్నారు. ఇంకా టీఎన్‌జీఓస్ నగర అధ్యక్షుడు వల్లోజు శ్రీనివాస్, కోశాధికారి చంద్రకాని రమణయాదవ్, సీఐటీయు జిల్లా నాయకులు నరసింహారావు, లింగయ్యలు సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఐకేపీ జిల్లా అధ్యక్షుడు కలకోట సంపత్ మాట్లాడుతూ పదినెలలుగా డీఆర్‌డీఏ పీడీ తమని మానసికంగా, నైతికంగా వేధిస్తున్నారని పేర్కొన్నారు.
 
 ఈ వ్యాఖ్యలకు మనస్తాపం చెంది డిసెంబర్ 31 నుంచి సామూహిక సెలవులు పెట్టాలని నిర్ణయించుకున్నామని అన్నారు. జిల్లాస్థాయి సమావేశాల్లో ఐకేపీ ఉద్యోగులపై అకారణంగా ఆగ్రహం వ్యక్తం చేస్తూ భయపెడుతోందని ఆరోపించారు. ఇటీవల ఎటువంటి కారణం లేకుండా ఉద్యోగులపై ఎస్సీ, ఎస్టీ కేసులను బనాయిస్తోందని పేర్కొన్నారు. పీఓపీ రవికుమార్‌ను, హెచ్‌ఆర్ ఏపీఎం సుభాష్‌ను ఎటువంటి కారణాలు లేకుండా కావాలనే సస్పెండ్ చేయించారని ఆరోపించారు. పీడీ వేధింపులు తాళలేకనే వికలాంగుల విభాగం ప్రాజెక్టు మేనేజర్ వసంతసేన రాజీనామా చేశారని అన్నారు. గతంలోనే ఆమె పనితీరుపై అప్పటి జిల్లాకలెక్టర్ సిదార్ధజైన్‌కు ఫిర్యాదు చేయగా పద్ధతి మార్చుకుంటానని సభాముఖంగా చెప్పిందని, కానీ మార్చుకోలేదని అన్నారు. అటెండర్లు , డ్రైవర్లును కూడా వ్యక్తిగతంగా అసభ్యపదజాలంతో దూషిస్తున్నారన్నారు. వెంటనే ఆమెని విధులనుంచి తొలగించాలని డిమాండ్ చేశారు.
 
 మహిళలు అని కూడా చూడడంలేదు.
 మహిళలు అని కూడా చూడకుండా కించపరిచే విధంగా వ్యాఖ్యలు చేస్తున్నారని కిన్నెర మహిళ సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు వెంకటమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. మహిళ అధికారియే మహిళలను కించపరిస్తే ఇక సమాజంలో మహిళలకు న్యాయం ఎక్కడ జరుగుతుందని అధికారులను ప్రశ్నించారు. అనంతరం డీఆర్‌ఓ శివశ్రీనివాస్‌కు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఐకేపీ జిల్లా ఉపాధ్యక్షుడు సీతారాము లు, నాయకులు వెంకటేశ్వర్లు, దాసు, ఆంజనేయులు, దుర్గారావు, వంశీ, మహిళానాయకులు జ్యోతి, అనురాధ, నాగమణి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement