Support pension
-
డబుల్ పెన్షనర్ల నుంచి రూ.10 లక్షలు రికవరీ
సిరిసిల్ల: రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రభుత్వ సర్వీసు పెన్షన్లు, సామాజిక ఆసరా పెన్షన్.. రెండూ పొందుతున్న పది మంది రూ.10 లక్షలను తిరిగి ప్రభుత్వ ఖజానాకు చెల్లించారు. జిల్లాలో 71 మంది రెండు పెన్షన్లు పొందుతున్నట్లుగా పేర్కొంటూ జూలై 6న ‘సాక్షి’లో ‘ప్రభుత్వ పెన్షనర్లకు ఆసరా’శీర్షికన కథనం ప్రచురితమైంది. దీంతో రెండు పెన్షన్లు పొందుతున్న వారికి పంచాయతీ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీచేశారు. రెండు పెన్షన్లు పొందుతున్న వారు ఆసరా పెన్షన్ డబ్బులను తిరిగి చెల్లించాలని ఆదేశించారు.కాగా, ఏళ్ల తరబడి పొందిన ఆసరా పెన్షన్ డబ్బులను ఒకేసారి చెల్లించడం ఇబ్బందిగా ఉండడంతో రికవరీకి సమయం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ మేరకు వారికి వెసులుబాటు కలి్పంచారు. ఇప్పటికే 10 మంది రూ.10 లక్షలు చెల్లించగా.. ఇంకా 61 మంది, రూ.47.75 లక్షల మేరకు చెల్లించాల్సి ఉంది. ఈ మొత్తాన్ని దశలవారీగా రికవరీ చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఆసరా పెన్షన్లు నిలిపివేసి, సరీ్వసు పెన్షన్ నుంచి ఆ సొమ్మును దశలవారీగా రికవరీ చేయాలని జిల్లా అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఒకేసారి చెల్లించాలని ఒత్తిడి చేయకుండా వాయిదా పద్ధతిలో వసూళ్లకు ప్రణాళిక సిద్ధం చేశారు. -
ఆసరా.. ఆలస్యం
♦ రెండు నెలలుగా ఇదే పరిస్థితి ♦ ఈసారి బ్యాంకుల విలీనంతో జాప్యం సాక్షి, కొత్తగూడెం: ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చింది’ అన్న చందంగా తయారైంది రాష్ట్రంలోని ఆసరా పింఛనర్ల పరిస్థితి. కుటుంబపరంగా ఎటువంటి ఆసరా లేని వారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1000 పింఛన్ ప్రతినెలా ఏదో ఒక కారణంతో ఆలస్యమవుతూనే ఉంది. జూన్ 6వ తేదీ వచ్చినా రాష్ట్రంలోని 36,37,949 మంది పింఛనర్లకు ఏప్రిల్ నెల పింఛన్ ఇవ్వకపోవడంతో తమ కుటుంబ అవసరాలు తీరక వృద్ధ పింఛనర్లు, వికలాంగులు, వితంతువులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రంలోని ఎస్‌బీహెచ్‌తో సహా ఐదు ప్రధాన బ్యాంకులు విలీనం కావడం వల్ల ఆయా బ్యాంకుల ఐఎఫ్ఎస్సీ కోడ్లు మారడం, బ్యాంకుల కంప్యూటర్లపై పనిఒత్తిడి పెరగడంతో సర్వర్లు మొరాయించడం వంటి సాంకేతిక కారణాల వల్ల బ్యాంకుల్లో ఆసరా పింఛన్లు ఇంకా జమకాని పరిస్థితి నెలకొంది. ఈ సాంకేతిక సమస్యలు ఎప్పుడు తొలగుతాయో, తమ పింఛన్ ఎప్పుడు బ్యాంకులో పడుతుందో తెలియక పింఛనర్లు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. రాష్ట్రంలో 13,59,597 మంది వితంతు, 13, 31,103 మంది వృద్ధాప్య, 4,65,047 మంది వికలాంగులు, 34,728 మంది చేనేత కార్మికులు, 58, 372 మంది గీత కార్మికులు, 3, 48, 301 మంది బీడీ కార్మికులు, 40,801 మంది ఇతర పింఛనర్లు ప్రతినెలా ఆసరా పింఛన్ అందుకుంటున్నారు. బ్యాంకుల విలీనం పేరుతో ఈసారి పింఛన్ ఆలస్యం కాగా.. గత మార్చి నెల ఆసరా పింఛన్‌ను ప్రభుత్వం నుంచి బ్యాంకుల్లో నగదు జమ కాలేదన్న కారణంతో ఆ పింఛన్ ఏప్రిల్ 20 నుంచి 22 తేదీల్లో పడాల్సిన డబ్బును మే 5వ తేదీన పంపిణీ చేశారు. ఇక ఏప్రిల్ నెల పింఛన్ మే 20 నుంచి 22వ తేదీలోగా బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా, జూన్ 5 వరకు రాలేదు. అయితే కేవలం పింఛన్‌పైనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్న లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇప్పటికీ పింఛన్ అతీగతీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల చెల్లింపులు బ్యాంకులకు అనుసంధానం చేయడంతో తమ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు, వితంతువులకు రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు పింఛన్‌ను బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఈ ‘ఆసరా’తో పింఛనర్లు తమ నెలవారీ ఖర్చులను కొంతవరకైనా తీర్చుకునే అవకాశం ఉంటుంది. నిత్యావసరాలతోపాటు ఆస్పత్రులకు ఈ పింఛన్ నుంచే ఖర్చు చేస్తుంటారు. అయితే గతంలో పింఛన్లను నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఇచ్చేవారు. కానీ గత రెండేళ్లుగా బ్యాంకు ఖాతాల్లో మాత్రమే పింఛన్లను జమ చేస్తున్నారు. దీనివల్ల అసలైన లబ్ధిదారులకే పింఛన్ లభించే అవకాశం ఉందనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు తమ పింఛన్ల కోసం బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఎవరో ఒకరిని బతిమాలి వారి సహాయంతో వెళ్లి పింఛన్లు తెచ్చుకుంటున్నారు. -
లక్ష మందికి ఇద్దామా!
- జూన్ 2న ఒంటరి మహిళలకు ఆర్థికభృతి అందజేయడంపై సర్కార్ తర్జనభర్జన - కేవలం 71 వేల దరఖాస్తుల పరిశీలన పూర్తి - మరొక రోజు గడువు పెంచాలని సెర్ప్ నిర్ణయం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 న ఒంటరి మహిళలకు ఆర్థికభృతిని అందించే విషయమై సర్కారు తర్జనభర్జన పడుతోంది. ఒంటరి మహిళలకు ఏప్రిల్ 1 నుంచి నెలకు రూ.1,000 చొప్పున ఆర్థికభృతిని వర్తింపజేస్తూ జూన్ 2న రెండు నెలల మొత్తాన్ని అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అయితే, రాష్ట్రవ్యాప్తంగా ఒంటరి మహిళలకు ఆర్థికభృతి పథకానికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు దరఖాస్తులు రావచ్చని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ 1,46,280 దరఖాస్తులు అందాయి. ఇందులో గ్రామీణ ప్రాంతాల నుంచి 1,14,010 దరఖాస్తులు, పట్టణ ప్రాంతాల నుంచి 32,270 దరఖాస్తులు అందాయి. దరఖాస్తుల పరిశీలన ఈ నెల 25 లోగా పూర్తి చేసి అర్హులకు జూన్ 2న రెండు నెలల భృతిని అందించాల్సి ఉంది. అయితే, గురువారం నాటికి 71,815 దరఖాస్తుల పరిశీలన మాత్రమే పూర్తయింది. వీటిలోనూ 68,076 దరఖాస్తులు అర్హమైనవని తేల్చిన అధికారులు.. 3,739 దరఖాస్తులను తిరస్కరించారు. కాగా, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నాడు లక్ష మంది ఒంటరి మహిళలకైనా లబ్ధి చేకూర్చేలా చర్యలు చేపట్టాలని సెర్ప్ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. దీంతో దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ గురువారంతో ముగియగా, శుక్రవారం వరకు పొడిగిం చాలని నిర్ణయించినట్లు తెలిసింది. బీడీ కార్మికులకు మరింత వెసులుబాటు ఆసరా పింఛన్దారులున్న కుటుంబాల్లోని బీడీ కార్మికులకు కూడా ఆర్థికభృతిని ఇచ్చే నిమిత్తం ప్రభుత్వం ఇటీవల వెసులు బాటు కల్పించింది. అయినప్పటికీ సర్కారు ఆశించిన మేరకు దర ఖాస్తులు అందలేదు. దాదాపు 80 వేల నుంచి లక్ష వరకు దర ఖాస్తులు రావచ్చని సర్కారు అంచనా వేయగా, దరఖాస్తు గడువు ముగిసే నాటికి కేవలం 49 వేల దరఖాస్తులు అందాయి. దీంతో పునరాలోచనలో పడిన ప్రభుత్వం... ఒక కుటుంబంలో ఒక బీడీ కార్మికుడికే ఆర్థికభృతిని అందించాలనే నిబంధనను తాజాగా సవరించింది. దీంతో ఒకే కుటుంబంలో ఎంతమంది బీడీ కార్మికులు ఉన్నప్పటికీ ఆర్థికభృతికి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం లభించింది. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో గురువారం నాటికి మరో 10 వేలకు పైగా దరఖాస్తులు అందాయి. మొత్తంగా 59,822 దరఖాస్తులు ప్రభుత్వానికి అందగా గురువారం నాటికి 36,415 దరఖాస్తుల పరిశీలన పూర్తయింది. ఇందులో 19,286 దరఖాస్తులను అర్హమైనవిగా అధికారులు తేల్చారు. దరఖాస్తుల పరిశీలనకు శుక్రవారం వరకు గడువు పొడిగించిన అధికారులు... జూన్ 2 నాటికి కనీసం 25 వేలమంది బీడీ కార్మికులకు కొత్తగా ఆర్థికభృతి అందించాలని భావిస్తున్నారు. -
అప్పుల ఖాతాకు ‘ఆసరా’ నిజమే!
డీఆర్డీవో అధికారుల విచారణలో వెల్లడి నారాయణపేట: ఆసరా పింఛన్ డబ్బులను అప్పుల కింద జమ చేసుకుంటున్నది నిజమేనని అధికారుల విచారణలో తేలింది. మహబూబ్‌నగర్ జిల్లా నారాయణపేట మండలం కోటకొండ ఎస్బీహెచ్లో ఆసరా డబ్బులను అప్పుల కింద తీసుకుంటున్న వైనంపై ఈ నెల ఒకటో తేదీన ‘అయ్యో ఆసరా.. ఇదేమి గోస రా? శీర్షికతో ‘సాక్షి’ ప్రధాన సంచికలో ప్రచురి తమైన కథనానికి చీఫ్ సెక్రటరీ స్పందించారు. దీనిపై సమగ్ర విచారణ జరపాలని మహబూబ్‌నగర్ జిల్లా అధికారులను ఆదేశిం చారు. ఈ మేరకు డీఆర్డీవో అధికారుల బృం దం శుక్రవారం కోటకొండ ఎస్బీహెచ్లో విచారణ చేపట్టింది. ‘పట్నం చిన్న ఆశప్పకు చెందిన రూ.2 వేల పింఛన్ డబ్బులు బంగారు రుణం వడ్డీ కింద జమ చేసుకున్నట్లు రుజువైంది. అలాగే, చిన్న లక్ష్మప్పకు చెందిన డబ్బులు ఆయన కుమారుడి సీసీలోన్లో రూ. 500 జమ చేశారు. బాలప్పకు చెందిన రూ.3 వేలను ఆయన భార్య వెంకటమ్మ రుణం కింద జమ చేసుకున్నట్లు తేలింది. కాగా, అధికారులు విచారణ కోసం వచ్చారని తెలుసుకున్న పలువురు పింఛన్‌దారులు డీఆర్డీఓ ఏపీఓ శారద ముం దు తమ గోడును వెలిబుచ్చారు. మరో పింఛన్ దారు నర్సమ్మకు చెందిన డబ్బులు రెండు నెలల క్రితం బంగారు రుణం వడ్డీ కింద రూ.1300 బదిలీ అయినట్లు తేలింది. తన కొడుకు పేరిట ఉన్న సీసీలోన్ కోసం నెలా రూ.500 జమ చేసినట్లు అధికారుల ముందు వాపోయింది. మరో వితంతు భాగ్య మ్మ తన కుమార్తె పేరిట సీసీలోన్ ఉండడంతో 5 నెలలుగా వెయ్యి రూపాయల చొప్పున పింఛన్ డబ్బులను జమ చేశారని చెప్పుకొచ్చారు. ఇకపై పింఛన్ డబ్బులు పట్టుకోం: మేనేజర్ ఇక నుంచి పింఛన్‌దారుల డబ్బులను తాము పట్టుకోమని బ్యాంక్ మేనేజర్ మనోహర్‌రెడ్డి స్పష్టం చేశారు. బ్యాంకు నుంచి రుణాలు పొం దిన వారు రెగ్యులర్‌గా డబ్బులు కట్టాలని, లేకుంటే బ్యాంకు నిబంధనల ప్రకారం వసూ లు చేస్తామన్నారు. పింఛన్‌దారుల నుంచి బలవంతంగా డబ్బులను వసూలు చేయడం లేదన్నారు. పింఛన్ డబ్బులు రుణాల ఖాతా లో జమ చేసినట్లు స్టేట్మెంట్లో చూపిస్తుంది కదా అని అధికారులు మేనేజర్‌ను ప్రశ్నించడంతో ఆయన కంగుతిన్నారు. ఇకపై ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుం టామని సమాధానమిచ్చారు. పింఛన్ డబ్బు కొంత ట్రాన్స్ఫర్ అయింది నిజమే: ఏపీవో వృద్ధులు, వికలాంగులు, వితం తువులకు అండగా ఉండాలన్న ఉద్దేశం తో ప్రభుత్వం ఆసరా పింఛన్ డబ్బులు అందజేస్తోందని డీఆర్డీవో ఏపీవో శారద పేర్కొన్నారు. బ్యాంకులో వారి కుటుంబ సభ్యులు చేసే అప్పులకు పింఛన్‌ను ముడిపెట్టడం సరికాదన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కోటకొండలోని లబ్ధిదారులు, బ్యాంకు అధికారులతో విచారణ చేపట్టామని, అందులో ఇద్దరికి సంబంధించిన పింఛన్ డబ్బులు కొంత వారి కుటుంబ సభ్యుల రుణాలకు ట్రాన్స్ఫర్ చేసినట్లు రుజువైందన్నారు. ఆసరా డబ్బులు డబ్బులు ఇకపై రుణాలకు లింకు పెట్టరని ఆమె స్పష్టం చేశారు. -
పండుటాకులకు పండుగ లేదా?
♦ దసరాకు అందని ఆసరా నిధులు విడుదల చేయని ఆర్థికశాఖ ♦ ఆసరా నిధులను ఆరోగ్యశ్రీకి ఇవ్వడమే కారణమంటున్న సిబ్బంది ♦ పండుగ రోజున మొక్కుబడిగా కొత్త పెన్షనర్లకు మంజూరు పత్రాలు సాక్షి, హైదరాబాద్: దసరా పండుగ వచ్చినా ఆసరా లబ్ధిదారుల చేతికి పింఛన్ అందలేదు. రాష్ట్రవ్యాప్తంగా 35.73 లక్షలమంది లబ్ధిదారులు పండుగ రోజుకైనా పింఛన్ రాకపోతుందా అని పదిరోజులుగా ఎదురు చూస్తున్నారు. అయితే.. పింఛన్ల పంపిణీ నిమిత్తం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సమర్పించిన ప్రతిపాదనలకు ఆర్థికశాఖ నుంచి క్లియరెన్స్ లభించలేదని తెలిసింది. ఆర్థిక శాఖ నిధులు విడుదల చేయకపోవడంతో దసరాలోగా పింఛన్ ఇచ్చే పరిస్థితి లేకపోయిందని సెర్ప్ అధికారులు అంటున్నారు. ఇదిలా ఉంటే.. జూలై, ఆగస్టుల్లో ఆమోదం పొందిన కొత్త దరఖాస్తులకు పింఛన్ మంజూరు చేసింది. దసరా రోజున కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్న నేపథ్యంలో.. ఆయా జిల్లాల ప్రారంభోత్సవ కార్యక్రమంలో లబ్ధిదారులకు మంజూరు పత్రాలు అందజేయనున్నారు. అయితే, కొత్త పెన్షనర్లకూ పాత లబ్ధిదారులతోపాటే పండుగ తర్వాతే పింఛన్ పంపిణీ చేయనున్నట్లు సెర్ప్ సిబ్బంది తెలిపారు. ఆసరా పథకం నిధులను ఆరోగ్యశ్రీకి మళ్లించినందునే పరిస్థితి ఏర్పడిందని మరికొందరు చెబుతున్నారు. ఆర్థికశాఖ నుంచి నిధులు రాకపోవడం వల్లే పింఛన్‌ను పండుగలోగా ఇవ్వలేకపోయామని, నెలాఖరులోగా పింఛన్ పంపిణీ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నామని సెర్ప్ ఇన్చార్జి సీఈవో అనితా రాంచంద్రన్ తెలిపారు. -
తనిఖీల్లేవ్!
♦ ఆసరా పెన్షన్లలో సామాజిక తనిఖీలు బంద్ ♦ ఏడాది కాలంగా నిలిచిపోయిన ప్రక్రియ ♦ పరిశీలన లేక పెరుగుతున్న అవకతవకలు ♦ 42 మంది పింఛన్లు కాజేసిన కార్యదర్శులు ♦ చర్యలకు సిఫారసు చేసిన డీఆర్డీఏ పీడీ సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఆసరా (సామాజిక భద్రత పింఛన్ల పథకం)లో అవకతవకల గుర్తింపునకు తలపెట్టిన సామాజిక తనిఖీల ప్రక్రియకు సర్కారు మంగళం పాడింది. పథకం ప్రారంభంలో ఒకట్రెండు చోట్ల తనిఖీలు చేసిన అధికారులు.. ఆ తర్వాత జాడలేకుండా పోయారు. దీంతో ఏడాది కాలంగా ఈ పథకానికి సంబంధించి సామాజిక తనిఖీలు జరగలేదు. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేసే గ్రామీణాభివృద్ధి కార్యక్రమాలకు సామాజిక తనిఖీలను తప్పనిసరి. ఇందులో భాగంగా ఎన్ఆర్ఈజీఏ, ఐడబ్ల్యూఎంఏ కార్యక్రమాలపై క్రమం తప్పకుండా తనిఖీలు జరుగుతున్నాయి. కానీ సామాజిక భద్రత కింద ఇచ్చే పింఛన్లలో కేంద్ర ప్రభుత్వం వాటా ఇస్తున్నప్పటికీ.. రాష్ట్ర ప్రభుత్వం ఈ తనిఖీలకు సంబంధించి ఆదేశాల జారీని అటకెక్కించింది. దీంతో ఆసరా పథకంలో అక్రమాలు పెరుగుతున్నాయి. జిల్లాలో ఆసరా పథకం ద్వారా 2,99,278 మంది లబ్ధి పొందుతున్నారు. వీరికి నెలకు రూ. 37.5 కోట్లు ప్రభుత్వం ఖర్చు చేస్తోంది. అయితే పింఛన్ల పంపిణీలో అక్రమాలపై క్షేత్రస్థాయి నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. ఫిర్యాదుల ఆధారంగా పరిశీలన చేపట్టి జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ఆ మేరకు నిగ్గుతేల్చుతోంది. అయితే సామాజిక తనిఖీల ప్రక్రియలో గ్రామస్థాయిలో పరిశీలన చేపడతారు. లబ్ధిదారుల ముందే పరిశీలన చేపట్టి.. పూర్తివిషయాలను వెల్లడిస్తారు. అవకతవకలు జరిగినట్లు తేలితే వెంటనే వారిపై చర్యలు తీసుకునే వెసులుబాటు ఉంటుంది. కానీ ఏడాది కాలంగా సామాజిక తనిఖీలు తెరపైకి రాకపోవడంతో పథకం అమలులో పర్యవేక్షణ గాడితప్పింది. నాలుగు మండలాల్లో వెయ్యికిపైగా.. ఆసరా పింఛన్ల పథకం కింద 2014 సెప్టెంబర్ నుంచి లబ్ధిదారులకు డబ్బులు పంపిణీ చేస్తున్నారు. ఈ క్రమంలో 2014-15 వార్షికం చివరల్లో ఆసరాపై సామాజిక తనిఖీలు నిర్వహించారు. జిల్లాలో నాలుగు మండలాల్లోని అన్నిగ్రామాల్లో ఈ తనిఖీలు నిర్వహించగా.. సుమారు వెయ్యికిపైగా అవకతవకల్ని గుర్తించారు. ఈమేరకు సొమ్ము రికవరీ చేయాల్సిందిగా డీఆర్‌డీఏను ఆడిట్ అధికారులు సూచించారు. అయితే అన్ని మండలాల్లోనూ ఈ తనిఖీలు నిర్వహించాల్సి ఉండగా.. అనుకోకుండా ఈ తనిఖీల ప్రక్రియను నిలిచిపోయింది. ఆసరాలో అక్రమాలపై ఇటీవల జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థకు పలు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో స్పందించిన అధికారులు కొన్ని గ్రామాల్లో క్రమ పద్ధతిలో సర్వే నిర్వహించారు. ఇందులో 42 మంది లబ్ధిదారులు మరణించినప్పటికీ.. వారి పింఛన్ డబ్బులు స్థానిక పంచాయతీ కార్యదర్శులు డ్రా చేస్తున్నట్లు డీఆర్డీఏ అధికారులు గుర్తించారు. దీంతో వారిపై చర్యలకు సిఫార్సు చేస్తూ డీఆర్డీఏ పీడీ సర్వేశ్వర్‌రెడ్డి కలెక్టర్‌కు లేఖ రాశారు. -
లైఫ్ సర్టిఫికెట్ ఇస్తేనే ఇకపై ‘ఆసరా’!
♦ మూడు నెలలకోమారు తప్పనిసరి చేస్తూ సర్కారు నిర్ణయం ♦ 4,500 మీ సేవాకేంద్రాలకు బయోమెట్రిక్ విధానానికి అనుమతి ♦ మే 1నుంచి 20లోగా ఇవ్వకుంటే జూన్ నెలలో పెన్షన్ రానట్లే ♦ తొలిదశలో పట్టణ ప్రాంతాల్లోని 10 లక్షలమంది పెన్షనర్లకు వర్తింపు సాక్షి, హైదరాబాద్: ఆసరా పెన్షనర్లు పింఛన్ పొందాలంటే తాము బతికి ఉన్నట్లుగా ధ్రువీకరణను తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 35.85 లక్షలమంది పెన్షనర్ల లో సుమారు 10 లక్షల మందికి పెన్షన్ సొమ్మును నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నారు. దీంతో సరైన సమాచారం లేక మరణించిన పెన్షనర్ల ఖాతాలకు కూడా పింఛన్ సొమ్ము వెళుతున్నట్లు పలు జిల్లాల నుంచి ఫిర్యాదులు వచ్చాయి. ఈ నేపథ్యంలో బ్యాంకు ఖాతాల ద్వారా పింఛన్‌ను తీసుకుంటున్నవారు ఇకపై ప్రతి మూడు నెలలకోమారు తాము బతికే ఉన్నట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించాల్సి ఉంటుంది. మే నెల 1నుంచి 20వ తేదీలోగా లైఫ్ సర్టిఫికెట్ సమర్పిం చిన పెన్షనర్లకే జూన్‌లో పింఛన్ అందుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. తొలిదశలో ఈ విధానాన్ని పట్టణ ప్రాంతాల్లోని సుమారు 10 లక్షలమంది పెన్షనర్లకు వర్తింపజేస్తున్నట్లు పేర్కొన్నారు. పోస్టాఫీసులు, పంచాయతీ కార్యాల యాల నుంచి పెన్షన్ పొందుతున్నవారికి కూడా త్వరలోనే పెన్షన్‌ను బ్యాంకు ఖాతాల ద్వారా అం దించే ఏర్పాటు చేస్తామని, అప్పట్నుంచి గ్రామీణ ప్రాంతాల్లోని పెన్షనర్లకు కూడా లైఫ్ సర్టిఫికెట్ నిబంధనను వర్తింపజేస్తామని చెబుతున్నారు. 4,500 మీసేవా కేంద్రాలకు అథెంటికేషన్ ఆసరా పింఛన్ పొందుతున్న లబ్ధిదారులు మూడు నెలలకోమారు లైఫ్ సర్టిఫికెట్ ఇచ్చేం దుకు గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ ఏర్పాట్లు చేసింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 4,500 మీసేవాకేంద్రాలకు బయోమెట్రిక్, ఐరిస్ అథెం టికేషన్ సదుపాయాన్ని కల్పించింది. లబ్ధిదారులు మీసేవా కేంద్రానికి వెళ్లి ఐరిస్ ద్వారా కనుపాపలను సరిపోల్చడంతోగానీ, వికలాంగులు(అంధులు) బయోమెట్రిక్(వేలిముద్ర) ద్వారాగానీ తమ ధ్రువీకరణను సమర్పించాలి. ధ్రువీ కరణ కోసం మీసేవ కేంద్రానికి లబ్ధిదారులు ఆధార్ గానీ, పెన్షన్ ఐడీ నెంబరునుగానీ వెంట తీసికెళ్లాలి. ఈ ప్రక్రియ పూర్తికాగానే మీసేవా సిబ్బంది లబ్ధిదారుకు లైఫ్ సర్టిఫికెట్ సమర్పించి నట్లుగా రశీదు అందజేస్తారు. దీనికిగాను 20 రూపాయలు చెల్లించాలి. ఇలా ఏడాదికి రూ.80 మీసేవా కేంద్రానికి సమర్పించుకోవాల్సిందే. పెన్షనర్లకు ఇది ఇబ్బందికరం.. ఆసరా పింఛన్‌దారులు మీ సేవాకేంద్రాలకు వెళ్లి లైఫ్ సర్టిపికెట్లు సమర్పించడం ఇబ్బం దికరమే. అంధులైన పెన్షనర్లకు ఐరిస్‌తో ధ్రువీకరణ, చాలామంది(లెప్రసీ వంటి) వికలాంగులు, వృద్ధులకు బయోమెట్రిక్ ద్వారా వేలిముద్రలను సరిపోల్చడం వీలుకాదు. పింఛ న్ సొమ్ము నుంచి ప్రతిసారి రూ.20 మీసేవాకేంద్రానికి ఇవ్వడం ఇబ్బందికరమే. దానిని ప్రభుత్వమే భరించాలి. - కొల్లి నాగేశ్వరరావు, వికలాంగుల హక్కుల సంఘం నేత -
చనిపోయేందుకు మందు గోలీ ఇవ్వండి బిడ్డా!
‘అర్హత ఉన్నా.. ఆసరా పింఛన్ రాలేదు. అధికారులు, ప్రజాప్రతినిధులు పట్టించుకోలేదు. భిక్షాటన చేసేందుకు ఒళ్లు సహకరించడం లేదు.. చనిపోయేందుకు మందు గోలీ ఇచ్చి పుణ్యం కట్టుకోండి బిడ్డా!’ అంటూ కనపడిన వారందరినీ దీనంగా అడుగుతోంది 80 ఏళ్ల వృద్ధురాలు. ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో ఉన్నా.. వృద్ధాప్య పింఛన్‌కు అర్హులరాలైనా.. ఎవరూ కనికరించక పోవడంతో తనను చంపేయండంటూ పరోక్షంగా వేడుకుటోంది. - ఓ వృద్ధురాలి ఆక్రందనభిక్షాటన చేసేందుకు ఒళ్లు సహకరించ లేదంటూ ఆవేదన - అర్హత ఉన్నా అందని ఆసరా పింఛన్ - సీఎం నియోజకంలోనే హృదయ విదారకర సంఘటన కొండపాక: మండలం దుద్దెడ గ్రామానికి చెందిన మేడిపల్లి వెంకటవ్వ (80) భర్త కొన్నేళ్ల కిందట మృతి చెందాడు. దీంతో ఉన్న ఒక్కగానొక్క కుమారుడు కూలీనాలి చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఈ క్రమంలో వెంకటవ్వకు తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు రూ.200 పింఛన్ తీసుకునేది. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆసరా పథకం ప్రవేశపెట్టిందన్న విషయం తెలుసుకున్న వెంకటవ్వ నెలకు రూ. 1000 పొందవచ్చని సంతోషపడింది. ఈ పథకానికి అన్ని రకాలుగా అర్హురాలు అయినప్పటికీ వెంకటవ్వకు ప్రభుత్వం పింఛన్‌ను మంజూరు కాలేదు. దీంతో ఆసరా పథకం పొందేందుకు స్థానిక ప్రజాప్రతినిధులను, ఎంపీడీఓ కార్యాలయ అధికారులను వేడుకున్నప్పటికీ ఏ ఒక్కరూ కనికరించకపోవడంతో ఆసరాకు నోచుకోలేకపోయింది. చివరకు ఆసరా రాదనుకున్న వెంకటవ్వ రోడ్డున వెళ్లే వారి వద్ద, గ్రామస్తుల వద్ద భిక్షాటన చేసుకుంటూ కాలం వెల్లదీస్తోంది. భిక్షం అడుక్కునే ముందు ఎవరైనా చనిపోయేందుకు ఒక మందు గోలీ ఇవ్వండి బిడ్డా అంటూ దీనంగా వేడుకుంటోంది. -
కిటకిటలాడిన ‘ఈ -ప్రజావాణి’
ప్రగతినగర్ : జిల్లా కేంద్రంలో సోమవారం ‘ఈ- ప్రజావాణి’ ప్రారంభమైంది. ఇందుకోసం ప్రత్యేక కౌంటర్, ఆసరా పింఛన్ల కోసం మరో రెండు కౌంటర్లను ఏర్పాటు చేసి, ప్రజల నుంచి వచ్చిన ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేశారు.ఆ ఫిర్యాదులను సంబంధిత మండల అధికారులకు, ఆయా శాఖలకు స్కానింగ్ చేసి పంపించారు. ఫిర్యాదులను జిల్లా కలెక్టర్‌తో పాటు,అదనపు జేసీ శేషాద్రి,డీఆర్వో మనోహర్ స్వీకరించారు. మొత్తం 241 ఫిర్యాదులు రాగా, పింఛన్ కోసం 778 వినతులు వచ్చాయి. న్యాయం చేయండి... తమకు తెలియకుండా ఎస్సీ కార్పొరేషన్ రుణాలను మాజీ సర్పంచ్ జక్కసాయన్న తమ సంతకాలను ఫోర్జరీ చేసి డబ్బులు డ్రా చేసుకున్నారని, తమకు న్యాయం చేయాలని బాల్కొండ మండలం బోదేపల్లికి చెందిన పలువురు లబ్ధిదారులు ఆరోపించారు. ఈ మేరకు వారు కలెక్టర్‌ను కలిసి కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ‘ఈ-పంచాయతీ’ మాకొద్దు. ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెడుతున్న ‘ఈ-పంచాయతీ’ల వల్ల తమ సర్వీసులు దెబ్బతింటాయని మీ-సేవ నిర్వాహకులు జిల్లా కలెక్టర్‌కు కలిసి వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మీ-సేవలో గల సర్వీసులను ఈ పంచాయతీలకు మార్చటం వల్ల మీ సేవ కేంద్రాలను మూసుకోవల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్నారు. ‘జాతరగా కలెక్టరేట్’ కలెక్టరేట్ ప్రాంగణమంతా జాతరను తలపించింది.ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ఆసరా పథకానికి దరఖాస్తులు పెరగడంతో జిల్లా కలెక్టర్ ప్రత్యేకంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. అక్కడే టెంట్లు ,నీటి సౌకర్యం కల్పించారు. గత రెండు వారాలుగా ఆసరా పథకం కోసం దరఖాస్తుదారుల సంఖ్య పెరగడంతో కలెక్టరేట్లో ప్రత్యేక కౌంటర్లు,సిబ్బందిని ఏర్పాటు చేశారు.వచ్చిన దరఖాస్తును వచ్చినట్లు ఆన్లైన్లో నమోదు చేశారు.