తనిఖీల్లేవ్!
♦ ఆసరా పెన్షన్లలో సామాజిక తనిఖీలు బంద్
♦ ఏడాది కాలంగా నిలిచిపోయిన ప్రక్రియ
♦ పరిశీలన లేక పెరుగుతున్న అవకతవకలు
♦ 42 మంది పింఛన్లు కాజేసిన కార్యదర్శులు
♦ చర్యలకు సిఫారసు చేసిన డీఆర్‌డీఏ పీడీ
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆసరా (సామాజిక భద్రత పింఛన్ల పథకం)లో అవకతవకల గుర్తింపునకు తలపెట్టిన సామాజిక తనిఖీల ప్రక్రియకు సర్కారు మంగళం పాడింది. పథకం ప్రారంభంలో ఒకట్రెండు చోట్ల తనిఖీలు చేసిన అధికారులు.. ఆ తర్వాత జాడలేకుండా పోయారు. దీంతో ఏడాది కాలంగా ఈ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీలు జరగలేదు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సామాజిక తనిఖీలను తప్పనిసరి. ఇందులో భాగంగా ఎన్‌ఆర్‌ఈజీఏ, ఐడబ్ల్యూఎంఏ కార్యక్రమాలపై క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయి. కానీ సామాజిక భద్రత కింద ఇచ్చే పింఛన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ తనిఖీలకు సంబంధించి ఆదేశాల జారీని అటకెక్కించింది. దీంతో ఆసరా పథకంలో అక్రమాలు పెరుగుతున్నాయి.
జిల్లాలో ఆసరా పథకం ద్వారా 2,99,278 మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి నెలకు రూ. 37.5 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే పింఛన్ల పంపిణీలో అక్రమాలపై క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదుల ఆధారంగా పరిశీలన చేపట్టి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆ మేరకు నిగ్గుతేల్చుతోంది. అయితే సామాజిక తనిఖీల ప్రక్రియలో గ్రామస్థాయిలో పరిశీలన చేపడతారు. లబ్ధిదారుల ముందే పరిశీలన చేపట్టి.. పూర్తివిషయాలను వెల్లడిస్తారు. అవకతవకలు జరిగినట్లు తేలితే వెంటనే వారిపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఏడాది కాలంగా సామాజిక తనిఖీలు తెరపైకి రాకపోవడంతో పథకం అమలులో పర్యవేక్షణ గాడితప్పింది.
నాలుగు మండలాల్లో వెయ్యికిపైగా..
ఆసరా పింఛన్ల పథకం కింద 2014 సెప్టెంబర్ నుంచి లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో 2014-15 వార్షికం చివరల్లో ఆసరాపై సామాజిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో నాలుగు మండలాల్లోని అన్నిగ్రామాల్లో ఈ తనిఖీలు నిర్వహించగా.. సుమారు వెయ్యికిపైగా అవకతవకల్ని గుర్తించారు. ఈమేరకు సొమ్ము రికవరీ చేయాల్సిందిగా డీఆర్‌డీఏను ఆడిట్ అధికారులు సూచించారు. అయితే అన్ని మండలాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా.. అనుకోకుండా ఈ తనిఖీల ప్రక్రియను నిలిచిపోయింది. ఆసరాలో అక్రమాలపై ఇటీవల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో స్పందించిన అధికారులు కొన్ని గ్రామాల్లో క్రమ పద్ధతిలో సర్వే నిర్వహించారు. ఇందులో 42 మంది లబ్ధిదారులు మరణించినప్పటికీ.. వారి పింఛన్ డబ్బులు స్థానిక పంచాయతీ కార్యదర్శులు డ్రా చేస్తున్నట్లు డీఆర్‌డీఏ అధికారులు గుర్తించారు. దీంతో వారిపై చర్యలకు సిఫార్సు చేస్తూ డీఆర్‌డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి కలెక్టర్‌కు లేఖ రాశారు.