ఆసరా.. ఆలస్యం
♦ రెండు నెలలుగా ఇదే పరిస్థితి
♦ ఈసారి బ్యాంకుల విలీనంతో జాప్యం
సాక్షి, కొత్తగూడెం: ఎంకిపెళ్లి సుబ్బిచావుకు వచ్చింది’ అన్న చందంగా తయారైంది రాష్ట్రంలోని ఆసరా పింఛనర్ల పరిస్థితి. కుటుంబపరంగా ఎటువంటి ఆసరా లేని వారికి ప్రభుత్వం ఇస్తున్న రూ.1000 పింఛన్ ప్రతినెలా ఏదో ఒక కారణంతో ఆలస్యమవుతూనే ఉంది. జూన్ 6వ తేదీ వచ్చినా రాష్ట్రంలోని 36,37,949 మంది పింఛనర్లకు ఏప్రిల్ నెల పింఛన్ ఇవ్వకపోవడంతో తమ కుటుంబ అవసరాలు తీరక వృద్ధ పింఛనర్లు, వికలాంగులు, వితంతువులు పడుతున్న ఇబ్బందులు వర్ణనాతీతం.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో రాష్ట్రంలోని ఎస్‌బీహెచ్‌తో సహా ఐదు ప్రధాన బ్యాంకులు విలీనం కావడం వల్ల ఆయా బ్యాంకుల ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌లు మారడం, బ్యాంకుల కంప్యూటర్లపై పనిఒత్తిడి పెరగడంతో సర్వర్లు మొరాయించడం వంటి సాంకేతిక కారణాల వల్ల బ్యాంకుల్లో ఆసరా పింఛన్లు ఇంకా జమకాని పరిస్థితి నెలకొంది. ఈ సాంకేతిక సమస్యలు ఎప్పుడు తొలగుతాయో, తమ పింఛన్ ఎప్పుడు బ్యాంకులో పడుతుందో తెలియక పింఛనర్లు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
రాష్ట్రంలో 13,59,597 మంది వితంతు, 13, 31,103 మంది వృద్ధాప్య, 4,65,047 మంది వికలాంగులు, 34,728 మంది చేనేత కార్మికులు, 58, 372 మంది గీత కార్మికులు, 3, 48, 301 మంది బీడీ కార్మికులు, 40,801 మంది ఇతర పింఛనర్లు ప్రతినెలా ఆసరా పింఛన్ అందుకుంటున్నారు. బ్యాంకుల విలీనం పేరుతో ఈసారి పింఛన్ ఆలస్యం కాగా.. గత మార్చి నెల ఆసరా పింఛన్‌ను ప్రభుత్వం నుంచి బ్యాంకుల్లో నగదు జమ కాలేదన్న కారణంతో ఆ పింఛన్ ఏప్రిల్ 20 నుంచి 22 తేదీల్లో పడాల్సిన డబ్బును మే 5వ తేదీన పంపిణీ చేశారు.
ఇక ఏప్రిల్ నెల పింఛన్ మే 20 నుంచి 22వ తేదీలోగా బ్యాంకు ఖాతాల్లో జమ కావాల్సి ఉండగా, జూన్ 5 వరకు రాలేదు. అయితే కేవలం పింఛన్‌పైనే ఆధారపడి జీవితాలు కొనసాగిస్తున్న లక్షలాది మంది వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ఇప్పటికీ పింఛన్ అతీగతీ లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పింఛన్ల చెల్లింపులు బ్యాంకులకు అనుసంధానం చేయడంతో తమ ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయో లేదో తెలుసుకునేందుకు ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా వృద్ధులకు, వితంతువులకు రూ.వెయ్యి చొప్పున, వికలాంగులకు రూ.వెయ్యి నుంచి రూ.1500 వరకు పింఛన్‌ను బ్యాంకు ఖాతాల్లో జమ చేయాల్సి ఉంటుంది. ఈ ‘ఆసరా’తో పింఛనర్లు తమ నెలవారీ ఖర్చులను కొంతవరకైనా తీర్చుకునే అవకాశం ఉంటుంది. నిత్యావసరాలతోపాటు ఆస్పత్రులకు ఈ పింఛన్ నుంచే ఖర్చు చేస్తుంటారు. అయితే గతంలో పింఛన్లను నేరుగా లబ్ధిదారుల వద్దకే వెళ్లి ఇచ్చేవారు. కానీ గత రెండేళ్లుగా బ్యాంకు ఖాతాల్లో మాత్రమే పింఛన్లను జమ చేస్తున్నారు. దీనివల్ల అసలైన లబ్ధిదారులకే పింఛన్ లభించే అవకాశం ఉందనేది ప్రభుత్వ ఆలోచన. అయితే ఎంతోమంది వృద్ధులు, వికలాంగులు తమ పింఛన్ల కోసం బ్యాంకుకు వెళ్లలేని పరిస్థితుల్లో ఎవరో ఒకరిని బతిమాలి వారి సహాయంతో వెళ్లి పింఛన్లు తెచ్చుకుంటున్నారు.